హెచ్పీఎల్ ఐపీఓకు 8 రెట్ల స్పందన
న్యూఢిల్లీ: హెచ్‌పీఎల్ ఎలక్ట్రిక్ అండ్ పవర్ కంపెనీ ఐపీఓ (ఇనీషియల్ పబ్లిక్ ఆఫర్)కు ఇన్వెస్టర్ల నుంచి మంచి స్పందన లభించింది. సోమవారం ముగిసిన ఈ ఐపీఓ 8 రెట్లు ఓవర్ సబ్‌స్క్రైబ్ అయింది. ఈ ఐపీఓలో భాగంగా కంపెనీ జారీ చేయనున్న 1.44 కోట్ల షేర్లకు 11.53 కోట్ల షేర్ల బిడ్‌లు వచ్చాయి. క్వాలిఫైడ్ ఇన్‌స్టిట్యూషనల్ బయ్యర్స్(క్విబ్)కు కేటాయించిన వాటా 5.7 రెట్లు, సంస్థాగేతర ఇన్వెస్టర్లకు కేటాయించిన వాటా 7.9 రెట్లు, రిటైల్ ఇన్వెస్టర్ల వాటా 2.4 రెట్లు చొప్పున ఓవర్ సబ్‌స్క్రైబయ్యాయి. ఒక్కో షేర్‌ను రూ.202 ధరకు కేటాయించి యాంకర్ ఇన్వెస్టర్ల నుంచి ఈ కంపెనీ ఇప్పటికే రూ.108 కోట్లు సమీకరించింది. ఈ నెల 22న ప్రారంభమైన ఈ రూ.361 కోట్ల ఐపీఓకు ధరల శ్రేణి రూ.175-202గా ఉంది.