వాషింగ్టన్: ప్రపంచంలో అన్ని దేశాలు వృద్ధి అధోగమనాన్ని చూస్తుంటే.. భారత్ మంచి పనితీరు చూపిస్తూ ఆశాకిరణంగా ఉందని ఐఎంఎఫ్ ఆసియా, పసిఫిక్ విభాగం డైరెక్టర్ కృష్ణ శ్రీనివాసన్ అన్నారు. ద్రవ్యోల్బణం పెరిగిపోతూ, ప్రపంచదేశాలు మందగమనంలోకి వెళుతున్నట్టు చెప్పారు. ‘‘ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో భాగమైన మూడింట ఒక వంతు దేశాలు ఈ ఏడాది లేదా వచ్చే ఏడాది మాంద్యంలోకి వెళతాయని అంచనా వేస్తున్నాం. ద్రవ్యోల్బణం బలీయంగా ఉంది. ఇదే అంతర్జాతీయంగా నెలకొన్న వాస్తవ పరిస్థితి. దాదాపు ప్రతీ దేశ ఆర్థిక వ్యవస్థ నిదానిస్తోంది. ఈ విధంగా చూస్తే భారత్ మాత్రం మెరుగైన పనితీరు తో వెలిగిపోతోంది’’అని శ్రీనివాసన్ వివరించారు.
వృద్ధి రేటు 6.8 శాతం
భారత్ ఆర్థిక వ్యవస్థ 2022 సంవత్సరానికి 6.8 శాతం వృద్ధి రేటును నమోదు చేస్తుందని ఐఎంఎఫ్ తాజాగా పేర్కొంది. 2021లో జీడీపీ 8.7 శాతం వృద్ధిని నమోదు చేయడం తెలిసిందే. 2023 సంవత్సరానికి జీడీపీ 6.1 శాతం రేటు నమోదు చేస్తుందని పేర్కొంది. ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో ఒక వంతు 2023లో క్షీణతను చూస్తుందని అంచనా వేసింది. అమెరికా, యూరప్, చైనా ఆర్థిక వ్యవస్థల్లో స్తబ్ధత కొనసాగుతుందని పేర్కొంది. 2023లో మాంద్యం వస్తుందని చాలా మంది భావిస్తున్నట్టు తెలిపింది.
‘‘ద్రవ్యోల్బణాన్ని అదుపు చేసేందుకు సెంట్రల్ బ్యాంకులు విధానాలను కట్టడి చేస్తుండడంతో ద్రవ్య పరిస్థితులు కూడా కఠినవుతున్నాయి. ఇది పెట్టుబడులపై ప్రభావం చూపిస్తుంది. ఉక్రెయిన్–రష్యా యుద్ధం వల్ల ఆహార ధాన్యాలు, కమోడిటీల ధరల పెరుగుదలకు దారితీసింది. మూడోది చైనా మందగమనాన్ని చూస్తోంది. ఈ అంశాలన్నీ ప్రపంచవ్యాప్తంగా చాలా ప్రాంతాల్లో, ఆసియా, భారత్ వృద్ధి అవకాశాలపైనా చూపిస్తోంది. భారత్ వెలుపలి డిమాండ్ మందగమన ప్రభావాన్ని చూస్తోంది. అలాగే, దేశీయంగా ద్రవ్యల్బణ పెరుగుదలను చూస్తోంది’’అని ఐఎంఎఫ్ తన తాజా నివేదికలో పేర్కొంది. ద్రవ్యోల్బణం కట్టడికి అనుసరించే ద్రవ్య విధాన కఠినతరం పెట్టుబడులపై ప్రభావం చూపిస్తుందని తెలిపింది.
భారత్ విధానాలు బాగు..
భారత్ ప్రతిష్టాత్మక మూలధన వ్యయాల ప్రణాళికను ఐఎంఎఫ్ మెచ్చుకుంది. దీన్ని కొనసాగించాలని, అది దేశీయంగా డిమాండ్ బలపడేందుకు దోహదం చేస్తుందని పేర్కొంది. అలాగే, పేదలు, సున్నిత వర్గాలపై ప్రభావం చూపిస్తున్న ద్రవ్యోల్బణ ప్రభావాన్ని తగ్గించేందుకు ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలను కూడా ప్రశంసించింది. ఎౖMð్సజ్ పన్నును తగ్గంచడాన్ని ప్రస్తావించింది. దీనివల్ల ధరలవైపు ఉపశమనం ఉంటుందని పేర్కొంది. డిజిటైజేషన్ దిశగా భారత్ అద్భుతమైన ప్రగతి చూపించిందని, పలు రంగాల్లో పెద్ద ఎత్తున విదేశీ పెట్టుబడులకు ద్వారాలు తెరవడాన్ని కూడా ప్రశంసించింది.
Comments
Please login to add a commentAdd a comment