
భారత్ కు ద్రవ్యలోటు గండం!
ఆర్థికమంత్రి అరుణ్‌జైట్లీ ఫిబ్రవరి 29న పార్లమెంటులో తన రెండవ పూర్తిస్థాయి బడ్జెట్‌ను ప్రవేశపెడుతున్న నేపథ్యంలో...
♦ రేటింగ్ ఏజెన్సీ మూడీస్ అభిప్రాయం
♦ బడ్జెట్ నేపథ్యంలో కీలక విశ్లేషణ
న్యూఢిల్లీ: ఆర్థికమంత్రి అరుణ్‌జైట్లీ ఫిబ్రవరి 29న పార్లమెంటులో తన రెండవ పూర్తిస్థాయి బడ్జెట్‌ను ప్రవేశపెడుతున్న నేపథ్యంలో... రేటింగ్ సంస్థ మూడీస్ ఇన్వెస్టర్స్ సర్వీస్ మంగళవారం ఆర్థిక వ్యవస్థపై కీలక విశ్లేషణ చేసింది. ద్రవ్యలోటు వంటి భారత్ ముఖ్య ఆర్థిక అంశాలు బలహీనంగా ఉన్నాయన్నది ఇందులో ప్రధానమైంది. జైట్లీ బడ్జెట్ ద్రవ్యలోటు లక్ష్యానికి కట్టుబడినా... సమీప కాలానికి ఆయా అంశాల బలహీన ధోరణే ప్రస్ఫుటమవుతున్నట్లు తాజా నివేదికలో వ్యాఖ్యానించింది. నివేదికలోని కొన్ని ముఖ్యాంశాలు....
♦ వృద్ధి 7 శాతంపైగా ఉన్నా... గ్రామీణ డిమాండ్, కార్పొరేట్ లాభాలు మందగమనంలో ఉన్నాయి. ప్రభుత్వ పన్ను ఆదాయంపై ఇవి ప్రభావం చూపుతాయి. భవిష్యత్తులో ఆదాయాలకు సైతం ఈ అంశాలే కీలకం.
♦ {పభుత్వ ద్రవ్య స్థిరీకరణ విధానాలు ఎలా ఉన్నాయన్నది రానున్న బడ్జెట్‌లో కీలకాంశం. గడచిన ఐదేళ్లుగా ద్రవ్యలోటు (ప్రభుత్వ ఆదాయాలు-వ్యయాలకు మధ్య వ్యత్యాసం- ప్రస్తుత ఆర్థిక సంవత్సరం లక్ష్యం... స్థూల దేశీయోత్పత్తిలో 3.9 శాతం) తగ్గుతూ వస్తోంది. ఇది ప్రభుత్వ రుణ నిష్పత్తుల స్థిరీకరణకూ దోహదపడింది. ద్రవ్య స్థిరీకరణ లేకుండా ముందుకుపోవడం మంచిది కాదు. ఇదే జరిగితే భారత్ ప్రభుత్వ ఆర్థిక పరిస్థితి ఇతర సహ దేశాలకన్నా బలహీనపడుతుంది. వేతన బిల్లు పెరగడం, వృద్ధికి సంబంధించి తప్పని వ్యయాల భారం ద్రవ్యలోటు లక్ష్యాన్ని ఒత్తిడికి గురుచేస్తోంది.
♦ కార్పొరేట్ లాభాలు తగ్గడం, వినియోగంలో వృద్ధి మందగమనం వంటి అంశాల వల్ల ద్రవ్యలోటుకు సంబంధించి బలహీన వాతావ రణం కొనసాగే అవకాశం ఉంది. బడ్జెట్ కూడా ఈ విషయంలో పట్టనట్లు వ్యవహరిస్తే... పరిస్థితి మరింత తీవ్రమవుతుంది.
♦ సబ్సిడీలకు సంబంధించి... ఇంధన సబ్సిడీ భారాలు తగ్గినా, ఆహార సబ్సిడీలు ఇంకా భారంగానే ఉన్నాయి.
♦ {దవ్యలోటు పరిస్థితుల మెరుగుదలకు వ్యవస్థాపరమైన అంశాలూ అడ్డంకులుగా ఉన్నాయి. దాదాపు 1,700 డాలర్ల వరకూ ఉన్న తలసరి ఆదాయ అంశాలు... ప్రభుత్వ పన్ను బేస్ పెంపు ప్రతిపాదనలకు అడ్డం తగులుతున్నాయి. సబ్సిడీలు, అభివృద్ధికి వ్యయాలు కూడా ఆయా అంశాలు విఘాతం కలిగిస్తున్నాయి.
♦ భారత్ ప్రభుత్వ ఆదాయంలో ఐదవ వంతు వడ్డీ చెల్లింపులకే సరిపోతోంది. అధిక రుణ భారం ఫలితమిది. 2016లో జీడీపీలో 63.8%గా రుణ భారం ఉంటుందని భావిస్తున్నాం. 2005లో ఇది 83.1 శాతంగా ఉంది.
ఎన్‌టీపీసీ రేటింగ్‌కు ఢోకా లేదు...
భారత్‌లోని అతిపెద్ద విద్యుత్ ఉత్పత్తి కంపెనీ ఎన్‌టీపీసీలో ప్రభుత్వం 5% వాటా విక్రయించినప్పటికీ ఈ సంస్థకు తాను ఇస్తున్న ‘బీఏఏ3’ రేటింగ్‌లో ఎటువంటి ఢోకా ఉండబోదని మూడీస్ నివేదిక స్పష్టం చేసింది. ఆర్థిక వ్యవస్థలో ఈ రంగానికి ఉన్న వ్యూహాత్మక ప్రాధాన్యతకు అనుగుణంగా రేటింగ్ కొనసాగుతుందని తెలిపింది. ప్రభుత్వ మెజారిటీ వాటా కొనసాగుతుందని భావిస్తున్నామని, దీని వల్ల ఎన్‌టీపీసీ సావరిన్ మద్దతుకు ఎటువంటి ఢోకా ఉండదన్నది తమ అభిప్రాయమని మూడీస్ సీనియర్ విశ్లేషకుడు అభిషేక్ త్యాగీ పేర్కొన్నారు.
ద్రవ్యలోటు లక్ష్యం 3.7%కి పెంపు!: డీబీఎస్
వచ్చే ఆర్థిక సంవత్సరం ద్రవ్యలోటు లక్ష్యాన్ని ప్రభుత్వం ప్రస్తుత 3.5% నుంచి 3.7%కి (స్థూల దేశీయోత్పత్తితో పోల్చి) పెంచే అవకాశం ఉందని ప్రపంచ ఆర్థిక సేవల దిగ్గజ సంస్థ డీబీఎస్ విశ్లేషించింది. వేతన పెంపు, వ్యయాల ఒత్తిడులు, బ్యాం కింగ్‌లో తాజా పెట్టుబడుల అవసరాలు వంటివి తమ అంచనాకు కారణమని పేర్కొంది. వస్తు సేవల పన్ను, దివాలా చట్టం, రియల్టీ బిల్లు వంటి కీలక అంశాలకు పార్లమెంటులో ప్రతిపక్షం నుంచి తీవ్ర వ్యతిరేకత తప్పదన్నది తమ అభిప్రాయమని పేర్కొంది. ఏప్రిల్-మే నెలల్లో ఐదు కీలక రాష్ట్రాల ఎన్నికలు, సంస్కరణల ఎజెండాలను మార్కెట్లు జాగ్రత్తగా పరిశీలిస్తాయని కూడా విశ్లేషించింది.