తగ్గిన హెచ్‌డీఎఫ్‌సీ నికరలాభం
క్యూ1లో రూ.2,734 కోట్లు...
న్యూఢిల్లీ: హౌసింగ్ ఫైనాన్స్ దిగ్గజం హెచ్‌డీఎఫ్‌సీ కన్సాలిడేటెడ్ నికరలాభం 2017 జూన్‌తో ముగిసిన త్రైమాసికంలో...గతేడాది ఇదేకాలంతో పోలిస్తే స్వల్పంగా క్షీణించి రూ. 2,797 కోట్ల నుంచి రూ. 2,734 కోట్లకు తగ్గింది. కంపెనీ కన్సాలిడేటెడ్ ఆదాయం మాత్రం రూ. 13,531 కోట్ల నుంచి రూ. 14,463 కోట్లకు పెరిగింది. స్టాండెలోన్ ప్రాతిపదికన హెచ్‌డీఎఫ్‌సీ నికరలాభం రూ. 1,871 కోట్ల నుంచి రూ. 1,556 కోట్లకు పడిపోయింది. స్టాండెలోన్ నికరలాభాన్ని గతేడాది జూన్ క్వార్టర్‌తో పోల్చిచూడరాదని, ఆ క్వార్టర్లో హెచ్‌డీఎఫ్‌సీ ఈర్గో జనరల్ షేర్లను విక్రయించడంతో రూ. 275 కోట్ల వన్‌టైమ్ ప్రత్యేక కేటాయింపును లాభనష్టాల ఖాతాలో చూపించినట్లు హెచ్‌డీఎఫ్‌సీ విడుదల చేసిన ప్రకటన పేర్కొంది.
తాజా త్రైమాసికంలో కంపెనీ స్టాండెలోన్ ఆదాయం రూ. 8,393 కోట్ల నుంచి రూ. 8,142 కోట్లకు తగ్గింది. ముగిసిన త్రైమాసికంలో వ్యక్తిగత రుణ పంపిణీలు 21 శాతం వృద్ధిచెందాయని, 2017 జూన్ 30నాటికి తమ మొత్తం లోన్ బుక్ రూ. 2.66 లక్షల కోట్ల నుంచి రూ. 3.13 లక్షల కోట్లకు చేరిందని హెచ్‌డీఎఫ్‌సీ తెలిపింది. మొత్తం స్థూల మొండి బకాయిలు రూ. 3,513 కోట్లని (1.12 శాతం) కంపెనీ ప్రకటన పేర్కొంది.