న్యూఢిల్లీ: వ్యక్తిగత ఆదాయపు పన్నుల విధానాన్ని మరింత సరళతరం చేయాల్సిన అవసరం ఉందని కేంద్ర ఆర్థిక శాఖ మాజీ కార్యదర్శి ఎస్‌సీ గర్గ్ అభిప్రాయపడ్డారు. సెస్సులు, సర్‌చార్జీలు లేకుండా దీన్ని నాలుగు రేట్లకు పరిమితం చేయొచ్చని ఆయన పేర్కొన్నారు. కార్పొరేట్ ట్యాక్స్ విధానాన్ని ఇప్పటికే సముచిత స్థాయిలో హేతుబద్ధీకరించినందున.. ఇక ఆ విషయంలో తదుపరి చర్యలేమీ ఆశించడానికి లేదని గర్గ్ చెప్పారు. అయితే, వ్యక్తిగత ఆదాయపు పన్నుల విషయంలో కొన్ని కీలకమైన సంస్కరణలు చేయాల్సిన అవసరం ఉందని తెలిపారు. ప్రస్తుతం ఆదాయపు పన్నుకు సంబంధించి ఎనిమిది శ్లాబ్‌లు ఉన్నాయి. గరిష్టంగా 40% రేటు ఉంటోంది. రూ. 5 లక్షలకు లోపు ఆదాయం ఉన్న వారికి ఎలాంటి పన్ను విధించరాదని గర్గ్ ప్రతిపాదించారు. రూ. 5–10 లక్షల మధ్య ఆదాయ వర్గాలపై 5 శాతం, రూ. 10–25 లక్షల ఆదాయాలపై 15 శాతం, రూ. 25–50 లక్షలపై 25 శాతం, రూ. 50 లక్షల పైబడిన ఆదాయంపై 35% రేటు విధిస్తే సముచితంగా ఉండగలదని ఆయన పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment