భారత్‌లో ఐబీఎం క్లౌడ్ డేటా సెంటర్ | IBM Cloud Data Center In India | Sakshi
Sakshi News home page

భారత్‌లో ఐబీఎం క్లౌడ్ డేటా సెంటర్

Published Thu, Jun 26 2014 1:37 AM | Last Updated on Thu, Sep 27 2018 3:58 PM

భారత్‌లో ఐబీఎం క్లౌడ్ డేటా సెంటర్ - Sakshi

భారత్‌లో ఐబీఎం క్లౌడ్ డేటా సెంటర్

కంపెనీ కంట్రీ హెడ్ (క్లౌడ్ కంప్యూటింగ్) వంశీ చరణ్
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: క్లౌడ్ కంప్యూటింగ్ సేవలను మరింత విస్తృతం చేసే దిశగా ప్రముఖ ఐటీ కంపెనీ ఐబీఎం భారత్‌లో ప్రత్యేకంగా క్లౌడ్ ఆధారిత డేటా సెంటర్‌ను ఏర్పాటు చేయనుంది. ఈ ఏడాది ఆఖర్లోగా ఇది అందుబాటులోకి రాగలదని కంపెనీ కంట్రీ హెడ్(క్లౌడ్ కంప్యూటింగ్ విభాగం) వంశీ చరణ్ ముడియం బుధవారం ఇక్కడ విలేకరులకు తెలిపారు.  

అనువైన స్థలం అన్వేషణలో ఉన్నట్లు చెప్పారు. ప్రస్తుతం తమకు ప్రపంచవ్యాప్తంగా 13 క్లౌడ్ డేటా సెంటర్లు ఉన్నాయని.. ఈ సంఖ్యను 40కి పెంచుకుంటున్నామని వివరించారు. దీనికి 1.2 బిలియన్ డాలర్లు వెచ్చిస్తున్నట్లు వివరించారు. భారత్ సహా చైనా, జపాన్, కెనడా తదితర దేశాల్లో వీటిని ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. దేశీ సంస్థల అవసరాలకు అనుగుణంగా ఉండే ఉత్పత్తులు, సర్వీసులను ప్రవేశపెట్టడంపై మరింతగా దృష్టి పెడుతున్నట్లు వంశీచరణ్ వివరించారు.  

క్లౌడ్ కంప్యూటింగ్‌కి ప్రాధాన్యం పెరుగుతున్న నేపథ్యంలో గత కొన్నాళ్లలో 7 బిలియన్ డాలర్లు వెచ్చించి 17 క్లౌడ్ కంపెనీలను కొనుగోలు చేసినట్లు  పేర్కొన్నారు. భారత్‌లో పబ్లిక్ క్లౌడ్ సర్వీసుల మార్కెట్ ఈ ఏడాది సుమారు 29.8 శాతం పెరిగి 550 మిలియన్ డాలర్లకు పెరగగలదని, 2017 నాటికి 4 బిలియన్ డాలర్లకు చేరగలదని రీసెర్చ్ సంస్థ గార్ట్‌నర్ అంచనా.

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement