ఆధ్యాత్మిక బాటలో ‘ఫోర్టిస్’ శివిందర్ సింగ్
న్యూఢిల్లీ: ఫోర్టిస్ హెల్త్‌కేర్ సహ వ్యవస్థాపకుడు, ఎగ్జిక్యూటివ్ వైస్ చైర్మన్ శివిందర్ మోహన్ సింగ్ (40) తన పదవి నుంచి వైదొలగనున్నారు. ఆధ్యాత్మిక సంస్థ రాధా స్వామి సత్సంగ్ బియాస్‌లో చేరేందుకే ఆయన ఈ నిర్ణయం తీసుకున్నారు. వచ్చే ఏడాది జనవరి 1 నుంచి ఆయన కంపెనీ నాన్ ఎగ్జిక్యూటివ్ వైస్ చైర్మన్‌గా మాత్రమే ఉంటారని సంస్థ పేర్కొంది. దాదాపు రెండు దశాబ్దాల పాటు కంపెనీ ఏర్పాటు, నిర్వహణలో కీలక పాత్ర పోషించానని, ఇకపై సమాజ సేవలో ప్రత్యక్షంగా పాల్గొనాలనే ఉద్దేశంతోనే ఈ నిర్ణయం తీసుకున్నానని సింగ్ తెలిపారు. పెద్దన్న మాల్విందర్ సింగ్‌తో కలిసి శివిందర్.. 1990లలో ఫోర్టిస్ హెల్త్‌కేర్‌ను ఏర్పాటు చేశారు. 2008లో ఫార్మా దిగ్గజం ర్యాన్‌బాక్సీలో తమ వాటాలను దైచీ శాంక్యోకి సోదరులిద్దరూ విక్రయించారు. అమెరికాలోని డ్యూక్ యూనివర్సిటీ బిజినెస్ స్కూల్ నుంచి శివిందర్ ఎంబీయే చేశారు. ఫోర్టిస్ హెల్త్‌కేర్ చెయిన్‌కి భారత్ సహా దుబాయ్, మారిషస్, శ్రీలంకలో పలు ఆస్పత్రులు, డయాగ్నోస్టిక్ సెంటర్లు ఉన్నాయి.