Asia-Pacific group
-
భారత్ ఆశాకిరణం
వాషింగ్టన్: ప్రపంచంలో అన్ని దేశాలు వృద్ధి అధోగమనాన్ని చూస్తుంటే.. భారత్ మంచి పనితీరు చూపిస్తూ ఆశాకిరణంగా ఉందని ఐఎంఎఫ్ ఆసియా, పసిఫిక్ విభాగం డైరెక్టర్ కృష్ణ శ్రీనివాసన్ అన్నారు. ద్రవ్యోల్బణం పెరిగిపోతూ, ప్రపంచదేశాలు మందగమనంలోకి వెళుతున్నట్టు చెప్పారు. ‘‘ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో భాగమైన మూడింట ఒక వంతు దేశాలు ఈ ఏడాది లేదా వచ్చే ఏడాది మాంద్యంలోకి వెళతాయని అంచనా వేస్తున్నాం. ద్రవ్యోల్బణం బలీయంగా ఉంది. ఇదే అంతర్జాతీయంగా నెలకొన్న వాస్తవ పరిస్థితి. దాదాపు ప్రతీ దేశ ఆర్థిక వ్యవస్థ నిదానిస్తోంది. ఈ విధంగా చూస్తే భారత్ మాత్రం మెరుగైన పనితీరు తో వెలిగిపోతోంది’’అని శ్రీనివాసన్ వివరించారు. వృద్ధి రేటు 6.8 శాతం భారత్ ఆర్థిక వ్యవస్థ 2022 సంవత్సరానికి 6.8 శాతం వృద్ధి రేటును నమోదు చేస్తుందని ఐఎంఎఫ్ తాజాగా పేర్కొంది. 2021లో జీడీపీ 8.7 శాతం వృద్ధిని నమోదు చేయడం తెలిసిందే. 2023 సంవత్సరానికి జీడీపీ 6.1 శాతం రేటు నమోదు చేస్తుందని పేర్కొంది. ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో ఒక వంతు 2023లో క్షీణతను చూస్తుందని అంచనా వేసింది. అమెరికా, యూరప్, చైనా ఆర్థిక వ్యవస్థల్లో స్తబ్ధత కొనసాగుతుందని పేర్కొంది. 2023లో మాంద్యం వస్తుందని చాలా మంది భావిస్తున్నట్టు తెలిపింది. ‘‘ద్రవ్యోల్బణాన్ని అదుపు చేసేందుకు సెంట్రల్ బ్యాంకులు విధానాలను కట్టడి చేస్తుండడంతో ద్రవ్య పరిస్థితులు కూడా కఠినవుతున్నాయి. ఇది పెట్టుబడులపై ప్రభావం చూపిస్తుంది. ఉక్రెయిన్–రష్యా యుద్ధం వల్ల ఆహార ధాన్యాలు, కమోడిటీల ధరల పెరుగుదలకు దారితీసింది. మూడోది చైనా మందగమనాన్ని చూస్తోంది. ఈ అంశాలన్నీ ప్రపంచవ్యాప్తంగా చాలా ప్రాంతాల్లో, ఆసియా, భారత్ వృద్ధి అవకాశాలపైనా చూపిస్తోంది. భారత్ వెలుపలి డిమాండ్ మందగమన ప్రభావాన్ని చూస్తోంది. అలాగే, దేశీయంగా ద్రవ్యల్బణ పెరుగుదలను చూస్తోంది’’అని ఐఎంఎఫ్ తన తాజా నివేదికలో పేర్కొంది. ద్రవ్యోల్బణం కట్టడికి అనుసరించే ద్రవ్య విధాన కఠినతరం పెట్టుబడులపై ప్రభావం చూపిస్తుందని తెలిపింది. భారత్ విధానాలు బాగు.. భారత్ ప్రతిష్టాత్మక మూలధన వ్యయాల ప్రణాళికను ఐఎంఎఫ్ మెచ్చుకుంది. దీన్ని కొనసాగించాలని, అది దేశీయంగా డిమాండ్ బలపడేందుకు దోహదం చేస్తుందని పేర్కొంది. అలాగే, పేదలు, సున్నిత వర్గాలపై ప్రభావం చూపిస్తున్న ద్రవ్యోల్బణ ప్రభావాన్ని తగ్గించేందుకు ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలను కూడా ప్రశంసించింది. ఎౖMð్సజ్ పన్నును తగ్గంచడాన్ని ప్రస్తావించింది. దీనివల్ల ధరలవైపు ఉపశమనం ఉంటుందని పేర్కొంది. డిజిటైజేషన్ దిశగా భారత్ అద్భుతమైన ప్రగతి చూపించిందని, పలు రంగాల్లో పెద్ద ఎత్తున విదేశీ పెట్టుబడులకు ద్వారాలు తెరవడాన్ని కూడా ప్రశంసించింది. -
భారత ‘తాత్కాలిక’ అభ్యర్థిత్వానికి మద్దతు
ఐక్యరాజ్యసమితి: ఐక్యరాజ్యసమితి (ఐరాస) భద్రతామండలిలో తాత్కాలిక సభ్యదేశాలను ఎంపిక చేసేందుకు నిర్వహించే ఎన్నికల్లో ఇండియా అభ్యర్థిత్వానికి 55 దేశాలతో కూడిన ఆసియా–పసిఫిక్ బృందం ఏకగ్రీవంగా మద్దతు తెలిపింది. చైనా, పాకిస్తాన్‌లు కూడా ఈ ఆసియా–పసిఫిక్ దేశాల బృందంలో ఉండటం గమనార్హం. భద్రతామండలిలో ఐదు దేశాలకు శాశ్వత సభ్యత్వం ఉండగా, మరో పది దేశాలకు తాత్కాలిక సభ్యత్వం కల్పిస్తారు. ఎన్నికలను నిర్వహించడం ద్వారా ఆ పది తాత్కాలిక సభ్య దేశాలను ఎన్నుకుంటారు. ప్రతి ఏడాదీ ఎన్నిక నిర్వహించి ఐదు దేశాలను ఎంపిక చేస్తారు. ఒకసారి ఎన్నికైతే ఆ దేశాలకు రెండేళ్లపాటు భద్రతామండలిలో తాత్కాలిక సభ్యత్వం లభిస్తుంది. 2021– 22 సంవత్సరాలకుగాను తాత్కాలిక సభ్యత్వం పొందే దేశాలను ఎంపిక చేసేందుకు వచ్చే ఏడాది జూన్‌లో ఎన్నికలు జరుగుతాయి. ఈ ఎన్నికల్లోనే ఇండియా పోటీ చేయనుండగా, భారత అభ్యర్థిత్వాన్ని ఆసియా–పసిఫిక్ బృందంలోని మొత్తం దేశాలు ఏకగ్రీవంగా ఆమోదించాయి. ఈ విషయాన్ని ఐరాసలో భారత శాశ్వత రాయబారి సయ్యద్ అక్బరుద్దీన్ మంగళవారం ట్విట్టర్ ద్వారా తెలిపారు. భారత అభ్యర్థిత్వానికి మద్దతు తెలిపిన దేశాల్లో చైనా, పాకిస్తాన్, నేపాల్, జపాన్, ఇరాన్, టర్కీ, మలేసియా, ఇండోనేసియా, శ్రీలంక, సిరియా, సౌదీ అరేబియా, కువైట్, ఖతార్, యూఏఈ, అఫ్గానిస్తాన్, బంగ్లాదేశ్, భూటాన్, వియత్నాం, మాల్దీవులు, మయన్మార్, కిర్గిజ్స్తాన్ తదితర దేశాలు ఉన్నాయని ఆయన వెల్లడించారు. ఇక ఇప్పటికే భారత్ ఏడుసార్లు ఐరాస భద్రతామండలిలో తాత్కాలిక సభ్యదేశంగా ఉంది. చివరిసారిగా 2011–12 సంవత్సరాల్లో భద్రతామండలిలో ఇండియా తాత్కాలిక సభ్యదేశ హోదాను పొందింది. వచ్చే ఏడాది జరిగే ఎన్నికల్లో విజయం సాధిస్తే పదేళ్ల తర్వాత మళ్లీ ఆ హోదా దక్కనుంది. భద్రతామండలిలో అమెరికా, బ్రిటన్, ఫ్రాన్స్, చైనా, రష్యాలకు శాశ్వత సభ్యత్వం ఉండటం తెలిసిందే. 21వ శతాబ్దపు రాజకీయ, భౌగోళిక పరిస్థితుల దృష్ట్యా ఇండియాకు కూడా శాశ్వత సభ్యత్వం కల్పించాలన్న డిమాండ్ ఎప్పటినుంచో ఉంది. -
ఐరాస యూనిట్‌కు తిరిగి ఎన్నికైన భారత రాయబారి
ఐక్యరాజ్యసమితి: భారత అగ్రశ్రేణి రాయబారి అచంకులగరే గోపీనాథన్ ను ఐక్యరాజ్య సమితి సాధారణ అసెంబ్లీ... యూఎన్ ఉమ్మడి దర్యాప్తు సంస్థ(జేఐయూ)కు మళ్లీ సభ్యుడిగా నియమించింది. గోపీనాథన్ తో పాటు సుకాయ్ ప్రోం జాక్సన్ (జాంబియా), జీన్ వెస్లీ(హైతీ), లోజిన్ స్కీ(రష్యా) కూడా సభ్యులుగా నియమితులయ్యారు. వీరు 2018 జనవరి1 నుంచి ఐదేళ్లు ఈ పదవిలో ఉంటారు. గోపీనాథన్ ను భారత్ ప్రతిపాదించగా, ఆసియా పసిఫిక్ బృందం తన ఏకైక అభ్యర్థిగా ఆమోదం తెలిపింది. ఆయన తొలిసారి 2013 జనవరి నుంచి 2017 డిసెంబర్ వరకు ఈ పదవికి ఎన్నికయ్యారు. ఆ సమయంలో 183 ఓట్లకు గాను 106 ఓట్లు సాధించి చైనా రాయబారి జాంగ్ యాన్‌ను ఓడించారు. ప్రస్తుతం ఉమ్మడి దర్యాప్తు సంస్థకు చైర్మన్ గా పనిచేస్తున్నారు.