భారత్‌లో స్టార్టప్‌లకు జోష్.. | In Nasscom Conference prime Minister Modi | Sakshi
Sakshi News home page

భారత్‌లో స్టార్టప్‌లకు జోష్..

Published Tue, Sep 29 2015 1:48 AM | Last Updated on Fri, Aug 24 2018 2:20 PM

భారత్‌లో స్టార్టప్‌లకు జోష్.. - Sakshi

భారత్‌లో స్టార్టప్‌లకు జోష్..

నాస్కామ్ సదస్సులో ప్రధాని మోదీ
- స్టార్టప్ వ్యవస్థలో సొంతముద్ర...
- యువత శక్తిసామర్థ్యాలు, సృజనాత్మకతే దన్ను
- కొత్త వెంచర్లకు సర్వత్రా ఆసక్తి...
శాన్‌జోస్:
భారత్‌లో స్టార్టప్‌ల వ్యవస్థ సొంతశైలిలో దూసుకెళ్తోందని ప్రధాని నరేంద్ర మోదీ చెప్పారు. దేశంలో యువత శక్తిసామర్థ్యాలు, సృజనాత్మకత, ఔత్సాహిక ధోరణే స్టార్టప్‌లు పుట్టుకొచ్చేందుకు దన్నుగా నిలుస్తున్నాయన్నారు. అమెరికా పర్యటనలో భాగంగా నాస్కామ్ నిర్వహించిన స్టార్టప్ సదస్సులో మాట్లాడుతూ మోదీ ఈ వ్యాఖ్యలు చేశారు. ఈ కార్యక్రమంలో సోషల్ నెట్‌వర్కింగ్ దిగ్గజం లింక్డ్‌ఇన్ సహ వ్యవస్థాపకుడు రీడ్ హాఫ్‌మన్ కూడా పాల్గొన్నారు. ‘భారత్ భారీస్థాయి మార్కెట్‌తో వృద్ధిపథంలో పయనిస్తోంది.

ప్రతిఒక్క రంగంలో కూడా అపారమైన అవకాశాలు ఎదురుచూస్తున్నాయి. నవకల్పన, సాంకేతిక పరిజ్ఞానానికి సంబంధించి భారత్, అమెరికాల మధ్య ఎప్పటినుంచో సహజసిద్ధమైన భాగస్వామ్యం ఉంది. ఇక్కడ కొత్త వెంచర్ల ఏర్పాటుకు అన్నిరకాల ప్రోతాహకాలు, సంస్థలు, అన్నింటికంటే ముఖ్యంగా అమితమైన ఆసక్తి నెలకొంది. ఇన్వెస్టర్లు కూడా రిస్క్ తీసుకోవడానికి వెనుకాడటం లేదు. గడిచిన కొద్ది సంవత్సరాల్లో భారత్‌లో స్టారప్ వెంచర్లు భారీగా పుట్టుకొచ్చాయి. ఉద్యోగాల కల్పన, ఎంట్రప్రెన్యూర్‌షిప్‌తో పాటు దేశ ఆర్థికాభివృద్దికి ఈ స్టార్టప్ విప్లవం ఎంతగానో దోహదం చేస్తుందని భావిస్తున్నా’ అని మోదీ వ్యాఖ్యానించారు.
 
భారీ మార్కెట్, అపార అవకాశాలు...
ఈ కార్యక్రమానికి ముందు ఇండియా-యూఎస్ కనెక్ట్ 2015 అనే మరో సదస్సు జరిగింది. టీఐఈ సిలికాన్ వ్యాలీ, ఐఐఎం అహ్మదాబాద్‌కు చెందిన సీఐఐఈ ఇండియాలు దీన్ని నిర్వహించాయి. ఇందులో భారత్, అమెరికాలకు చెందిన చెరో 40 స్టార్టప్ సంస్థలు పాల్గొన్నాయి. ‘భారత్‌లోని అద్భుతమైన స్టార్టప్‌ల బృందం ఇక్కడ కొలువుదీరింది. విద్య, ఆరోగ్యం, వ్యవసాయం, పునరుత్పాదక ఇంధనం, భద్రత, సమ్మిళిత ఆర్థికాభివృద్ధి, అందరికీ పరిశుద్ధమైన తాగునీరు కల్పన వంటి అనేక అంశాల్లో టెక్నాలజీ వినియోగం ద్వారా సమూలు మార్పులకు ఈ సంస్థలు కృషిచేస్తున్నాయి. స్టార్టప్‌లంటే కేవలం వ్యాపార విజయాలకే పరిమితం కాదు. సామాజికంగా కూడా వినూత్న మార్పులకు ఇవి బలమైన ఉదాహరణలు గా నిలుస్తున్నాయి. భారత్‌లో ఇప్పుడు దాదాపు 100 కోట్ల మంది మొబైల్ ఫోన్లను వినియోగిస్తున్నారు. స్మార్ట్‌ఫోన్‌లు, ఇంటర్నెట్ వినియోగం కూడా దూసుకెళ్తోంది. డిజిటల్ ఇండియా ఆలోచన రూపుదిద్దుకోవడానికి ఇవే ప్రేరణ’ అని మోదీ వివరించారు.
 
ఏడు స్టార్టప్ ఎంవోయూలు...
భారత్‌లో స్టార్టప్‌లను మరింతగా ప్రోత్సహించే చర్యల్లో భాగంగా ఇరు దేశాలకు చెందిన వివిధ సంస్థల మధ్య ఏడు అవగాహన ఒప్పందాలు(ఎంఓయూ) కుదిరాయి. వివరాలివీ...
- సెంటర్ ఫర్ సెల్యులార్ అండ్ మాలిక్యులర్ ప్లాట్‌ఫామ్స్, కాలిఫోర్నియా ఇన్‌స్టిట్యూట్ ఫర్ క్వాంటిటేటివ్ బయోసెన్సైస్‌ల మధ్య తొలి ఎంఓయూ కుదిరింది. సైన్స్ ఆధారిత ఎంట్రప్రెన్యూర్‌షిప్, రీసెర్చ్, విద్య, వ్యాపారాలను ప్రోత్సహించడమే దీని ప్రధానోద్దేశం.
- ప్రకాశ్ ల్యాబ్, స్టాన్‌ఫోర్డ్ యూనివర్సిటీ, డిపార్ట్‌మెంట్ ఆఫ్ బయోటెక్నాలజీలు కూడా ఒప్పందం కుదుర్చుకున్నాయి.
- భారత్, సిలియాన్ వ్యాలీలలో టెక్నాలజీ ఎంట్రప్రెన్యూర్‌షిప్‌లకు తగిన పరిస్థితులను కల్పించే ఉద్దేశంతో నాస్కామ్, ఇండస్ ఎంట్రప్రెన్యూర్స్‌లు కలిసి పనిచేయనున్నాయి.
- ఐఐఎం అహ్మదాబాద్‌కు చెందిన సెంటర్ ఫర్ ఇన్నోవేషన్ అండ్ ఎంట్రప్రెన్యూర్‌షిప్(సీఐఐఈ), కాలిఫోర్నియా యూని వర్సిటీ హాస్ బిజినెస్ స్కూల్‌కు చెందిన లెస్టర్ సెంటర్ ఫర్ ఎంట్రప్రెన్యూర్‌షిప్‌ల మధ్య కూడా ఒప్పందం కుదిరింది. స్టార్టప్స్ ఇంక్యుబేషన్, ఇతరత్రా అంశాల్లో సహకరించుకోవడం దీని లక్ష్యం.
- లాస్ ఏంజెలిస్ క్లీన్‌టెక్ ఇంక్యుబేటర్‌తో కూడా సీఐఐఈ జట్టుకట్టింది. ఎంట్రప్రెన్యూర్లు, ఇన్నోవేటర్లకు క్లీన్‌టెక్ రంగంలో కాలిఫోర్నియా, భారత్ మార్కెట్లలో తగిన అవకాశాలను అందిపుచ్చుకోవడానికి వీలుగా ఒక ప్రోగ్రామ్‌ను ఈ సంస్థలు అందించనున్నాయి.
- భారతీయ ఎంట్రప్రెన్యూర్లకు సీడ్ ఫండింగ్ కోసం టాటా ట్రస్ట్‌తో కూడా సీఐఐఈ ఎంఓయూ కుదర్చుకుంది.
- టెక్నాలజీ రంగంలో ఎంట్రప్రెన్యూర్లకు వ్యూహాత్మక సహకారానికిగాను గూగుల్‌తోనూ సీఐఐఈ జట్టుకట్టింది.
 
తొలినాళ్లలో మాదీ స్టార్టప్ సర్కారే...
ప్రపంచంలో ఇప్పుడున్న మెగా కార్పొరేట్ సంస్థలన్నీ గతంలో స్టార్టప్‌లుగానే ప్రస్థానాన్ని ఆరంభించాయని మోదీ వ్యాఖ్యానించారు. ఆమాటకొస్తే, కేంద్రంలో అధికారాన్ని సాధించే సమయానికి తమది కూడా స్టార్టప్ ప్రభుత్వమేనని... అనేక ఎత్తుపల్లాలను, ఇక్కట్లను ఎదుర్కొని నిలదొక్కుకున్నామని చెప్పారు. అయితే, ఇప్పుడున్న డిజిటల్ యుగంలో గతంతో పోలిస్తే స్టార్టప్‌లకు అద్భుతమైన అవకాశాలు, తగిన సానుకూల పరిస్థితులు నెలకొన్నాయని మోదీ పేర్కొన్నారు.

స్టార్టప్‌లకు కూడా కొన్ని సవాళ్లు ఉన్నప్పటికీ.. ఏదైనా కొత్త విషయాన్ని కనిపెట్టామనే గొప్ప అనుభూతి ఇక్కడ వాటిని ముందుకునడిపిస్తుందని ప్రధాని వ్యాఖ్యానించారు. ‘దేశాల ప్రగతి పథంలో స్టార్టప్‌లు ఇంజిన్లుగానే పనిచేస్తాయి. ఇప్పుడున్న ప్రపంచంలో అన్నిరకాల వనరులను ఉపయోగించుకొని ఎదిగే సంస్థలకంటే ఐడియాలను ఆచరణలో పెట్టిన సంస్థలే దూసుకెళ్లగలుగుతున్నాయి. వినియోగదారులే ఇప్పుడు అప్లికేషన్ల సృష్టికి మూలకేంద్రంగా నిలుస్తున్నారు కూడా. అంటే ఒకరి మదిలో మెదిలిన ఆలోచన... ఒక్క ఏడాదిలో ప్రపంచం మొత్తానికి తెలిసిపోతుంది’ అని మోదీ వివరించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement