
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: ఏసీ అనగానే ముందు గుర్తొచ్చేది కరెంటు బిల్లు. మామూలు బిల్లుకు... ఏసీ వాడితే వచ్చే కరెంటు బిల్లుకు దాదాపు మూడు నాలుగు రెట్లు తేడా ఉంటుంటుంది. అందుకే అంతా విద్యుత్‌ను ఆదా చేసే ఏసీలకే ఓటేస్తారు. ఫలితంగానే ఈ మధ్య ఇన్వర్టర్ ఏసీలకు డిమాండ్ అనూహ్యంగా పెరుగుతోంది. మొత్తం పరిశ్రమలో 2016లో ఇన్వర్టర్ విభాగం వాటా కేవలం 14 శాతమే. గతేడాది ఇది రెండింతలకుపైగా పెరిగి 32 శాతానికి చేరింది. 2018లో ఇన్వర్టర్ ఏసీల వాటా 60 శాతానికి చేరడం ఖాయమని ఎల్‌జీ చెబుతోంది. సాధారణ 5 స్టార్ ఏసీలతో పోలిస్తే ఇన్వర్టర్ మోడల్‌కు ధరలో పెద్దగా వ్యత్యాసం లేకపోవడం కూడా డిమాండ్‌కు కారణమని పరిశ్రమ చెబుతోంది. దాదాపు అన్ని కంపెనీలూ ఈ విభాగంలో పెద్ద ఎత్తున మోడళ్లను ప్రవేశపెడుతున్నాయి. ఏసీల నాణ్యత ప్రమాణాలను బ్యూరో ఆఫ్ ఎనర్జీ ఎఫీషియెన్సీ (బీఈఈ) కఠినతరం చేయడంతో మెరుగైన మోడళ్లు మార్కెట్లోకి వస్తున్నాయి.
కఠిన ప్రమాణాలు ఇక్కడే..
భారత్‌లో 2018 జనవరి 1 నుంచి ‘ఇండియన్ సీజనల్ ఎనర్జీ ఎఫీషియెన్సీ రేషియో (ఐఎస్‌ఈఈఆర్)’ పేరిట ఏసీలకు కొత్త స్టార్ రేటింగ్ ప్రమాణాలు అమల్లోకి వచ్చాయి. వీటి వల్ల ఏసీకి వినియోగించే విద్యుత్ 40 శాతానికి తగ్గింది. అలాగే 5 స్టార్ ఏసీ కాస్తా 3 స్టార్ అయింది. కొత్త రేటింగ్స్‌కు అనుగుణంగా తక్కువ విద్యుత్‌ను ఖర్చు చేసే విధంగా అత్యంత నాణ్యమైన ఏసీలను కంపెనీలు తయారు చేయాల్సిందే. ప్రపంచంలో విద్యుత్‌ను అత్యంత సమర్థవంతంగా వినియోగించే ఉత్పాదనగా భారత 5 స్టార్ ఏసీ నిలిచినట్లు బ్లూ స్టార్ జాయింట్ ఎండీ బి.త్యాగరాజన్ ‘సాక్షి బిజినెస్ బ్యూరో’ ప్రతినిధితో చెప్పారు. రెండు మూడేళ్లలో ఇన్వర్టర్ విభాగమే మార్కెట్‌ను పూర్తిగా కైవసం చేసుకుంటుందని ఎల్‌జీ ఎలక్ట్రానిక్స్ ఇండియా ఏసీ బిజినెస్ హెడ్ విజయ్ బాబు ధీమా వ్యక్తంచేశారు.
కోటి యూనిట్ల దిశగా..
దేశవ్యాప్తంగా 2017లో 55–60 లక్షల ఏసీలు అమ్ముడయ్యాయి. 2020 నాటికి ఒక కోటి యూనిట్లను దాటవచ్చని బ్లూ స్టార్ అంచనా వేస్తోంది. వచ్చే మూడేళ్లు పరిశ్రమ సగటున 15% వృద్ధిని నమోదు చేస్తుందని బ్లూస్టార్ చెబుతోంది. భారత్‌లో కస్టమర్లు ఏడేటళ్లకు ఒకసారి ఏసీని మారుస్తున్నారట. పైపెచ్చు గతంలో ఒక ఏసీకే పరిమితమైన వారు ఇప్పుడు అదనపు ఏసీలను సమకూర్చుకుంటున్నారు. 50% మంది కస్టమర్ల ఆలోచన ఏసీకి అయ్యే విద్యుత్ ఖర్చు గురించేనట. ఇవన్నీ తాజా సర్వేలో వెల్లడైన అంశాలు. కాగా, బ్యూరో ఆఫ్ ఎనర్జీ ఎఫీషియెన్సీ (బీఈఈ) ప్రకారం రోజుకు 8 గం టల చొప్పున 200 రోజులు 1.5 టన్ను ఇన్వర్టర్ ఏసీ వినియోగిస్తే 5 స్టార్ మోడల్‌కు సుమారు 850 యూనిట్లు, 3 స్టార్‌కు అయితే 1,050 యూ నిట్లు విద్యుత్ ఖర్చు అవుతుంది. మోడల్‌ను బట్టి స్వల్పంగా యూనిట్లలో తేడా ఉంటుంది. సాధారణ ఏసీ మోడల్ అయితే ఇన్వర్టర్ ఏసీ కంటే 70% అధికంగా విద్యుత్ ఖర్చవుతుంది.
Comments
Please login to add a commentAdd a comment