మళ్లీ లాభాల్లోకి ఐసీఐసీఐ | ICICI posts 56% drop in Q2 profit on rising NPAs, treasury loss | Sakshi
Sakshi News home page

మళ్లీ లాభాల్లోకి ఐసీఐసీఐ

Published Sat, Oct 27 2018 1:22 AM | Last Updated on Sat, Oct 27 2018 8:34 AM

ICICI posts 56% drop in Q2 profit on rising NPAs, treasury loss - Sakshi

న్యూఢిల్లీ: మొండిబకాయిల దెబ్బతో నష్టాల్లోకి జారిపోయిన ప్రైవేట్‌ రంగ ఐసీఐసీఐ బ్యాంక్‌ మళ్లీ లాభాల బాట పట్టింది. ఈ ఆర్థిక సంవత్సరం జూలై–సెప్టెంబర్‌ క్వార్టర్లో రూ.1,205 కోట్ల నికర లాభాన్ని(కన్సాలిడేటెడ్‌) ఆర్జించింది. గతేడాది క్యూ2లో రూ.2,071 కోట్లతో పోలిస్తే 42 శాతం క్షీణించింది. కాగా, ఈ ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసికం(ఏప్రిల్‌–జూన్‌)లో బ్యాంకుకు రూ.120 కోట్ల నికర నష్టాలు వచ్చాయి. గత క్యూ2లో రూ.30,191 కోట్లుగా ఉన్న మొత్తం ఆదాయం రూ.31,915 కోట్లకు పెరిగింది.

స్టాండోలోన్‌ లాభం రూ.909 కోట్లు..
స్టాండోలోన్‌ ప్రాతిపదికగా చూస్తే, గత క్యూ2లో రూ.2,058 కోట్లుగా ఉన్న నికర లాభం ఈ క్యూ2లో 56 శాతం క్షీణించి రూ.909 కోట్లకు తగ్గిందని ఐసీఐసీఐ బ్యాంక్‌ తెలిపింది. మొత్తం ఆదాయం రూ.18,763 కోట్ల నుంచి రూ.18,262 కోట్లకు తగ్గిందని వివరించింది. ఇక రుణ నాణ్యత ఒకింత తగ్గింది. గత క్యూ2లో రూ.44,389 కోట్లుగా ఉన్న స్థూల మొండి బకాయిలు ఈ క్యూ2లో రూ.54,449 కోట్లకు పెరిగాయని బ్యాంక్‌ పేర్కొంది.

అయితే నికర మొండి బకాయిలు రూ.24,130 కోట్ల నుంచి రూ.22,086 కోట్లకు తగ్గాయని తెలిపింది. శాతం పరంగా చూస్తే, స్థూల మొండి బకాయిలు 7.87 శాతం నుంచి 8.54 శాతానికి పెరగ్గా, నికర మొండి బకాయిలు మాత్రం 4.43 శాతం నుంచి 3.65 శాతానికి తగ్గాయని వివరించింది. ఇక ఈ క్యూ1లో స్థూల మొండి బకాయిలు 8.81 శాతంగా, నికర మొండి బకాయిలు 4.19 శాతంగా ఉన్నాయి.  

తగ్గిన కేటాయింపులు...
కేటాయింపులు రూ.4,503 కోట్ల నుంచి 11 శాతం క్షీణించి రూ.3,994 కోట్లకు తగ్గాయని ఐసీఐసీఐ బ్యాంక్‌ తెలిపింది. సీక్వెన్షియల్‌గా చూస్తే కేటాయింపులు 33 శాతం తగ్గాయని పేర్కొంది. ప్రొవిజనింగ్‌ కవరేజ్‌ రేషియో 3.3 శాతం(సీక్వెన్షియల్‌గా) పెరిగి 69.4 శాతానికి చేరిందని పేర్కొంది. దీంతో తమ బ్యాలన్స్‌ షీట్‌ మరింత పటిష్టమైందని వివరించింది. నికర వడ్డీ ఆదాయం రూ.5,709 కోట్ల       నుంచి 12 శాతం పెరిగి రూ.6,418 కోట్లకు ఎగసిందని వివరించింది.

