భారత్ ముంగిట్లో 6 లక్షల కోట్లు | In front of Rs 6 lakh crore in India | Sakshi
Sakshi News home page

భారత్ ముంగిట్లో 6 లక్షల కోట్లు

Published Fri, Oct 10 2014 12:42 AM | Last Updated on Thu, Oct 4 2018 5:15 PM

భారత్ ముంగిట్లో 6 లక్షల కోట్లు - Sakshi

భారత్ ముంగిట్లో 6 లక్షల కోట్లు

భారీ విదేశీ పెట్టుబడులు తరలివస్తున్నాయి..

రాష్ట్రాలు అందిపుచ్చుకోవాలి
జపాన్, చైనా, అమెరికా ఇన్వెస్టర్ల వరుస....
మధ్యప్రదేశ్ గ్లోబల్ ఇన్వెస్టర్ల సదస్సులో ప్రధాని మోదీ


ఇండోర్: భారత్ ముంగిట్లో 100 బిలియన్ డాలర్ల(సుమారు రూ.6.1 లక్షల కోట్లు) విదేశీ పెట్టుబడులు ఎదురుచూస్తున్నాయని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ పేర్కొన్నారు. ఇంత భారీ నిధులను ఎంతమేరకు అందిపుచ్చుకుంటాయనేది ఆయా రాష్ట్రాల ప్రభుత్వాలపైనే ఆధారపడి ఉంటుందన్నారు. గురువారమిక్కడ మధ్యప్రదేశ్ ప్రభుత్వం నిర్వహిస్తున్న ప్రపంచ ఇన్వెస్టర్ల సదస్సును ప్రారంభించిన సందర్భంగా మాట్లాడుతూ ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. ఇటీవలే ప్రారంభించిన ‘మేక్ ఇన్ ఇండియా’ కార్యక్రమం పారిశ్రామికవేత్తలు, ప్రభుత్వానికి ఉభయతారకంగా నిలుస్తుందన్నారు.

విదేశీ ఇన్వెస్టర్లు భారత్‌ను కేవలం ఒక మార్కెట్‌గానే చూడకుండా.. భారతీయుల కొనుగోలు సామర్థ్యాన్ని పెంచేవిధంగా, దేశాన్ని తయారీ కేంద్రంగా మార్చడానికి తోడ్పడాలని మోదీ స్పష్టం చేశారు. ‘జపాన్, చైనా, అమెరికాల నుంచి 100 బిలియన్ డాలర్ల విలువైన పెట్టుబడులు వీసా కోసం దరఖాస్తు చేసుకున్నాయి(రెడీగా ఉన్నాయి). ఇప్పుడు ఈ మహదావకాశాన్ని సొమ్ముచేసుకోవాల్సింది రాష్ట్రాలే. దారులన్నీ విశాలంగా తెరిచిఉన్నాయి. ఏ రాష్ట్రాలైతే సన్నద్ధంగా ఉంటాయో.. వాటికి ఈ నిధుల్లో అత్యధిక వాటా దక్కుతుంది’ అని మోదీ పేర్కొన్నారు.

ఉద్యోగాల సృష్టే లక్ష్యం...
ప్రధానిగా బాధ్యతలు స్వీకరించాక గత రెండుమూడు నెలల్లో మోదీ జపాన్, అమెరికా పర్యటనలతో పాటు తయారీ రంగంలోకి భారీగా పెట్టుబడులకు ఆకర్షించేందుకుగాను ‘మేక్ ఇన్ ఇండియా’ ప్రచార కార్యక్రమాన్ని కూడా ప్రారంభంచారు. ‘ప్రపంచానికి నేను చెప్పిందొక్కటే. ఇండియాలో గనుక ప్రగతి పరుగులుతీయకపోతే.. ప్రజల కొనుగోలు శక్తి కూడా పెరగదు. దీంతో భారత్‌ను అత్యంత గొప్ప మార్కెట్‌గా ఊహించుకుంటున్నవారి కలలు కూడా సాకారం కావు. దేశంలో ఇప్పుడు భారీగా పెట్టుబడి అవకాశాలు రారమ్మంటున్నాయి. ప్రపంచానికి ఈ విషయంలో నమ్మకం కల్పించగలిగితేనే మేక్ ఇన్ ఇండియా కార్యక్రమం విజయవంతమవుతుంది’ అని ప్రధాని వ్యాఖ్యానించారు. కాగా, వ్యవసాయం, తయారీ, సేవల రంగాలను పోత్సహించడం ద్వారా భారీగా ఉద్యోగాలను సృష్టించడంపై తమ ప్రభుత్వం దృష్టిపెడుతోందని చెప్పారు.
 
రాష్ట్రాలతో కలసి నడుస్తాం...

రాష్ట్ర ప్రభుత్వాలు సంకుచిత రాజకీయ ప్రయోజనాలను పక్కనబెట్టి అభివృద్ధిలో ముందుకుసాగాలని.. ఇందుకు కేంద్రం కూడా తగిన సహకారాన్ని అందిస్తుందని ప్రధాని పేర్కొన్నారు. తనతోపాటు ముఖ్య మంత్రులందరినీ కలిపి టీమ్ ఇండియాగా ఆయన అభివర్ణించారు. రాష్ట్రాలు ప్రగతిపథంలో నడవకపోతే.. దేశం ముందుకెళ్లడం సాధ్యంకాదని కూడా ఆయన హితవుపలికారు. ‘రాష్ట్రాలు, కేంద్రం శతృవులు లేదంటే ప్రత్యర్థులేమీ కావు. రాజకీయంగా ఎన్ని భేదాభిప్రాయాలు ఉన్నా... ఆర్థిక వృద్ధి విషయంలో చేయిచేయి కలిపి పనిచేసేందుకు కేంద్రం సదా సిద్ధంగా ఉంటుంది’ అని మోదీ స్పష్టం చేశారు.

వ్యవసాయంలో విలువజోడింపుపై దృష్టిపెట్టాలని.. మౌలికవసతుల కల్పనతో రైతులకు ఇతోధికంగా మేలుచేకూరుతుందన్నారు. వ్యవసాయ ఉత్పత్తులకు తగిన విలువ లభించేలా తోడ్పాటునందించాలని పారిశ్రామికవేత్తలను మోదీ కోరారు. ప్రవాసీయుల నైపుణ్యం, అనుభవాలను దేశంలో ఉపయోగించుకునేందుకు వీలుగా ప్రపంచవ్యాప్తం గా ఉన్న భారతీయుల్లోని నిపుణులకు సంబంధించి ఒక డేటాను రూపొందించే కార్యక్రమం చేపట్టాల్సి ఉందని కూడా ఆయన అభిప్రాయపడ్డారు. కేంద్ర ప్రభుత్వ పథకాలను సమర్థంగా అమలుచేయడం ద్వారా అత్యధికంగా మధ్యప్రదేశ్ తగిన ప్రతిఫలాలను పొందుతోందని కితాబిచ్చారు.
 
రూ. 2 లక్షల కోట్ల ప్రతిపాదనలు..!

ఇన్వెస్టర్ల సదస్సుకు దేశీయ కార్పొరేట్ దిగ్గజాలైన రిలయన్స్ ఇండస్ట్రీస్ చీఫ్ ముకేశ్ అంబానీ, అడాగ్ అధిపతి అనిల్ అంబానీ, అదానీ గ్రూప్ హెడ్ గౌతమ్ అదానీ, టాటా గ్రూప్ చైర్మన్ సైరస్ మిస్త్రీ తదితరులు హాజరయ్యారు. 28 దేశాలకు చెందిన రాయబారులు కూడా దీనిలో పాల్గొన్నారు. ఇందులో 9 భాగస్వామ్య దేశాలు కూడా ఉన్నాయి. కాగా, మధ్యప్రదేశ్‌లో 2016 మార్చికల్లా రూ.20 వేల కోట్ల పెట్టుబడి ప్రణాళికలను పూర్తిచేయనున్నట్లు ముకేశ్ అంబానీ హామీనిచ్చారు.

ఇది పూర్తయితే ఇంతే స్థాయిలో తదుపరి పెట్టుబడులు ఉంటాయని కూడా చెప్పారు. వచ్చే ఐదేళ్లలో రూ.20 వేల కోట్ల పెట్టుబడులు పెట్టుబడులు వెచ్చించనున్నట్లు గౌతమ్ అదానీ వెల్లడించారు. అయితే, సదస్సు ద్వారా మొత్తం రూ. 2 లక్షల కోట్ల పెట్టుబడి ప్రతిపాదనలు రావచ్చని మధ్యప్రదేశ్ ప్రభుత్వ వర్గాలు అంచనా వేస్తున్నాయి. సదస్సుకు హాజరైన ఇతర ముఖ్య కార్పొరేట్‌లలో ఎస్సార్ గ్రూప్ శశి రూయా, ఆదిత్య బిర్లా గ్రూప్ కుమారమంగళం బిర్లా, గోద్రెజ్ గ్రూప్ ఆది గోద్రెజ్, ఎల్ అండ్ టీ ఏఎం నాయక్, ఫ్యూచర్ గ్రూప్ కిశోర్ బియానీ, ఐటీసీ చైర్మన్ వైసీ దేవేశ్వర్, డీసీఎం శ్రీరామ్ హెడ్ అజయ్ శ్రీరామ్ ఉన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement