న్యూఢిల్లీ: పెద్ద నోట్ల రద్దుతో కుదేలైన హౌసింగ్ రంగం క్రమంగా పుంజుకుంటున్న దాఖలాలు కనిపిస్తున్నాయి. నేషనల్ క్యాపిటల్ రీజియన్ (ఎన్‌సీఆర్) సహా హైదరాబాద్ తదితర ప్రాంతాల్లో ఏప్రిల్–జూన్ త్రైమాసికంలో ఇళ్ల అమ్మకాల గణాంకాలు ఇందుకు ఊతమిస్తున్నాయి. ప్రాపర్టీ కన్సల్టెంట్ అనరాక్ నివేదిక ప్రకారం అంతక్రితం త్రైమాసికంతో పోలిస్తే ఏప్రిల్–జూన్ త్రైమాసికంలో గృహాల అమ్మకాలు హైదరాబాద్‌లో 25% పెరిగాయి. 4,750 యూనిట్లుగా నమోదయ్యాయి.
అటు, ఎన్‌సీఆర్‌లో 23%(11,150 యూనిట్లు), బెంగళూరులో అత్యధికంగా 27%(14,600), ముంబైలో 26%(15,200 యూనిట్లు) వృద్ధి నమోదైంది. హైదరాబాద్ సహా ఏడు ప్రధాన నగరాల గణాంకాలను ఈ నివేదికలో పరిగణనలోకి తీసుకున్నట్లు అనరాక్ ప్రాపర్టీ కన్సల్టెంట్ అనుజ్ పురి తెలిపారు. చెన్నై, కోల్‌కతా మినహా మిగతా అన్ని చోట్ల ప్రాపర్టీ ధరలు 1% మేర పెరిగాయి. అమ్ముడు కాని గృహాల సంఖ్య ఇంకా గణనీయంగా ఉండటం వల్ల ధరల పెరుగుదల అంతగా లేదని అనుజ్ వివరించారు.
జనవరి–మార్చి త్రైమాసికంతో పోలిస్తే జూన్ త్రైమాసికంలో టాప్ 7 నగరాల్లో ఇళ్ల అమ్మకాలు 24% పెరిగినట్లు ఆయన తెలిపారు. మొత్తం మీద 60,800 యూనిట్లు అమ్ముడవగా.. ఇందులో ఎన్‌సీఆర్, బెంగళూరు, పుణె, ముంబై మెట్రోపాలిటన్ రీజియన్ వాటానే 81% మేర ఉన్నట్లు వివరించారు. అమ్ముడు కాని గృహాలను ఆకర్షణీయమైన పథకాలు, ఉచిత ఆఫర్లు, డిస్కౌంట్లతో విక్రయించేందుకు డెవలపర్లు ప్రయత్నాలు కొనసాగిస్తున్నట్లు అనుజ్ చెప్పారు.
Comments
Please login to add a commentAdd a comment