
వ్యాపారాలకు గుజరాత్ టాప్..
రెండో స్థానంలో ఆంధ్రప్రదేశ్
- 13వ స్థానంలో తెలంగాణ
- వ్యాపారాలకు అనువైన రాష్ట్రాలపై ప్రపంచ బ్యాంక్ నివేదిక
న్యూఢిల్లీ: దేశీయంగా వ్యాపారాలకు అనువైన రాష్ట్రాల్లో గుజరాత్ అగ్రస్థానంలో నిల్చింది. ఆంధ్రప్రదేశ్ రెండో స్థానం, జార్ఖండ్ మూడో స్థానం దక్కించుకున్నాయి. తెలంగాణ 13వ స్థానంలో ఉంది. రాష్ట్రాలు అమలు చేస్తున్న వ్యాపార సంస్కరణలను మదింపు చేస్తూ పారిశ్రామిక విధానం, ప్రోత్సాహక విభాగం (డీఐపీపీ), పరిశ్రమల సమాఖ్యలు సీఐఐ, ఫిక్కీ.. కన్సల్టెన్సీ సంస్థ కేపీఎంజీతో కలిసి ప్రపంచ బ్యాంకు రూపొందించిన నివేదికలో ఈ అంశాలు వెల్లడయ్యాయి. వ్యాపారాలకు అనువైన రాష్ట్రాల జాబితాలో మిజోరం, జమ్మూ కశ్మీర్, మేఘాలయ, నాగాలాండ్, అరుణాచల్ ప్రదేశ్ అట్టడుగున ఉన్నాయి. టాప్ 5 రాష్ట్రాల్లోని నాలుగింటిలో బీజేపీ ప్రభుత్వాలు ఉండగా, ఆంధ్రప్రదేశ్‌లో బీజేపీ మిత్రపక్షం టీడీపీ అధికారంలో ఉండటం గమనార్హం.
దేశీ, విదేశీ పెట్టుబడులను ఆకర్షించడంలో రాష్ట్రాల మధ్య పోటీ వాతావరణం కల్పించడం ఈ కసరత్తు వెనుక ప్రధానోద్దేశం. స్థల కేటాయింపులు, కార్మిక సంస్కరణలు, పర్యావరణ అనుమతులు, వ్యాపారాల ఏర్పాటుకు పరిస్థితులు, ఇన్‌ఫ్రా తదితర ఎనిమిది అంశాల ప్రాతిపదికన 32 రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలకు ప్రపంచ బ్యాంకు ర్యాంకింగ్‌లు ఇచ్చింది. డీఐపీపీ, కేంద్ర పాలిత ప్రాంతాలు, రాష్ట్రాలు రూపొందించుకున్న 98 సూత్రాల కార్యాచరణ ప్రణాళిక జనవరి 1 నుంచి జూన్ 30 మధ్య దాకా అమలైన తీరును కూడా ఇందుకు పరిగణనలోకి తీసుకుంది.
నివేదిక ప్రకారం ఆంధ్రప్రదేశ్, ఛత్తీస్‌గఢ్, గుజరాత్ తదితర రాష్ట్రాలు.. ప్రణాళికలోని అంశాలను సగ భాగం పైగా అమలు చేశాయి. అయితే, చాలామటుకు రాష్ట్రాలు ఇంకా చాలా ప్రణాళికలు అమలు చేయాల్సి ఉందని వరల్డ్ బ్యాంక్ పేర్కొంది. టాప్ టెన్ జాబితాలో ఛత్తీస్‌గఢ్, మధ్యప్రదేశ్, రాజస్తాన్, ఒడిశా, మహారాష్ట్ర, కర్ణాటక, ఉత్తర్ ప్రదేశ్ చోటు దక్కించుకున్నాయి. తమిళనాడు 12వ స్థానంలో, కేరళ 18వ స్థానంలో నిల్చాయి. రాష్ట్రాలు సంస్కరణల అమలు దిశగా ముందుకెడుతున్నాయన్నది నివేదిక ద్వారా వెల్లడైందని డీఐపీపీ అదనపు కార్యదర్శి శత్రుఘ్న సిన్హా తెలిపారు.
భారత్‌లో వ్యాపారం కష్టమే..
వ్యాపారాల నిర్వహణ భారత్‌లో కష్టమేనని, అనేక సంస్కరణలు చేపట్టాల్సిన అవసరం ఉందని నివేదికలో వరల్డ్ బ్యాంక్ కంట్రీ డెరైక్టర్ ఒనో రుహల్ నివేదిక ముందు మాటలో తెలిపారు. కేంద్ర, రాష్ట్రాల ప్రభుత్వాలు కలిసికట్టుగా సంస్కరణలు అమలు చేయాలని పేర్కొన్నారు. నియంత్రణలు ఎక్కువగా ఉండటం భారత్‌లో వ్యాపారాలపై భారంగా మారుతోందని దీనివల్లే వ్యాపారాలకు అనువైన 182 దేశాల జాబితాలో భారత్ దాదాపు అట్టడుగున 142వ స్థానంలో ఉందని పేర్కొన్నారు. నిర్మాణ అనుమతులు వంటి అంశాల్లోనైతే ఏకంగా అట్టడుగు పది దేశాల్లో ఉందన్నారు. అయితే, ఇటీవలి కాలంలో ప్రభుత్వం తీసుకున్న చర్యలు పరిస్థితులు మెరుగుపడేందుకు తోడ్పడగలవని ఆయన అభిప్రాయపడ్డారు.