భవిష్యత్ మొబైల్ బ్యాంకింగ్‌దే.. | HDFC Bank launches banking app for mobiles from Varanasi | Sakshi
Sakshi News home page

భవిష్యత్ మొబైల్ బ్యాంకింగ్‌దే..

Published Tue, Dec 23 2014 12:26 AM | Last Updated on Sat, Sep 2 2017 6:35 PM

భవిష్యత్ మొబైల్ బ్యాంకింగ్‌దే..

భవిష్యత్ మొబైల్ బ్యాంకింగ్‌దే..

ప్రాంతీయ భాషల్లోనూ యాప్స్, సేవలు
హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ డిజిటల్ బ్యాంకింగ్ హెడ్ నితిన్ చుగ్

హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: రాబోయే రోజుల్లో మొబైల్ బ్యాంకింగ్ మరింత ప్రాచుర్యంలోకి వస్తుందంటున్నారు హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ డిజిటల్ బ్యాంకింగ్ విభాగం హెడ్ నితిన్ చుగ్. ఇటీవల వారణాసిలో హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ నిర్వహించిన ఒక కార్యక్రమం సందర్భంగా సాక్షి బిజినెస్ బ్యూరోతో ఆయన మాట్లాడుతూ ప్రాంతీయ భాషల్లో కూడా యాప్స్, సర్వీసులను అందుబాటులోకి తేనున్నట్లు చెప్పారు.  ఆయన మాటల్లోనే మిగతా వివరాలు..
 
అరచేతిలో బ్యాంకు గురించి ..
ప్రస్తుతం దేశీయంగా 90 కోట్ల పైచిలుకు మొబైల్ యూజర్లలో .. 4 కోట్ల మంది మాత్రమే మొబైల్ బ్యాంకింగ్ సర్వీసులు వినియోగించుకుంటున్నారు. ఈ నేపథ్యంలోనే ఈ తరహా సర్వీసులను మరింత మందికి అందుబాటులోకి తేవడంపై దృష్టి సారిస్తున్నాం. బ్యాంకు శాఖలో లభ్యమయ్యే సేవలన్నీ ఇరవై నాలుగ్గంటలూ ఖాతాదారుకి అందుబాటులో ఉండేలా చూడాలన్నది మా ఉద్దేశం. అందుకే, అరచేతిలో ఇమిడిపోయే ఫోన్ ద్వారా ఏకంగా 75 రకాల లావాదేవీలను నిర్వహించే సౌలభ్యాన్ని కల్పిస్తున్నాం.

ఫిక్స్‌డ్, రికరింగ్ డిపాజిట్లు చేయడం, రుణం కోసం దరఖాస్తు చేసుకోవడం మొదలుకుని బీమా, మ్యూచువల్ ఫండ్స్ మొదలైన వాటిలో ఇన్వెస్ట్‌మెంట్ దాకా మొబైల్ ద్వారానే చేసుకోవచ్చు. భవిష్యత్‌లో ఈ లావాదేవీల సంఖ్యను వంద దాకా పెంచబోతున్నాం. హెచ్‌డీఎఫ్‌సీ సెక్యూరిటీస్ యాప్ ద్వారా స్టాక్స్‌లో ఆన్‌లైన్ ట్రేడింగ్ చేయడంతో పాటు ఎలక్ట్రానిక్ వీలునామా సర్వీసులు కూడా పొందవచ్చు. ఇలా ఫీచర్ ఫోన్లు మొదలుకుని.. స్మార్ట్‌ఫోన్స్ దాకా అన్ని రకాల హ్యాండ్‌సెట్స్‌లో పనిచేసేలా మా మొబైల్ బ్యాంకింగ్ అప్లికేషన్స్‌ను తీర్చిదిద్దుతున్నాం.   

55 శాతం మేర వినియోగం..
1999లో నెట్‌బ్యాంకింగ్ సర్వీసులు, 2000లో మొబైల్ సర్వీసులు ప్రారంభించాం. 2001లో మా రిటైల్ ఖాతాదారుల్లో ఈ సర్వీసులను వినియోగించుకునే వారి సంఖ్య సుమారు 3 శాతమే ఉండేది. ప్రస్తుతం ఇది ఏకంగా 55 శాతానికి పెరిగింది. ఫీచర్ ఫోన్ల యూజర్లు, గ్రామీణ ప్రాంతాల వారి కోసం ఉచిత టోల్ ఫ్రీ సేవలు గతేడాది ప్రవేశపెట్టాం. ఇంగ్లిష్‌తో పాటు హిందీలోనూ ఎస్‌ఎంఎస్ సర్వీసులు, యాప్స్‌ను అందిస్తున్నాం. త్వరలో 6-7 ప్రాంతీయ భాషల్లోనూ వీటిని ప్రవేశపెట్టబోతున్నాం. ఏ టెక్నాలజీనైనా అందిపుచ్చుకోవడంలో దక్షిణాది వారు అందరికన్నా ముందుంటున్నారు.

ఎంత వరకూ సురక్షితం..
మొబైల్ ద్వారా జరిపే బ్యాంకింగ్ లావాదేవీలు సురక్షితంగా ఉండేలా అన్ని జాగ్రత్తలూ తీసుకుంటున్నాం. మా అధికారిక వెబ్‌సైట్‌నే ఉపయోగిస్తున్నారన్న భరోసా కల్పించేందుకు ప్రత్యేకమైన ఇమేజి, సెక్యూరిటీ మెసేజీ  మొదలైనవి పొందుపర్చడం ఇందులో భాగమే. పైగా లావాదేవీలకు సంబంధించిన వివరాలు, పిన్ నంబరు మొదలైనవి ఎట్టి పరిస్థితుల్లోనూ హ్యాండ్‌సెట్‌లో స్టోర్ కావు.  కాబట్టి ఫోను పోయినా, డేటాకి వచ్చే సమస్యేమీ ఉండదు.

మొబైల్ బ్యాంకింగ్‌పైనా పరిమితులు..
బ్యాంకుల్లోనూ, ఏటీఎంలలోనూ జరిపే లావాదేవీలపై చార్జీలు, పరిమితులు వచ్చినట్లే.. మొబైల్ బ్యాంకింగ్ పైనా వస్తాయా అంటే అదంతా నియంత్రణ సంస్థ విధానాలపైనే ఆధారపడి ఉంటుంది. అది అనుమతిస్తేనే మేం చార్జీలు విధించేందుకు వీలుంటుంది. ప్రస్తుతానికి విధించవచ్చని, విధించకూడదనీ ఏమీ లేదు. కానీ అంతిమంగా ఖాతాదారుల ప్రయోజనాలను, సౌలభ్యాన్నీ దృష్టిలో ఉంచుకునే పనిచేస్తున్నాం.

బ్యాంకు శాఖల విస్తరణ..
డిజిటల్ బ్యాంకింగ్ లావాదేవీలు పెరుగుతున్న నేపథ్యంలో బ్యాంకు శాఖల విస్తరణను నిలిపివేయాలన్న యోచనేమీ లేదు. మారుమూల ప్రాంతాల్లో కూడా బ్యాంకింగ్ సేవలు అందించేందుకు మేం కట్టుబడి ఉన్నాం. అయితే, ఒకసారి ఖాతా తెరిచాక వారు బ్యాంకింగ్ లావాదేవీలను మరింత సులభతరంగా నిర్వహించుకునేందుకు వీలు కల్పించేందుకే ఈ డిజిటల్ సర్వీసులను ప్రోత్సహిస్తున్నాం.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement