ఎఫ్‌డీ.. డెట్‌ ఫండ్‌.. ఏది బెటర్‌? | I would like to invest for four years in a debt fund | Sakshi
Sakshi News home page

ఎఫ్‌డీ.. డెట్‌ ఫండ్‌.. ఏది బెటర్‌?

Published Mon, Feb 25 2019 1:14 AM | Last Updated on Mon, Feb 25 2019 1:14 AM

I would like to invest for four years in a debt fund - Sakshi

నేను కొంత మొత్తాన్ని డెట్‌ ఫండ్‌లో నాలుగేళ్ల పాటు ఇన్వెస్ట్‌ చేద్దామనుకుంటున్నాను. 8 శాతానికి పైగా రాబడినిచ్చే డెట్‌ ఫండ్స్‌ ఉన్నాయా? బ్యాంక్‌ డిపాజిట్లతో పోల్చితే డెట్‌ ఫండ్స్‌లో ఇన్వెస్ట్‌ చేయడం వల్ల ఏమైనా పన్ను ప్రయోజనాలు ఉంటాయా?  –ప్రియ, హైదరాబాద్‌ 
డెట్‌ ఫండ్స్‌లో షార్ట్‌ డ్యురేషన్‌ ఫండ్స్‌ 8 శాతానికి పైగా రాబడినిచ్చే అవకాశాలున్నాయి. మ్యూచువల్‌ ఫండ్స్‌లో రాబడులు ఖచ్చితంగా ఇంత వస్తాయనే గ్యారంటీ ఏమీ లేదు. అదే మీరు ఏదైనా బ్యాంక్‌లో ఫిక్స్‌డ్‌ డిపాజిట్‌ చేశారనుకోండి, ఏడాది తర్వాత ఇంత మొత్తం, రెండేళ్ల తర్వాత ఇంత మొత్తం ఇలా మీకు గ్యారంటీగా ఎంత రాబడులు వస్తాయో ముందే తెలుస్తుంది. కానీ మ్యూచువల్‌ ఫండ్స్‌లో అలా గ్యారంటీగా రాబడులు రావు. కాకుంటే చాలా డెట్‌ ఫండ్స్‌ గతంలో 8 శాతానికి పైగా  రాబడులు ఇచ్చాయి. కాబట్టి భవిష్యత్తులో కూడా ఈ స్థాయి రాబడులు రావచ్చనే అంచనాలు ఉంటాయి. ఇక ఫిక్స్‌డ్‌ డిపాజిట్లతో పోల్చితే డెట్‌ ఫండ్స్‌లో ఇన్వెస్ట్‌ చేయడం వల్ల మీకు అదనంగా పన్ను ప్రయోజనాలు లభిస్తాయి. మీరు కొంత మొత్తాన్ని బ్యాంక్‌లో ఫిక్స్‌డ్‌ డిపాజిట్‌ చేశారనుకుందాం. దీనిపై వచ్చే వడ్డీపై మీరు పన్ను చెల్లించాల్సి ఉంటుంది. ఈ వడ్డీని మీ ఆదాయానికి కలపి పన్ను లెక్కిస్తారు. మీరు 30 శాతం పన్ను శ్లాబులో ఉంటే, ఆ శ్లాబ్‌ప్రకారం పన్ను చెల్లించాల్సి ఉంటుంది. అదే మీరు డెట్‌ మ్యూచువల్‌ ఫండ్స్‌లో ఇన్వెస్ట్‌ చేశారనుకుందాం. మూడేళ్లలోపు ఎప్పుడైనా ఈ ఫండ్‌ యూనిట్లను విక్రయిస్తే, వచ్చే లాభాలను మీ ఆదాయానికి కలిపి పన్ను లెక్కిస్తారు. మీరు యూనిట్లను విక్రయించినప్పుడు మాత్రమే పన్ను చెల్లించాల్సి ఉంటుంది. అదే ఫిక్స్‌డ్‌ డిపాజిట్‌ అనుకోండి. ప్రతీ ఏడాది వచ్చే వడ్డీని పరిగణనలోకి తీసుకొని పన్ను లెక్కిస్తారు. మూడేళ్ల తర్వాతనే డెట్‌ మ్యూచువల్‌ ఫండ్‌ యూనిట్లను విక్రయించారనుకుందాం. అప్పుడు వచ్చే లాభాలను దీర్ఘకాలిక మూలధన లాభాలుగా పరిగణిస్తారు. అప్పుడు మీరు ఇండేక్సేషన్‌ ప్రయోజనాలు కూడా పొందవచ్చు. వచ్చిన లాభాల నుంచి ద్రవ్యోల్బణాన్ని తీసివేసి 20 శాతం చొప్పున పన్ను విధిస్తారు.  

ఊళ్లో పొలం అమ్మగా నా వాటా కింద రూ.8 లక్షలు వచ్చాయి. దీంట్లో మూడు లక్షలు మా అమ్మ పేరు మీద ఫిక్స్‌డ్‌ డిపాజిట్‌ చేసి వడ్డీకి ఆమెకు అందే ఏర్పాటు చేశాను. మిగిలిన రూ.5 లక్షలను ఒక ఆర్బిటేజ్‌ ఫండ్‌లో ఇన్వెస్ట్‌ చేయాలనుకుంటున్నాను. ఈ ఫండ్‌ నుంచి సిస్టమేటిక్‌ ట్రాన్స్‌ఫర్‌ ప్లాన్‌(ఎస్‌టీపీ) విధానంలో ఏదైనా ఇండెక్స్‌ ఫండ్‌లోకి బదిలీ చేయాలనేది నా ఆలోచన.  మార్కెట్‌ ఒడిదుడుకులమయంగా ఉన్న ప్రస్తుత పరిస్థితుల్లో ఇది సరైన నిర్ణయమేనా?– సురేందర్, విశాఖపట్టణం  
మార్కెట్‌ ఒడిదుడుకులమయంగా ఉన్న ప్రస్తుత పరిస్థితుల్లో పెద్ద మొత్తాన్ని ఆర్బిట్రేజ్‌ ఫండ్‌లో ఇన్వెస్ట్‌ చేసి, ఎస్‌టీపీ ద్వారా ఇండెక్స్‌ ఫండ్స్‌లోకి బదిలీ చేయాలన్న మీ వ్యూహం మంచిదే. కానీ ఆర్బిట్రేజ్‌ ఫండ్‌కు బదులుగా మీరు లిక్విడ్‌ ఫండ్‌ను ఎంచుకోండి. ఈ రెండు ఫండ్స్‌కు తేడా పెద్దగా ఏమీ ఉండదు. ఆర్బిట్రేజ్‌  ఫండ్స్‌ల్లో ఇన్వెస్ట్‌ చేయడం వల్ల పన్ను ప్రయోజనాలు లభించినప్పటికీ, ఈ ఫండ్స్‌ చాలా
తక్కువ రాబడులను ఇస్తున్నాయి. అలా కాకుండా లిక్విడ్‌ ఫండ్స్‌లో ఇన్వెస్ట్‌ చేస్తే, మీకు కొంచెం ఎక్కువ రాబడులు వచ్చే అవకాశాలు ఉన్నాయి.  

నేను ఇటీవలే ఉద్యోగంలో చేరాను. మ్యూచువల్‌ ఫండ్స్‌లో నెలకు కొంత మొత్తం ఇన్వెస్ట్‌ చేద్దామనుకుంటున్నాను. ఈ విషయంలో నాకు తగిన సూచనలివ్వండి.
–కార్తికేయ, ఈ మెయిల్‌ ద్వారా 

మీరు ఈక్విటీ, ఫండ్స్‌ల్లో ఇన్వెస్ట్‌ చేసే ముందు మొదటగా అత్యవసర నిధి ఏర్పాటు చేసుకోవాలి. మీ ఆరు నెలల అవసరాలకు సరిపడే మొత్తంతో ఈ అత్యవసర నిధిని ఏర్పాటు చేసుకోండి. ఈ మొత్తాన్ని బ్యాంక్‌ ఖాతాలో ఉంచడమో లేదా లిక్విడ్‌ ఫండ్‌లో ఇన్వెస్ట్‌ చేయడమో చేయండి. అత్యవసర నిధి తయారైన తర్వాత నెలకు కొంత మొత్తాన్ని ఈక్విటీ ఫండ్స్‌లో ఇన్వెస్ట్‌ చేయడంతో పాటు టర్మ్‌ ఇన్సూరెన్స్‌ పాలసీ తీసుకోండి. అది కూడా ఆన్‌లైన్‌లోనే తీసుకోండి. చిన్న వయస్సులో టర్మ్‌ బీమా పాలసీ తీసుకుంటే, మీకు ఎక్కువ బీమా కవరేజ్, తక్కువ ప్రీమియమ్‌ వంటి ప్రయోజనాలు లభిస్తాయి. ఇక ఫండ్స్‌లో ఇన్వెస్ట్‌మెంట్స్‌ విషయానికొస్తే...  సమీప భవిష్యత్తులో  అవసరం పడని డబ్బులనే మీరు ఈ ఈక్విటీ ఫండ్‌లో ఇన్వెస్ట్‌ చేయాలి. మీరు మ్యూచువల్‌ ఫండ్స్‌లో కొత్తగా ఇన్వెస్ట్‌ చేస్తున్నారు. కాబట్టి ముందుగా హైబ్రిడ్‌ ఫండ్స్‌తో మీ ఇన్వెస్ట్‌మెంట్స్‌ను ఆరంభించండి. ఈ హైబ్రిడ్‌ ఫండ్స్‌ తమ కార్పస్‌లో మూడింట రెండొంతులు ఈక్విటీలో ఇన్వెస్ట్‌ చేస్తాయి. మిగిలిన మొత్తాన్ని స్థిరాదాయ సాధనాల్లో ఇన్వెస్ట్‌ చేస్తాయి. ఇలా చేయడం వల్ల మార్కెట్‌ పడిపోయినప్పుడు  ఒకింత రక్షణ హైబ్రిడ్‌ ఫండ్స్‌కు లభిస్తుంది. మార్కెట్‌ పతనమవుతున్నప్పుడు కూడా క్రమశిక్షణగా మీ ఇన్వెస్ట్‌మెంట్స్‌ను కొనసాగించడం మరచిపోవద్దు. మీరు ఒకవేళ ఆదాయపు పన్ను చెల్లిస్తున్నట్లయితే, హైబ్రిడ్‌ ఫండ్‌కు బదులుగా ఏడాదికి రూ.1.5 లక్షల వరకూ ఈఎల్‌ఎస్‌ఎస్‌(ఈక్విటీ లింక్డ్‌ సేవింగ్స్‌ స్కీమ్‌) ఫండ్‌లో ఇన్వెస్ట్‌ చేయండి. ఈ ఫండ్స్‌కు లాక్‌–ఇన్‌–పీరియడ్‌ మూడేళ్లుగా ఉంటుంది. పైగా మీకు ఆదాయపు పన్ను ప్రయోజనాలు కూడా లభిస్తాయి. మూడేళ్ల కాలాన్ని పరిగణనలోకి తీసుకుంటే, హైబ్రిడ్‌ ఫండ్స్‌ కంటే కూడా ఈఎల్‌ఎస్‌ఎస్‌ ఫండ్స్‌ మంచి రాబడులను ఇస్తాయి.
- ధీరేంద్ర కుమార్‌, సీఈవో, వ్యాల్యూ రీసెర్చ్‌  

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement