
హుదూద్ ప్రభావిత ప్రాంతాల్లో నెట్‌వర్క్ పునరుద్ధరణ
హుదూద్ ప్రభావిత ప్రాంతాల్లో నెట్‌వర్క్ పునరుద్ధరణలో టెలికం కంపెనీలు నిమగ్నమయ్యాయి.
టెలికం కంపెనీలు
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: హుదూద్ ప్రభావిత ప్రాంతాల్లో నెట్‌వర్క్ పునరుద్ధరణలో టెలికం కంపెనీలు నిమగ్నమయ్యాయి. కీలక ప్రాంతాల్లో నెట్‌వర్క్ పునరుద్ధరించామని ఎయిర్‌టెల్ బుధవారం ప్రకటించింది. మిగిలిన ప్రాంతాలనూ కలిపే పనిలో ఉన్నట్టు తెలిపింది. అలాగే ఎయిర్‌టెల్ వీశాట్ లింక్‌తో ఏటీఎంలను అనుసంధానిస్తున్నట్టు వెల్లడించింది. శ్రీకాకుళం, విజయనగరం, విశాఖ, తూర్పుగోదావరి జిల్లాలకు చెందిన ఎయిర్‌టెల్ కస్టమర్లకు 10 నిమిషాల ఉచిత టాక్‌టైం అందించింది. 52141 డయల్ చేయడం ద్వారా రూ.50 వరకు అడ్వాన్స్ టాక్‌టైం పొందొచ్చని పేర్కొంది.
రిలీఫ్ క్యాంపుల్లో ఉచితంగా ఫోన్ చేసుకునేందుకు పీసీలను ఏర్పాటు చేస్తోంది. వొడాఫోన్ ఇప్పటికే 50%పైగా సైట్లను పునరుద్ధరించింది. హుదూద్ ప్రభావిత జిల్లాల్లోని కస్టమర్లకు ఉచిత టాక్‌టైంను అందించింది. గుర్తింపు పత్రాలు లేకున్నా ప్రత్యేక సిమ్‌లనూ జారీ చేసింది. ఇతర టెల్కోలతో ఒప్పందాల ద్వారా కవరేజ్‌ను విస్తరిస్తోంది. పునరావాస పనుల్లో ప్రభుత్వానికి చేదోడుగా ఉండేందుకు వీలుగా మోయగలిగే చిన్నపాటి సైట్లను కంపెనీ ఏర్పాటు చేస్తోంది. ఎయిర్‌సెల్, ఆర్‌కామ్‌తోపాటు ఇతర టెలికం కంపెనీలు ఉచిత కాల్ సెంటర్ నంబర్ 1949ని అందుబాటులోకి తెచ్చాయి. ఆచూకీ దొరక్కుండా పోయిన వారి ఫోన్ స్విచ్ఛాఫ్‌కు ముందు చివరిసారిగా ఏ టవర్ వద్ద నమోదైందో ఈ టోల్ ఫ్రీ నంబరు ద్వారా తెలుసుకోవచ్చు.