ముంబై: ప్రజలను ఆర్థికంగా చైతన్యవంతులను చేసేందుకు.. ఆర్థిక విద్యను ప్రోత్సహించేందుకు ఐదు ప్రధాన అంశాలతో కూడిన కార్యాచరణ ప్రణాళికతో ఆర్‌బీఐ ముందుకు వచ్చింది. ‘నేషనల్ స్ట్రాటజీ ఫర్ ఫైనాన్షియల్ ఎడ్యుకేషన్ 2020– 2025’ (ఎన్‌ఎస్‌ఎఫ్‌ఈ) పేరుతో ఆర్‌బీఐ గురువారం డాక్యుమెంట్‌ను విడుదల చేసింది. దేశ ప్రజ ల్లో ఆర్థిక అవగాహన కల్పించేందుకు, సాధికార భారత్ కోసం ప్రభుత్వరంగ సంస్థలు, ఇతర సంస్థలు వేటికవే విడిగా కాకుండా, కలసికట్టుగా (బహుళ భాగస్వాములతో) పనిచేసే విధానం అవసరమని సూచించింది.
తన కార్యాచరణ ప్రణాళికలో పేర్కొన్న ఐదు ప్రధాన అంశాలు.. కంటెంట్ (విషయాలు), కెపాసిటీ (సామర్థ్యం), కమ్యూనిటీ (సంఘం), కమ్యూనికేషన్ (సమాచారం), కొలాబరేషన్ (సహకారం)ను ప్రధానంగా ఆర్బీఐ ప్రస్తావించింది. దేశంలో అందరికీ ఆర్థిక సేవలను చేరువ చేయడం అన్నది కేంద్ర ప్రభుత్వంతోపాటు, ఆర్థిక నియంత్రణ సంస్థలు ఆర్‌బీఐ, సెబీ, ఐఆర్డీఏఐ, పీఎఫ్‌ఆర్డీఏ ప్రధాన ఎజెండాగా ఉన్న విషయం గమనార్హం. ‘‘ఆర్థిక అక్షర జ్ఞానం ఆర్థిక సేవల విస్తృతికి తోడ్పడుతుంది. అదే విధంగా కస్టమర్లు అవగాహనతో కూడిన నిర్ణయం తీసుకునేందుకు వీలు కల్పిస్తుంది. ఆర్థిక శ్రేయస్సుకు తోడ్పడుతుంది’’ అంటూ ఆర్‌బీఐ ఎన్‌ఎస్‌ఎఫ్‌ఈ నివేదిక వివరించింది.
ఎన్‌ఎస్‌ఎఫ్‌ఈలో పేర్కొన్న అంశాలు
► వివిధ వర్గాల ప్రజల్లో (విద్యార్థులు, టీచర్లు, యువత, మహిళలు, ఉద్యోగాల్లో కొత్తగా చేరే వారు, ఔత్సాహిక పారిశ్రామికవేత్తలు, వృద్ధు లు, వికలాంగులు తదితర) ఆర్థిక అంశాల పట్ల అవగాహనకు ప్రత్యేకంగా పాఠాలు బోధించాలి.
► ఆర్థిక లక్ష్యాలకు వనరులను సమకూర్చుకునేందుకు వీలుగా ఫైనాన్షియల్ మార్కెట్లలో పాల్గొనేలా చేయాలి. పొదుపును ప్రోత్సహించాలి.
► రుణాలకు సంబంధించి క్రమశిక్షణను అభివృద్ధి చేయాలి. నియంత్రణ సంస్థల నుంచి అనుమతులు ఉన్న సంస్థల ద్వారానే రుణాలు తీసుకునేలా ప్రోత్సహించాలి.
► డిజిటల్ ఆర్థిక సేవలను మరింత భద్రమైన, సురక్షితంగా వాడుకునేలా మెరుగుపరచాలి.
► జీవితంలోని వివిధ దశల్లో వచ్చే సమస్యలను ఎదుర్కొనేందుకు వీలుగా (రిస్క్ మేనేజ్‌మెంట్) తగినంత బీమా కవరేజీ, వృద్ధాప్య జీవనం కోసం
అనుకూలమైన పెన్షన్ ఉత్తులను తీసుకునే ప్రణాళిక అవసరాన్ని తెలియజేయాలి.
► స్కూల్ పాఠ్యాంశాల్లో ఆర్థిక విద్యను భాగం చేయాలి. ఇందుకు సంబంధించి 9, 10వ తరగతుల్లో కంటెంట్‌ను మెరుగుపరచాలి. బీఈడీ, ఎంఈడీ కోర్సుల్లో సమగ్ర ఆర్థిక విద్యను భాగం చేయాల్సిన అవసరం ఉంది. టీచర్లకు సైతం ఆర్థిక విషయాలపై శిక్షణ ఇవ్వాలి.
► ఆర్‌బీఐకి చెందిన నేషనల్ సెంటర్ ఫర్ ఫైనాన్షియల్ ఎడ్యుకేషన్ (ఎన్‌సీఎఫ్‌ఈ) సంస్థ ఎన్‌ఎస్‌ఎఫ్‌ఈ 2020–25ని రూపొందించింది.
► ప్రభుత్వ లక్ష్యాలకు మద్దతు..: ‘‘ఎన్‌ఎస్‌ఎఫ్‌ఈ డాక్యుమెంట్ ఉద్దేశం.. భారత ప్రభుత్వం, నియంత్రణ సంస్థల లక్ష్యానికి మద్దతునివ్వడమే. వివిధ వర్గాల్లోని ప్రజల్లో తగినంత విజ్ఞానాన్ని, నైపుణ్యాలను అభివృద్ధి చేయడంతోపాటు వారిలో ప్రవర్తనపరమైన మార్పులు తీసుకురావడం వల్ల.. తమ ద్రవ్యపరమైన అంశాలను మరింత మెరుగ్గా నిర్వహించుకోవడంతోపాటు, భవిష్యత్తుకు ప్రణాళిక రూపొందించుకోగలరు’’అని ఆర్‌బీఐ పేర్కొంది.
Comments
Please login to add a commentAdd a comment