తీపి పదార్థాలు అంటే చాలా మంది చెవి కోసుకుంటారనేది సామెత. నిజంగా చెవి కోసుకోవడం ఏమోగానీ.. ముందు పెడితే చాలు జామ్మంటూ లాగించేస్తుంటారు. అందులోనూ మైసూర్ పాక్ అనగానే నోట్లో నీళ్లూరడం ఖాయం. అలా దేశవిదేశాల్లో ఆహార ప్రియుల నోరూరిస్తున్న మైసూర్ పాక్.. ఇప్పుడు ప్రపంచంలో ఎక్కువమంది ఇష్టపడే స్ట్రీట్ ఫుడ్ స్వీట్లలో 14వ స్థానంలో నిలిచింది. – మైసూర్
టాప్–50 స్వీట్లపై సర్వేలో..
ప్రఖ్యాత ఫుడ్ మ్యాగజైన్ ‘టేస్ట్ అట్లాస్’ ఇటీవల ఆన్‌లైన్‌లో వివిధ ఆహార పదార్థాలపై సర్వే చేసింది. ప్రపంచవ్యాప్తంగా వివిధ దేశాల్లో వీధుల్లో అమ్మే మిఠాయిల్లో ప్రజాదరణ పొందినవి ఏవి అన్న అంశంపై ఓటింగ్ నిర్వహించింది. అందులో మైసూర్‌పాక్ 14వ స్థానంలో నిలవడం గమనార్హం. అంతేకాదు.. దీనికి స్వీట్ ప్రియుల నుంచి ఏకంగా 4.4 రేటింగ్ వచ్చింది. ఇక ఈ జాబితాలో అమెరికాకు చెందిన డోనట్స్ టాప్ ప్లేస్.. మన దేశానికే చెందిన కుల్ఫీ 24వ స్థానంలో, గులాబ్‌జమూన్ 26వ స్థానం సంపాదించాయి.
రాజు కోసం వండిన మిఠాయి
మైసూర్ పాక్ గురించి ఎన్నో కథలు, కథనాలు ప్రచారంలో ఉన్నాయి. అందులో ముఖ్యమైనది మైసూర్ రాజు అంతఃపురం వంటశాలలో మైసూర్ పాక్ పుట్టిందనే కథ. సుమారు 90 ఏళ్ల కింద మైసూర్ రాజు ఒడయార్ అంతఃపురంలో ముఖ్యమైన వంటగాడిగా మాదప్ప ఉండేవారు. అప్పటి రాజు కృష్ణరాజ ఒడయార్ భోజనం చేస్తున్న సమయంలో.. అక్కడ ఎలాంటి మిఠాయి లేదని మాదప్ప గుర్తించాడు. వెంటనే చక్కెర, నెయ్యి, శనగపిండి మిశ్రమంతో ఓ పాకం వంటి వంటకాన్ని తయారు చేశాడు. రాజు భోజనం చివరికి వచ్చేసరికి పాకం చల్లారి మెత్తటి ముద్దగా మారింది.
మాదప్ప దాన్ని ముక్కలుగా కోసి వడ్డించగా.. రాజు తిని చూసి చాలా బాగుందని మెచ్చుకున్నారు. ఇదేం మిఠాయి అని రాజు అడిగితే.. మైసూర్ పాకం అని మాదప్ప బదులిచ్చారు. అదే కాస్త మార్పులతో మైసూర్ పాక్‌గా మారింది. అంతఃపురం నుంచి అంగళ్లకు, ఇళ్లకు చేరింది. ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా మైసూర్ పాక్‌ను తయారు చేసి అమ్ముతున్నా.. మన దేశంలో చేసినంత బాగా మరెక్కడా రుచిగా రాదని మిఠాయి ప్రియులు చెప్తుంటారు.
Comments
Please login to add a commentAdd a comment