క్లోజింగ్‌లో నిఫ్టీ కొత్త రికార్డు
♦ మళ్లీ 30వేల పైకి సెన్సెక్స్
♦ 231 పాయింట్ల లాభంతో 30,126 వద్ద ముగింపు
♦ 48 పాయింట్ల లాభంతో 9,360కు సెన్సెక్స్
బ్యాంకింగ్, మౌలిక రంగాల్లో ప్రభుత్వ సంస్కరణల కారణంగా స్టాక్ మార్కెట్ గురువారం లాభాల్లో ముగిసింది. ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ రికార్డు స్థాయిల్లో ముగియగా. బీఎస్‌ఈ సెన్సెక్స్ ఈ ఏడాది రెండోసారి 30,100 పాయింట్లపైన ముగిసింది. బ్యాంక్ నిఫ్టీ ఇంట్రాడేలోనూ, ముగింపులోనూ కొత్త శిఖరాలకు ఎగబాకింది. నిఫ్టీ 48 పాయింట్ల లాభంతో జీవిత కాల గరిష్ట స్థాయి ముగింపు 9,360 వద్ద ముగిసింది. ఇంట్రాడేలో 30,170 పాయింట్ల గరిష్ట స్థాయిని తాకిన సెన్సెక్స్ చివరకు 231 పాయింట్ల లాభంతో 30,126 పాయింట్ల వద్ద ముగిసింది. ఇంట్రాడేలో సెన్సెక్స్ 275 పాయింట్లు, నిఫ్టీ 54 పాయింట్లు చొప్పున లాభపడ్డాయి.
లాభాలు ఎందుకంటే..
మొండి బకాయిల సమస్యను సమర్థవంతంగా పరిష్కరించడానికి ఆర్‌బీఐకి మరింత సాధికారితను అందించేలా ఒక ఆర్డినెన్స్‌ను తేవాలన్న ప్రభుత్వ నిర్ణయంతో బ్యాంక్ షేర్లు 9 శాతం వరకూ పెరిగాయి.
ప్రభుత్వ మౌలికరంగ ప్రాజెక్టుల్లో దేశీయంగా తయారైన ఉక్కును వినియోగించడం తప్పనిసరి చేసే ప్రతిపాదనను కేంద్ర కేబినెట్ ఆమోదించడం కూడా సానుకూల ప్రభావం చూపింది.
రేట్లను యధాతథంగా కొనసాగించాలన్న అమెరికా ఫెడరల్ రిజర్వ్ నిర్ణయం తీసుకోవడం, అక్కడి కంపెనీల ఆర్థిక ఫలితాలు బాగా ఉండడం వంటి కారణాల వల్ల యూరప్ మార్కెట్లు లాభాల్లో ప్రారంభం కావడం కూడా కలసివచ్చింది.
ఏప్రిల్‌లో సేవల రంగం వృద్ధి చెందిందని నికాయ్ పీఎంఐ గణాంకాలు వెల్లడించడం మార్కెట్ సెంటిమెంట్‌ను మెరుగుపరచింది. సేవల రంగం వృద్ధి సాధించడం ఇది వరుసగా మూడో నెల.
బ్యాంక్ షేర్లు కళకళ
మొండి బకాయిల పరిష్కారానికి ఆర్డినెన్స్ తేవాలన్న ప్రభుత్వ నిర్ణయం కారణంగా బ్యాంక్ షేర్లు కళకళలాడాయి. గత ఆర్థిక సంవత్సరం క్యూ4 ఫలితాలు బాగా ఉండడం కూడా కలసి రావడంతో బ్యాంక్ షేర్లు 9 శాతం వరకూ లాభపడ్డాయి. బ్యాంక్ నిఫ్టీ ఇంట్రాడేలోనూ, ముగింపులోనూ కొత్త శిఖరాలకు ఎగబాకింది. ఇంట్రాడేలో 22,744 పాయింట్ల కొత్త శిఖరాన్ని తాకిన బ్యాంక్ నిఫ్టీ చివరకు జీవిత కాల గరిష్ట స్థాయి, 22,720 పాయింట్ల వద్ద ముగిసింది.