
వృద్ధిలో చైనాను మించనున్న భారత్: ఐఎంఎఫ్
వృద్ధి రేటు విషయంలో చైనాను భారత్ అధిగమించనుందని అంతర్జాతీయ ద్రవ్య నిధి(ఐఎంఎఫ్) తెలిపింది.
వాషింగ్టన్ : వృద్ధి రేటు విషయంలో చైనాను భారత్ అధిగమించనుందని అంతర్జాతీయ ద్రవ్య నిధి(ఐఎంఎఫ్) తెలిపింది. 2013లో 7.7 శాతంగా ఉన్న చైనా వృద్ధి రేటు ఈ ఏడాది 6.8 శాతానికి, వచ్చే ఏడాది 6.3 శాతానికి తగ్గనుందని పేర్కొంది. అదే సమయంలో 2013లో 6.9 శాతంగా ఉన్న భారత్ స్థూల దేశీయోత్పత్తి(జీడీపీ) వృద్ధి 2015, 2016లో 7.5 శాతం మేర ఉండగలదని వరల్డ్ ఎకనమిక్ అవుట్‌లుక్ (డబ్ల్యూఈవో) జులై నివేదికలో ఐఎంఎఫ్ తెలిపింది.
వర్ధమాన దేశాల్లో వృద్ధి ఓ మోస్తరు స్థాయిలో ఉంటుందని, సంపన్న దేశాలు క్రమక్రమంగా వృద్ధి బాట పట్టగలవని వివరించింది. 2015లో ప్రపంచ దేశాల వృద్ధి రేటు గతేడాదితో పోలిస్తే స్వల్ప తగ్గుదలతో 3.3 శాతంగా ఉండొచ్చని, వచ్చే ఏడాది కొంత మెరుగుపడి 3.8 శాతానికి పెరగొచ్చని ఐఎంఎఫ్ తెలిపింది. 2014లో 1.8 శాతంగా ఉన్న సంపన్న దేశాల వృద్ధి ఈ ఏడాది 2.1 శాతానికి, 2016లో 2.4 శాతానికి పెరగొచ్చని పేర్కొంది.