47 శాతం తగ్గిన హిందుస్తాన్ జింక్ లాభం
ఆదాయం 30 శాతం డౌన్
న్యూఢిల్లీ: హిందుస్తాన్ జింక్ నికర లాభం ఈ ఆర్థిక సంవత్సరం మొదటి త్రైమాసిక కాలానికి 47 శాతం తగ్గింది. గత ఆర్థిక సంవత్సరం క్యూ1లో రూ.1,940 కోట్లుగా ఉన్న నికర లాభం ఈ ఆర్థిక సంవత్సరం క్యూ1లో రూ.1,037 కోట్లకు తగ్గిందని హిందుస్తాన్ జింక్ తెలిపింది. ఉత్పత్తి వ్యయం బాగా పెరగడం, పన్నులు, తరుగుదల అధికంగా ఉండడమే దీనికి కారణమని హిందుస్తాన్ జింక్ చైర్మన్ అగ్నివేశ్ అగర్వాల్ చెప్పారు. మొత్తం ఆదాయం రూ.3,630 కోట్ల నుంచి 30 శాతం క్షీణించి రూ.2,531 కోట్లకు తగ్గిందని తెలిపారు.
సీక్వెన్షియల్ ప్రాతిపదికన చూస్తే రాబడి 19 శాతం తగ్గిందని పేర్కొన్నారు జింక్ అమ్మకాలు తక్కువగా ఉన్నప్పటికీ, తీవ్రంగా ఉన్న రూపాయి ఒడిదుడుకులు, అధిక స్థాయిలో ఉన్న వెండి ధరలు దెబ్బకొట్టాయని వివరించారు.ఇబిటా 33 శాతం క్షీణించి రూ.1,130 కోట్లకు తగ్గిందని, అంతకు ముందటి క్వార్టర్‌తో పోల్చితే 13 శాతం తగ్గిందని తెలిపారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మొదటి త్రైమాసిక కాలంలో జింక్ ధరలు 14 శాతం పెరిగాయని, మైనింగ్ కార్యకలాపాలు చురుకుగా సాగుతున్నాయని పేర్కొన్నారు. ఆర్థిక ఫలితాల నేపథ్యంలో బీఎస్‌ఈలో ఈ షేర్ 1.3 శాతం లాభంలో రూ.194 వద్ద ముగిసింది.