
స్పైస్‌జెట్ ఫ్లీట్‌లో రెండో ఎయిర్‌బస్
34 శాతం తనఖా పెట్టిన ప్రమోటర్
న్యూఢిల్లీ: చౌక ధరల విమానయాన సంస్థ స్పైస్‌జెట్, మరో ఎయిర్‌బస్ విమానాన్ని డెలివరీ తీసుకుంది. ఈ విషయాన్ని కంపెనీ చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్(సీఓఓ) సంజీవ్ కపూర్ ట్వీట్ చేశారు. ఈ కంపెనీ మొదటి ఎయిర్‌బస్ విమానాన్ని గత నెలలోనే కార్యకలాపాలకు వినియోగించడం ప్రారంభించింది. ఈ రెండు విమానాలను వెట్ లీజ్(విమానంతో పాటు క్యాబిన్, విమాన సిబ్బందిని కూడా విమానాన్ని లీజుకిచ్చే సంస్థే సమకూరుస్తుంది) పద్ధతిన లీజుకు తీసుకున్నామని, మూడు నెలల పాటు మెట్రో రూట్లలో వినియోగిస్తామని సంజీవ్ కపూర్ పేర్కొన్నారు. ఈ విమానాలను అహ్మదాబాద్, ముంబై, ఢిల్లీ, కోల్‌కత, గౌహతి రూట్లలో నడుపుతున్నామని వివరించారు. కాగా కంపెనీ ప్రమోటర్ అజయ్ సింగ్ తన వాటాలో సగానికిపైగా షేర్లను తనఖా పెట్టారు. కంపెనీలో 60 శాతంగా ఉన్న తన వాటాలో 34 శాతం వాటాను ఆయన తనఖా పెట్టారని సమాచారం. ఇది మొత్తం కంపెనీ వాటాలో ఐదవ వంతుకు సమానం.