
హెరిటేజ్ ఫుడ్స్ లాభం రూ. 18 కోట్లు
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: గత ఆర్థిక సంవత్సరం నాలుగో త్రైమాసికంలో హెరిటేజ్ ఫుడ్స్ నికర లాభం (కన్సాలిడేటెడ్) దాదాపు 41% వృద్ధి చెంది రూ. 12.75 కోట్ల నుంచి రూ. 18.04 కోట్లకు పెరిగింది. ఆదాయం రూ. 544 కోట్ల నుంచి సుమారు రూ. 633 కోట్లకు చేరింది. మరోవైపు పూర్తి ఆర్థిక సంవత్సరం హెరిటేజ్ ఫుడ్స్ లాభం రూ. 28 కోట్ల నుంచి రూ. 55 కోట్లకు పెరగ్గా.. ఆదాయం రూ. 2,073 కోట్ల నుంచి రూ. 2,381 కోట్లకు చేరింది. మార్చి నెలలో అనంతపురం జిల్లా వజ్రకరూర్‌లోని ప్లాంటులో స్వంత వినియోగం కోసం 2.1 మెగావాట్ల పవన విద్యుత్ యూనిట్ ఏర్పాటు చేసినట్లు కంపెనీ పేర్కొంది.
రూ. 10 ముఖవిలువ చేసే షేరు ఒక్కింటికి రూ. 3 తుది డివిడెండును ప్రకటించింది. ఇటీవల పనామా పేపర్స్‌లో ప్రస్తావనకొచ్చిన నాన్ ఎగ్జిక్యూటివ్ స్వతంత్ర డెరైక్టర్ ఎం శివరామ వరప్రసాద్ రాజీనామాను కంపెనీ బోర్డు ఆమోదించింది. అలాగే, కర్ణాటకలోని సింధనూర్‌లో ఉన్న తేజా డైరీ అసెట్స్‌ను రూ. 60 లక్షలకు కొనుగోలు చేసేందుకు ఆమోదముద్ర వేసింది. రోజుకు 20,000 లీటర్ల ప్రాసెసింగ్ సామర్ధ్యం తేజా డైరీ ప్లాంటుకున్నట్లు పేర్కొంది.