ఈ ఏడాది భారత వృద్ధి 5.6%
వచ్చే ఏడాది 6.4 శాతం
ఐఎంఎఫ్ అంచనాలు
వాషింగ్టన్: భారత్ ఈ ఏడాది 5.6 శాతం వృద్ధి రేటు సాధిస్తుందని అంతర్జాతీయ ద్రవ్యనిధి(ఐఎంఎఫ్) పేర్కొంది. వచ్చే ఏడాది 6.4 శాతం వృద్ధి సాధ్యమవుతుందని వివరించింది. ఎన్నికల అనంతరం అధికారంలోకి వచ్చిన కొత్త ప్రభుత్వం తీసుకుంటున్న ఆర్థిక సంస్కరణల కారణంగా ఎగమతులు, ఇన్వెస్ట్‌మెంట్స్ పెరుగుతున్నాయని, వృద్ధిరేటు పరుగులు పెడుతోందని పేర్కొంది. ఐఎంఎఫ్ రూపొందించిన వరల్డ్ ఎకనామిక్ అవుట్‌లుక్(డబ్ల్యూఈఓ) ఈ వివరాలను వెల్లడించింది. అలాగే ద్రవ్యోల్బణం ఈ ఏడాది 7.8 శాతంగానూ, వచ్చే ఏడాది 7.5 శాతంగానూ ఉండొచ్చని ఐఎంఎఫ్ అంచనా వేస్తోంది.
ఎన్నికల అనంతరం భారత్‌లో వాణిజ్య విశ్వాసం పెరుగుతోందని, తయారీ రంగ కార్యకలాపాలు పుంజుకుంటున్నాయని ఫలితంగా వృద్ధి పెరుగుతోందని ఐఎంఎఫ్ పేర్కొంది. ఈ ఏడాది మిగిలిన మూడు నెలలు, వచ్చే ఏడాది వృద్ధి పరుగులు పెడుతుందని వివరించింది. వర్షాలు సరిగ్గా కురవకపోవడంతో మందగించిన వ్యవసాయ వృద్ధి ప్రభావాన్ని పెరుగుతున్న ఎగుమతులు, పెట్టుబడులు భర్తీ చేశాయని పేర్కొంది. ఎన్నికల అనంతరం భారత్‌లో ప్రాదుర్భవించిన వాణిజ్య విశ్వాసం భవిష్యత్‌లో అవసరమైన వ్యవస్థాగత సంస్కరణలకు తగిన ఊతాన్ని ఇచ్చిందని తెలిపింది. ఇక అంతర్జాతీయ ఆర్థిక వృద్ధి అంచనాల కంటే మందగిస్తుందని పేర్కొంది. అమెరికా ఆర్థిక వ్యవస్థలో ఉన్న తాత్కాలిక సమస్యలు దీనికి కారణమని వివరించింది. సంక్షోభాల ప్రభావం కారణంగా యూరో దేశాల్లో కూడా రికవరీ బలహీనంగా ఉంటుందని ఐఎంఎఫ్ అంచనా వేస్తోంది.