భారత్ కు వచ్చే ఉద్దేశం లేదు.. | I am in 'forced exile', no plans to return to India: Mallya | Sakshi
Sakshi News home page

భారత్ కు వచ్చే ఉద్దేశం లేదు..

Published Sat, Apr 30 2016 1:00 AM | Last Updated on Tue, Oct 2 2018 8:44 PM

భారత్ కు వచ్చే ఉద్దేశం లేదు.. - Sakshi

భారత్ కు వచ్చే ఉద్దేశం లేదు..

మౌనం వీడిన విజయ్‌మాల్యా
‘బలవంతపు ప్రవాస’ స్థితిలో ఉన్నట్లు వ్యాఖ్య

 లండన్: బ్యాంకుల చేత ‘ఉద్దేశపూర్వక ఎగవేతదారు’గా ముద్ర వేయించుకుని బ్రిటన్‌లో ఉన్న పారిశ్రామికవేత్త విజయ్‌మాల్యా భారత్‌కు వచ్చే విషయంపై నెలకొన్న సస్పెన్స్‌కు తెరదించారు. తనకు సంబంధించి పరిస్థితులు తీవ్రంగా ఉన్న భారత్‌కు తిరిగి వెళ్లే తక్షణ ప్రణాళికలు ఏవీ లేవని స్పష్టం చేశారు. ప్రస్తుతం తాను ‘బలవంతపు ప్రవాస’ స్థితిలో ఉన్నట్లు వ్యాఖ్యానించారు.  సెంట్రల్ లండన్ మేఫియర్‌లో మాల్యాతో ఇంటర్వ్యూ తీసుకున్నట్లు ఫైనాన్షియల్ టైమ్స్ పేర్కొంది. మీ కష్టాలకు కారణం ఎవరనుకుంటున్నారన్న ప్రశ్నకు  ‘ దీనిని నేనూ తెలుసుకోవాలనుకుంటున్నాను’ అని మాల్యా అన్నారు.  ఇంటర్వ్యూలో ముఖ్యాంశాలు...

 బ్యాంకులతో పరిష్కారానికి సిద్ధం...
బ్యాంకులతో రుణ సమస్యల పరిష్కారానికి సిద్ధంగా ఉన్నాను. అయితే రుణ మొత్తం రూ.5,000 కోట్లే. రూ.9,000 కోట్లు కాదు. నా పాస్‌పోర్ట్‌ను తీసుకోవడం, అరెస్ట్ చేయడం వంటి చర్యల వల్ల నా నుంచి ఎటువంటి డబ్బూనూ రాబట్టుకోలేరు.

 రావడానికి సిద్ధమే కానీ..: భారత్‌కు కచ్చితంగా తిరిగి వస్తాను. అయితే ఇప్పుడు కాదు. అక్కడ నాకు సంబంధించిన పరిస్థితులు తీవ్రంగా ఉన్నాయి. నా పాస్‌పోర్ట్‌ను రద్దు చేశారు. ఇది అసాధారణ చర్య. ప్రభుత్వం తరువాత ఏమి చేయబోతోందో నాకు తెలియదు. భారత్‌లో నాకు ప్రతికూల పరిస్థితి ఉన్నం దున, బ్రిటన్‌లో ఉండడానికే ఇష్టపడుతున్నాను.

 మీడియా అభిప్రాయాన్ని మలుస్తోంది...
నా మీద ఒక అభిప్రాయం ప్రజల్లో ఏర్పడేట్లు ఎలక్ట్రానిక్ మీడియా వ్యవహరిస్తోంది. ప్రజల్లోనే కాదు. ప్రభుతం సైతం నాపై తీవ్ర చర్యలు తీసుకునేలా అభిప్రాయాన్ని మలుస్తోంది.

 తప్పు చేయలేదు..: నేను ఎటువంటి తప్పూ చేయలేదు. కింగ్‌ఫిషర్ కార్యకలాపాలకు తీసుకున్న రుణాలను విదేశాల్లో ఆస్తులు కొనుగోలు చేయడానికి మళ్లించాననడంలో ఎటువంటి వాస్తవం లేదు. ప్రపంచంలో అత్యుత్తమ ఫోరిన్‌సిక్ ఆడిటర్‌ను కింగ్‌ఫిషర్ అకౌంట్లను పరిశీలించడానికి భారత్ ప్రభుత్వం నియమించవచ్చు. బ్యాంకుల నుంచి తీసుకున్న రుణాలను దుర్వినియోగం చేశానో...లేదో పరిశీలించవచ్చు. వారు ఎటువంటి తప్పునూ కనిపెట్టలేరని నేను కచ్చితంగా చెప్పగలను. ఎందుకంటే అదే నిజం కాబట్టి.

 అయ్యిందేదో అయిపోయింది...
కారణాలు ఏమైనప్పటికీ, ఒకప్పుడు నన్ను ‘కింగ్ ఆఫ్ గుడ్ టైమ్స్’ అన్నారు. ఇప్పుడు ‘కింగ్ ఆఫ్ బ్యాడ్ టైమ్స్’ అంటున్నారు. వ్యక్తిగత ప్రతిష్టకు సంబంధించి ఎలా నడుచుకుంటే బాగుండేది? ఏమి చేయకుండా ఉండి ఉండాల్సింది? వంటి అంశాలు ప్రస్తుతం నాకు సంబంధించినంతవరకూ గతం.

 డియాజియోపై డీఆర్‌టీ ఆగ్రహం...
మాల్యాకి ఇవ్వాల్సిన 75 మిలియన్ డాలర్ల ప్యాకేజీ వివరాలను సమర్పించాలని ఆదేశాలు జారీ చేసినప్పటికీ, దీనిని అమలు చేయనందుకు బ్రిటన్ లిక్కర్ దిగ్గజం- డియాజియో కంపెనీపై బెంగళూరు డెట్ రికవరీ ట్రిబ్యునల్ (డీఆర్‌టీ) శుక్రవారం ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ విషయంలో ఎందుకు ఆలస్యం చేస్తున్నారని డీఆర్‌టీ ప్రిసైడింగ్ అధికారి సీఆర్ బెనకనహల్లి కంపెనీ న్యాయవాదిని ప్రశ్నించారు. మే 12వతేదీ లోపు ఈ వివరాలను సమర్పించాలని ఆదేశించారు. తదుపరి కేసు విచారణను జూన్ 2వ తేదీకి వాయిదా వేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement