కుబేరుల ఖిల్లా.. భారత్!
* ప్రపంచంలో 16వ స్థానం
* వరల్డ్ వెల్త్ రిపోర్ట్ 2014 వెల్లడి
లండన్: భారత్‌లో కుబేరులు(హై నెట్‌వర్త్ ఇండివిడ్యువల్స్) పెరుగుతున్నారు. 2013లో 3,000 మంది కొత్తగా మిలియనీర్ల క్లబ్‌లో చేరారని క్యాప్‌జెమిని, ఆర్‌బీసీ వెల్త్ మేనేజ్‌మెంట్‌లు రూపొందించిన నివేదిక తెలిపింది. ఈ వరల్డ్ వెల్త్ రిపోర్ట్ 2014 వెల్లడించిన కొన్ని ముఖ్యాంశాలు...,
* 2012లో 1,53,000గా ఉన్న భారత కుబేరుల సంఖ్య గతేడాదిలో 1,56,000కు పెరిగింది.
* అధిక సంఖ్యలో కుబేరులున్న 16వ దేశం భారత్.
* 40 లక్షల మంది మిలియనీర్లతో అమెరికా మొదటి స్థానంలో నిలిచింది. ఆ తర్వాతి స్థానాల్లో జపాన్(23,27,000 మంది కుబేరులు), జర్మనీ(11,30,000), చైనా(7,58,000)లు ఉన్నాయి. ప్రపంచవ్యాప్తంగా ఉన్న మొత్తం కుబేరుల్లో 60 శాతం మంది ఈ నాలుగు దేశాల్లోనే ఉన్నారు.
* ప్రపంచం మొత్తం మీద 1.76 కోట్ల మంది కుబేరులున్నారు. వీరందరి సంపద 52.62 లక్షల కోట్ల డాలర్లు. 2016 కల్లా ప్రపంచ మొత్తం సంపద 22% వృద్ధితో 64.3 లక్షల కోట్ల డాలర్లకు పెరుగుతుంది.
* గత ఏడాదితో పోల్చితే హైనెట్‌వర్త్ ఇండివిడ్యువల్స్ సంఖ్య 15 శాతం పెరిగింది. గత ఐదేళ్లలో వీరి సంఖ్య 40 శాతం పెరిగడం విశేషం.
* గత ఏడాది ఈక్విటీ మార్కెట్లు పెరగడం, అంతర్జాతీయంగా ఆర్థిక పరిస్థితులు మెరుగుపడడంతో వివిధ దేశాల్లో సంపద స్థాయిలు పెరిగాయి.