
ఈ ఏడాదే వడ్డీ రేట్ల పెంపు...
అమెరికా ఫెడ్ రిజర్వ్ - అనిశ్చితి టాప్ లిస్ట్‌లో చైనా, గ్రీస్‌లు ఉన్నట్లు వ్యాఖ్య
వాషింగ్టన్: ఆర్థిక వ్యవస్థ అనుకున్న ఫలితాలను సాధిస్తే... ఈ ఏడాది చివరికల్లా వడ్డీరేటు పెంపు ఖాయమని అమెరికా ఫెడరల్ రిజర్వ్ చీఫ్ జన్నెత్ ఎలెన్ బుధవారం స్పష్టం చేశారు. పరపతి విధాన పరిస్థితిని తెలియజేయడానికి ఆమె హౌస్ ఫైనాన్షియల్ సర్వీస్ కమిటీ ముందు హాజరయ్యారు. రేటు పెంపు ఖచ్చితంగా ఎప్పుడు? ఎంత? అన్నది మాత్రం చెప్పలేమని అన్నారు. ప్రస్తుతం ఫెడ్ వడ్డీరేటు 0.25 శాతంగా ఉంది.
అమెరికా ఆర్థిక వ్యవస్థ పురోగతిలో ఉందని అన్నారు. కాగా ఉద్యోగాల మార్కెట్ తగిన విధంగా ఇంకా మెరుగుపడలేదన్నారు. అయితే ఇందుకు సంబంధించి నిరుద్యోగిత రేటు మాత్రం క్రమంగా తగ్గుతోందని వివరించారు. దేశంలో ద్రవ్యోల్బణం ఫెడ్ లక్ష్యాల కన్నా తక్కువగా ఉందని అన్నారు. గ్రీస్, చైనాలు ఆర్థిక అనిశ్చితికి సంబంధించి జాబితాలో టాప్‌లో ఉన్నాయని వ్యాఖ్యానించడం విశేషం. వినియోగదారుల వ్యయం క్రమంగా పెరుగుతోందని, ఇది వేగవంతమైన రికవరీకి దారితీసే అవకాశం ఉందని అన్నారు.
కమిటీ కఠిన వైఖరి..: కాగా నివేదికను వివరించడానికి ముందు ఎలెన్ కమిటీ చైర్మన్ జెబ్ హెన్సార్‌లింగ్ నుంచి కొంత కఠిన పరిస్థితిని ఎదుర్కొనాల్సి వచ్చింది. పలు కీలక డాక్యుమెంట్ల కోసం కమిటీ విజ్ఞప్తిని సైతం ఫెడ్ పట్టించుకోవడం లేదని అన్నారు. తనది సొంత వ్యవహారం అన్నట్లు ఫెడ్ వ్యవహరిస్తోందంటూ... చట్టానికి ఫెడ్ అతీతం కాదని అన్నారు. ఆర్థికాంశాలకు సంబంధించి హౌస్ ఇన్వెస్టిగేషన్‌కు ఫెడ్ సహకరించాలని సూచించారు. లేదంటే హౌస్ ప్యానల్ గౌరవ ప్రతిష్టలు, విశ్వసనీయతలకు విఘాతం కలిగించినట్లవుతుందని అన్నారు.