రుణ వృద్ధి 13 శాతంగా ఉండటంతో నికర వడ్డీ ఆదాయం  ఈ స్థాయిలో పెరిగిందని పేర్కొంది. ఇతర ఆదాయం 39 శాతం తగ్గి రూ.3,157 కోట్లకు తగ్గగా, ఫీజు ఆదాయం 17 శాతం పెరిగిందని తెలిపింది. నిర్వహణ లాభం రూ.4,794 కోట్ల నుంచి రూ.5,285 కోట్లకు   పెరిగిందని పేర్కొంది. ఈ క్యూ1లో 3.19 శాతంగా ఉన్న నికర వడ్డీ మార్జిన్‌ ఈ క్యూ2లో 14 బేసిస్‌ పాయింట్లు పెరిగి 3.33 శాతానికి పెరిగిందని పేర్కొంది.  

ఐపీఓ లాభం రూ.2,012 కోట్లు  
రుణాలు రూ.4.82 లక్షల కోట్ల నుంచి రూ.5.44 లక్షల కోట్లకు,  డిపాజిట్లు 12 శాతం వృద్ధితో రూ.5.58 లక్షల కోట్లకు పెరిగాయని ఐసీఐసీఐ బ్యాంక్‌  తెలిపింది. మొత్తం రుణాల్లో 57 శాతంగా ఉన్న రిటైల్‌ రుణాలు 20 శాతం పెరిగాయని  పేర్కొంది.

ఐపీఓ(ఇనీషియల్‌ పబ్లిక్‌ ఆఫర్‌)లో భాగంగా ఐసీఐసీఐ లాంబార్డ్‌ జనరల్‌ ఇన్సూరెన్స్‌ కంపెనీలో 7 శాతం వాటా షేర్లను రూ.2,099 కోట్లకు విక్రయించామని ఐసీఐసీఐ బ్యాంక్‌ తెలిపింది. ఐపీఓ సంబంధిత వ్యయాలు పోను ఈ వాటా విక్రయం వల్ల రూ.2,012 కోట్ల లాభం వచ్చిందని వివరించింది.  ఐసీఐసీఐ బ్యాంక్‌  అదనపు(స్వతంత్ర) డైరెక్టర్‌గా హరి ఎల్‌. ముంద్రాను నియమించామని, ఐదేళ్ల పాటు ఆయన ఆ పదవిలో కొనసాగుతారని బ్యాంక్‌ పేర్కొంది. ఈ నియామకానికి వాటాదారుల ఆమోదం పొందాల్సి ఉందని పేర్కొంది.


ఏడీఆర్‌ జోరు 
మార్కెట్‌ ముగిసిన తర్వాత ఫలితాలు వెలువడ్డాయి. ఫలితాలపై ఉత్కంఠతో ఈ షేర్‌ ఒడిదుడుకుల మధ్య ట్రేడై చివరకు 1.4 శాతం నష్టంతో రూ.315 వద్ద ముగిసింది. అయితే సీక్వెన్షియల్‌గా చూస్తే, నికర నష్టాల నుంచి నికర లాభాల బాట పట్టడం, నికర మొండి బకాయిలు తగ్గడంతో ఐసీఐసీఐ బ్యాంక్‌ ఏడీఆర్‌(అమెరికా మార్కెట్లో) లాభాల్లో ట్రేడవుతోంది. ఈ వార్త రాసే సమయానికి(రాత్రి. గం.10.22ని.)ఐసీఐసీఐ బ్యాంక్‌ ఏడీఆర్‌ 3.89 శాతం లాభంతో 9.09 డాలర్ల వద్ద ట్రేడవుతోంది. ఈ ప్రభావంతో సోమవారం (అక్టోబర్‌ 29) ఈ షేర్‌ లాభాల్లో మొదలవుతుందని నిపుణులు అంచనా వేస్తున్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement