
హైదరాబాద్: దేశీ ఫార్మా సంస్థలకు కీలక మార్కెట్టయిన అమెరికా నుంచి అదేపనిగా ఎదురుదెబ్బలు తగులుతూనే ఉన్నాయి. భారీ ఎత్తున పలు సంస్థల తాలూకు తయారీ యూనిట్లను తనిఖీ చేయటం, ఇంపోర్ట్ అలర్ట్‌లు జారీ చేయటం వంటి వ్యవహారాలన్నీ గతేడాది నడిచాయి. తాజాగా 18 సంస్థలపై కూడబలుక్కుని కొన్ని ఔషధాల రేట్లను కృత్రిమంగా పెంచేశాయంటూ అభియోగాలు నమోదయ్యాయి.
ఈ జాబితాలో డాక్టర్ రెడ్డీస్ ల్యాబొరేటరీస్(డీఆర్‌ఎల్), సన్‌ఫార్మా, గ్లెన్‌మార్క్ తదితర దిగ్గజాలున్నాయి. దీంతో వీటన్నింటిపై అమెరికా న్యాయశాఖ దృష్టి సారిస్తోంది. వాషింగ్టన్ రాష్ట్ర అటార్నీ జనరల్ బాబ్ ఫెర్గూసన్ ఒక ప్రకటనలో ఈ విషయాలు వెల్లడించారు. ‘‘మొదట 2 ఔషధాలకు సంబంధించి 6 సంస్థలపై ఫిర్యాదులొచ్చాయి. ఇపుడు ఔషధాల సంఖ్య 6కు, కంపెనీల సంఖ్య 18కి పెరిగింది’’ అని ఆయన పేర్కొన్నారు.
తనతో పాటు మరో 45 రాష్ట్రాల అటార్నీ జనరల్స్ ఈ అంశంపై ఫెడరల్ కోర్టును ఆశ్రయించినట్లు ఫెర్గూసన్ తెలియజేశారు. జనరిక్ ఔషధాల రేట్లను పెంచేయడం, పోటీని తగ్గించుకునేలా మార్కెట్‌ను వాటాలుగా పంచుకోవడం ద్వారా ఈ కంపెనీలు విశ్వాస చట్టాలను ఉల్లంఘించాయని రాష్ట్రాలు ఆరోపించాయి. ఈ పరిణామాలతో కొన్ని ఔషధాల ధరలు ఏకంగా 1,000 శాతం మేర పెరిగిపోయాయని పేర్కొన్నాయి.
సాధారణంగా బ్రాండెడ్ ఔషధాల పేటెంటు గడువు ముగిశాక ఇతర సంస్థలు వాటి జనరిక్ వెర్షన్‌ను తయారు చేసి చౌకగా అందుబాటులోకి తెస్తుంటాయి. బ్రాండెడ్ ఔషధం కన్నా వీటి రేటు దాదాపు 80 శాతం దాకా తక్కువగా ఉంటుంది.
2015లో అమెరికా మార్కెట్లో జనరిక్స్ అమ్మకాలు దాదాపు 74.5 బిలియన్ డాలర్లు. అమెరికాలో డాక్టర్లు రాసే ఔషధాల్లో 88 శాతం జనరిక్ ఫార్మా సంస్థల ఉత్పత్తులే ఉంటున్నాయి. ప్రధానంగా జనరిక్స్ తయారు చేసే భారత ఫార్మా సంస్థలకు అమెరికా మార్కెట్ కీలకంగా ఉంటోంది. ఇప్పటిదాకా అక్కడి ఔషధ ప్రమాణాల నియంత్రణ సంస్థ ఎఫ్‌డీఏ తనిఖీల రూపంలో ఇబ్బందులు ఎదుర్కొంటున్న దేశీ సంస్థలకు తాజా అభియోగాలు మరింత సమస్యాత్మకంగా మారనున్నాయి.
విచారణ మొదలైందిలా...: కొన్ని ఔషధాల ధరలు అనుమానాస్పద స్థాయిలో వెయ్యి శాతానికి పైగా పెరిగిపోవడంపై 2014 జూలైలో అమెరికాలోని కనెక్టికట్ రాష్ట్రం విచారణ ప్రారంభించింది. తరవాత ఈ జాబితాలో మరిన్ని రాష్ట్రాలు చేరాయి.
దీనిపై జరిగిన దర్యాప్తులో కొన్ని జనరిక్ ఔషధాల రేట్లను కుమ్మక్కై నిర్ణయించడం, అధిక ధరలను కొనసాగించడం, మార్కెట్లను పంచుకోవడం, తద్వారా పోటీని తగ్గించుకోవడం కోసం ప్రయత్నాలు జరిగాయనేందుకు పలు కంపెనీల అధికారులు, మార్కెటింగ్.. సేల్స్ ఎగ్జిక్యూటివ్స్ మధ్య ఫోన్‌కాల్స్, టెక్ట్స్ మెసేజీలు, ఈమెయిల్స్ రూపంలో ఆధారాలు దొరికినట్లు అటార్నీ జనరల్ పేర్కొన్నారు.
ఆ తర్వాత 2016 డిసెంబర్ 14న యాంటీబయాటిక్ డాక్సిసైక్లిన్ హైక్లేట్, మధమేహ చికిత్సలో ఉపయోగించే గ్లైబురైడ్ విషయంలో పెన్సిల్వేనియాలోని ఓ కోర్టులో దావా దాఖలైంది. హెరిటేజ్ ఫార్మా, అరబిందో ఫార్మా యూఎస్‌ఏ, సిట్రాన్ ఫార్మా, మేన్ ఫార్మా, మైలాన్ ఫార్మా, టెవా ఫార్మా యూఎస్‌ఎలపై(6 సంస్థలు) అభియోగాలు నమోదయ్యాయి. అయితే ఆ తర్వాత మిగతా రాష్ట్రాలు చేరడంతో ఈ జాబితా డీఆర్‌ఎల్ సహా 18కి చేరింది.
విచారణలో సహకరిస్తాం..
అమెరికా న్యాయశాఖ ఈ విషయంలో విచారణ జరుపుతోందన్న సంగతి తమకు కూడా తెలుసని డీఆర్‌ఎల్ తెలిపింది. దీనిపై అధికారులకు పూర్తిగా సహకరించడం కొనసాగిస్తామని, న్యాయపరిధిలో ఉన్నందున ఈ అంశంపై వ్యాఖ్య చేయలేమని వివరించింది. మైలాన్ కూడా ఈ అభియోగాలపై స్పందించింది. తాము అంతర్గతంగా పూర్తి స్థాయిలో విచారణ జరిపామని, ధరలపై కుమ్మక్కు అభియోగాలకు ఆధారాల్లేవని పేర్కొంది.
Comments
Please login to add a commentAdd a comment