ఐకియా స్టోర్ (ఫైల్ ఫోటో)
సాక్షి, హైదరాబాద్ : ఎన్నో రోజులుగా వేచిచూస్తున్న స్వీడిష్ ఫర్నీచర్ దిగ్గజ రిటైలర్ ఐకియా స్టోర్, రేపే భారత్‌లో లాంచ్ కాబోతుంది. తన తొలి స్టోర్‌ను హైదరాబాద్‌లో లాంచ్ చేసేందుకు ఐకియా సిద్ధమైంది. స్థానిక వనరుల నిబంధనలతో ఐకియా ఇండియా స్టోర్ లాంచింగ్ కొన్ని రోజులుగా వాయిదా పడుతూ వస్తున్న సంగతి తెలిసిందే. నిబంధనల ప్రకారం ఐదేళ్ల పాటు తమ కార్యకలాపాల్లో సుమారు 30 శాతం, స్థానిక ముడి సరుకులనే వాడనున్నట్టు ఐకియా తెలిపింది. దేశీయ వినియోగదారుల అన్ని అవసరాలను అందిపుచ్చుకోవడం, ధరల్లో మార్పులు చేపట్టడం, వివిధ ప్రొడక్ట్‌లను ఆఫర్ చేయడం వంటివి చేపట్టనున్నట్టు ఐకియా పేర్కొంది.
హైదరాబాద్‌లో ప్రారంభం కాబోతున్న ఐకియా తొలి స్టోర్ హైటెక్ సిటీ, రాయ్‌దుర్గ్, శేరిలింగంపల్లి మండలం, సర్వే నెంబర్. 83/1, ప్లాట్ నెంబర్. 25,26, రంగారెడ్డి జిల్లాలో ఉంది. ప్రతిరోజూ ఉదయం 10 గంటల నుంచి రాత్రి 11 గంటల మధ్యలో ఐకియా హైదరాబాద్ స్టోర్ తెరిచి ఉంచుతారు. 13 ఎకరాల కాంప్లెక్స్‌లో ఏర్పాటైన ఈ స్టోర్‌కు ఏడాదికి 60 లక్షల మంది విచ్చేసే అవకాశముందని తెలుస్తోంది. 4 లక్షల చదరపు అడుగుల ఈ షోరూంలో 7500 ఉత్పత్తులను ఆఫర్ చేయబోతుంది. వీటిలో వెయ్యికి పైగా ఉత్పత్తుల ధర రూ.200 కంటే తక్కువే. హైదరాబాద్‌తో పాటు బెంగళూరు, ముంబై, గుర్గామ్ ప్రాంతాల్లో కూడా ఐకియా స్టోర్ ఏర్పాటు కోసం ఆ కంపెనీ భూమిని కొనుగోలు చేసింది. సూరత్, అహ్మదాబాద్, కోల్‌కతా, చెన్నై, పుణే ప్రాంతాలకు ఈ స్టోర్‌ను విస్తరించనుంది. 2025 నాటికి 25 స్టోర్లను ఏర్పాటు చేయాలని కంపెనీ ప్లాన్ చేస్తోంది.
బెడ్స్, కుర్చీలు, కుక్‌వేవ్, కర్టైన్లు, టేబుల్స్, లైటింగ్, కిచెన్ ట్రోలీ, ఓవెన్స్, హ్యాంగర్స్ వంటి పలు ప్రొడక్ట్‌లను ఈ స్టోర్ ఆఫర్ చేయనుంది. అర్బన్‌క్లాస్ అనే యాప్‌తో కూడా ఐకియా భాగస్వామ్యం కుదుర్చుకుంది. దీనిలో భాగంగా కార్పెంటర్స్ వంటి పలువురు సర్వీసు ప్రొవైడర్లకు వినియోగదారులను కనెక్ట్ చేయనుంది. ఈ స్టోర్‌లో వెయ్యి సీట్ల రెస్టారెంట్ కూడా ఉంది. ప్రతి రోజూ ఉదయం తొమ్మిదన్నర నుంచి రాత్రి పదిన్నర వరకు ఈ రెస్టారెంట్ అందుబాటులో ఉంటుంది. దీనిలో సగం వెజిటేరియన్‌కు సంబంధించినవే. ఇడ్లీ, సమోసా, వెజిటేబుల్ బిర్యానీ వంటి వెజిటేరియన్ ఫుడ్‌నూ ఆఫర్ చేయనుంది. 50 శాతం భారతీయులు ఫుడ్‌నే ఎక్కువగా ఇష్టపడతారని, అందుకే రెస్టారెంట్‌ను కూడా ఆఫర్ చేస్తున్నట్టు ఐకియా ఇండియా డిప్యూటీ కంట్రీ మేనేజర్ పట్రిక్ ఆంటోనీ చెప్పారు.
ఐకియా ఇండియా స్టోర్ వచ్చే ఏడాది ఈ-కామర్స్ కార్యకలాపాలను ప్రారంభించనుంది. నగరాల్లో ఆన్‌లైన్ సేల్స్‌ను ఇది ఆఫర్ చేస్తుంది. ముంబైలో ఈ ఈ-కామర్స్ కార్యకలాపాలను ప్రారంభించాలని ప్లాన్ చేస్తుంది. స్మాలాండ్, క్రెష్‌లను కూడా ఐకియా హైదరాబాద్ లాంచ్ చేయనుంది. వీటితో షాపర్లు తమ పిల్లలతో ఎంతో సురక్షితంగా షాపింగ్ చేసుకోవచ్చు.
Comments
Please login to add a commentAdd a comment