ఐక్యరాజ్యసమితి: ఐక్యరాజ్యసమితి (ఐరాస) భద్రతామండలిలో తాత్కాలిక సభ్యదేశాలను ఎంపిక చేసేందుకు నిర్వహించే ఎన్నికల్లో ఇండియా అభ్యర్థిత్వానికి 55 దేశాలతో కూడిన ఆసియా–పసిఫిక్ బృందం ఏకగ్రీవంగా మద్దతు తెలిపింది. చైనా, పాకిస్తాన్‌లు కూడా ఈ ఆసియా–పసిఫిక్ దేశాల బృందంలో ఉండటం గమనార్హం. భద్రతామండలిలో ఐదు దేశాలకు శాశ్వత సభ్యత్వం ఉండగా, మరో పది దేశాలకు తాత్కాలిక సభ్యత్వం కల్పిస్తారు. ఎన్నికలను నిర్వహించడం ద్వారా ఆ పది తాత్కాలిక సభ్య దేశాలను ఎన్నుకుంటారు. ప్రతి ఏడాదీ ఎన్నిక నిర్వహించి ఐదు దేశాలను ఎంపిక చేస్తారు.
ఒకసారి ఎన్నికైతే ఆ దేశాలకు రెండేళ్లపాటు భద్రతామండలిలో తాత్కాలిక సభ్యత్వం లభిస్తుంది. 2021– 22 సంవత్సరాలకుగాను తాత్కాలిక సభ్యత్వం పొందే దేశాలను ఎంపిక చేసేందుకు వచ్చే ఏడాది జూన్‌లో ఎన్నికలు జరుగుతాయి. ఈ ఎన్నికల్లోనే ఇండియా పోటీ చేయనుండగా, భారత అభ్యర్థిత్వాన్ని ఆసియా–పసిఫిక్ బృందంలోని మొత్తం దేశాలు ఏకగ్రీవంగా ఆమోదించాయి. ఈ విషయాన్ని ఐరాసలో భారత శాశ్వత రాయబారి సయ్యద్ అక్బరుద్దీన్ మంగళవారం ట్విట్టర్ ద్వారా తెలిపారు.
భారత అభ్యర్థిత్వానికి మద్దతు తెలిపిన దేశాల్లో చైనా, పాకిస్తాన్, నేపాల్, జపాన్, ఇరాన్, టర్కీ, మలేసియా, ఇండోనేసియా, శ్రీలంక, సిరియా, సౌదీ అరేబియా, కువైట్, ఖతార్, యూఏఈ, అఫ్గానిస్తాన్, బంగ్లాదేశ్, భూటాన్, వియత్నాం, మాల్దీవులు, మయన్మార్, కిర్గిజ్‌స్తాన్ తదితర దేశాలు ఉన్నాయని ఆయన వెల్లడించారు. ఇక ఇప్పటికే భారత్ ఏడుసార్లు ఐరాస భద్రతామండలిలో తాత్కాలిక సభ్యదేశంగా ఉంది. చివరిసారిగా 2011–12 సంవత్సరాల్లో భద్రతామండలిలో ఇండియా తాత్కాలిక సభ్యదేశ హోదాను పొందింది. వచ్చే ఏడాది జరిగే ఎన్నికల్లో విజయం సాధిస్తే పదేళ్ల తర్వాత మళ్లీ ఆ హోదా దక్కనుంది. భద్రతామండలిలో అమెరికా, బ్రిటన్, ఫ్రాన్స్, చైనా, రష్యాలకు శాశ్వత సభ్యత్వం ఉండటం తెలిసిందే. 21వ శతాబ్దపు రాజకీయ, భౌగోళిక పరిస్థితుల దృష్ట్యా ఇండియాకు కూడా శాశ్వత సభ్యత్వం కల్పించాలన్న డిమాండ్ ఎప్పటినుంచో ఉంది.
Comments
Please login to add a commentAdd a comment