
ఐఎంఎఫ్ లో కోటా సంస్కరణలు మొదలు
చారిత్రక మార్పులకు తెరతీస్తూ అంతర్జాతీయ ద్రవ్య నిధి (ఐఎంఎఫ్) కోటా సంస్కరణలకు శ్రీకారం చుట్టింది.
♦ టాప్ 10 పెద్ద సభ్య దేశాల్లో భారత్‌కూ చోటు
♦ బ్రిక్ దేశాలకు మరిన్ని ఓటింగ్ హక్కులు
వాషింగ్టన్: చారిత్రక మార్పులకు తెరతీస్తూ అంతర్జాతీయ ద్రవ్య నిధి (ఐఎంఎఫ్) కోటా సంస్కరణలకు శ్రీకారం చుట్టింది. భారత్, చైనాతో పాటు ఇతర వర్ధమాన దేశాలకు మరిన్ని ఓటింగ్ హక్కులు కల్పిస్తున్నట్లు ప్రకటించింది. దీంతో తొలిసారి ఐఎంఎఫ్‌లోని 10 అతి పెద్ద సభ్య దేశాల్లో భారత్, చైనా, బ్రెజిల్, రష్యాకు (బ్రిక్ కూటమి) చోటు దక్కుతుంది. అలాగే, 6 శాతం పైగా కోటా షేర్లు వర్ధమాన మార్కెట్లకు బదిలీ కానున్నాయి.
2010లోనే కోటా, గవర్నెన్స్ సంస్కరణలకు ఐఎంఎఫ్ బోర్డ్ ఆఫ్ గవర్నర్స్ ఆమోదం లభించింది. ఆ తర్వాత దీర్ఘకాలంగా పెండింగ్‌లో ఉన్న సంస్కరణలకు 2015లోగానీ అమెరికా కాంగ్రెస్ ఆమోదముద్ర వేయలేదు. ఈ సంస్కరణలతో ఐఎంఎఫ్ ఆర్థిక సామర్థ్యం రెట్టింపై.. శాశ్వత మూలనిధి వనరులు 477 బిలియన్ల ఎస్‌డీఆర్‌లకు (దాదాపు 659 బిలియన్ డాలర్లకు) చేరతాయి.
188 సభ్యదేశాలున్న ఐఎంఎఫ్‌లో భారత్‌కు ప్రస్తుతం 2.34 శాతం మేర ఓటింగ్ హక్కులు ఉన్నాయి. కోటా పరంగా 2.44 శాతం వాటా ఉంది. టాప్ 10 సభ్య దేశాల్లో అమెరికా, జపాన్, ఫ్రాన్స్, జర్మనీ, ఇటలీ, బ్రిటన్ ఉన్నాయి. సంస్కరణలతో సంస్థ విశ్వసనీయత, సమర్ధత, చట్టబద్ధత మరింత మెరుగుపడగలవని 14వ సాధారణ కోటా సమీక్షపై ప్రకటనలో ఐఎంఎఫ్ పేర్కొంది.