మార్కెట్ పంచాంగం
భారత్ మార్కెట్‌పై విదేశీ ఇన్వెస్టర్ల ఆసక్తి తగ్గిందన్న సంకేతాల్ని నేషనల్ స్టాక్ ఎక్స్ఛేంజ్ (ఎన్‌ఎస్‌ఈ) డెరివేటివ్స్ డేటా వెల్లడిస్తున్నది. చాలా నెలల తర్వాత మే నెల ఫ్యూచర్స్ అండ్ ఆప్షన్స్ సిరీస్‌కు రోలోవర్స్ పరిమితంగా జరిగాయి. ఈ విభాగంలో చురుగ్గా వ్యవహరించే విదేశీ ఇన్వెస్టర్లు వారి పొజిషన్లను తగ్గించుకోవడమే ఇందుకు కారణం. అయితే వారు లాంగ్ పొజిషన్లతో (పెరుగుతాయనే అంచనాలతో తీసుకునేవి) పాటు షార్ట్ పొజిషన్లను (తగ్గుతాయన్న అంచనాలతో తీసుకునేవి) కూడా తగ్గించుకున్నట్లు ఆ డేటా ద్వారా వెల్లడవుతోంది.
కానీ ఇప్పటికే వారు భారత్ మార్కెట్లో భారీగా నగదు పెట్టుబడులు చేసివున్నందున, త్వరలో డెరివేటివ్స్ విభాగంలో కూడా వారు పొజిషన్లను పెంచుకోకతప్పదు. విదేశీ ఇన్వెస్టర్లు రాబోయే కొద్దిరోజుల్లో తీసుకోబోయే పొజిషన్లకు అనుగుణంగా మార్కెట్ భారీగా పెరగవచ్చు. లేదా తీవ్రంగా పతనం కావొచ్చు. ఇక సాంకేతికాంశాలకొస్తే...
సెన్సెక్స్ సాంకేతికాంశాలు...
ఏప్రిల్ 30తో ముగిసిన నాలుగురోజుల ట్రేడింగ్ వారంలో గత మార్కెట్ పంచాంగంలో అంచనాలకు అనుగుణంగా బీఎస్‌ఈ సెన్సెక్స్ 26,897 పాయింట్ల కనిష్టస్థాయివరకూ పడిపోయింది. చివరకు అంతక్రితంవారంతో పోలిస్తే 427పాయింట్ల నష్టంతో 27,011 పాయింట్ల వద్ద ముగిసింది. గత శుక్రవారం అమెరికా మార్కెట్ పెరిగిన కారణంగా ఈ వారం గ్యాప్‌అప్‌తో ఇక్కడి మార్కెట్ మొదలైతే 27,345 పాయింట్ల నిరోధస్థాయిని చేరవచ్చు. అటుపైన స్థిరపడితే 27,570 పాయింట్ల స్థాయికి చేరవచ్చు. ఈ వారం సెన్సెక్స్‌కు 27,345-27,570 పాయింట్ల నిరోధశ్రేణి కీలకం. ఈ శ్రేణిని బలంగా ఛేదిస్తే వేగంగా 27,830 స్థాయికి పెరగవచ్చు. సెన్సెక్స్ తిరిగి అప్‌ట్రెండ్‌లోకి ప్రవేశించాలంటే 28,090 పాయింట్ల స్థాయిని అధిగమించాల్సివుంటుంది. ఈ వారం తొలి నిరోధశ్రేణిని దాటలేకపోతే మరోదఫా 26,880 స్థాయికి తగ్గవచ్చు. ఆ లోపున క్రమంగా 26,470 పాయింట్ల స్థాయిని పరీక్షించవచ్చు.
నిఫ్టీ నిరోధ శ్రేణి 8,270-8,335
ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ గత శుక్రవారం 8,145 పాయింట్ల కనిష్టస్థాయికి తగ్గిన తర్వాత, చివరకు 123 పాయింట్ల నష్టంతో 8,182 పాయింట్ల వద్ద ముగిసింది. ఈ వారం నిఫ్టీ గ్యాప్‌అప్‌తో ప్రారంభమైతే తొలుత 8,270 పాయింట్ల స్థాయికి చేరవచ్చు. ఆపైన ముగిస్తే క్రమేపీ 8,335 పాయింట్ల వద్దకు పెరగవచ్చు. ఈ రెండు స్థాయిలూ...అంటే...8,270-8,335 పాయింట్ల శ్రేణి నిఫ్టీకి ముఖ్యమైన అవరోధం. ఈ వారం ఈ శ్రేణిని అధిక ట్రేడింగ్ పరిమాణంతో దాటితే 8,420 పాయింట్ల వద్దకు పెరగవచ్చు. ఆపైన స్థిరపడితే 8,505 పాయింట్ల స్థాయిని అందుకోవొచ్చు. ఈ వారం తొలి అవరోధాన్ని అధిగమించలేకపోతే మరోదఫా 8,145 పాయింట్ల వద్దకు తగ్గవచ్చు. ఆ లోపున 8,080 స్థాయికి క్షీణించవచ్చు. ఈ లోపున ముగిస్తే 7,960 పాయింట్ల స్థాయికి తగ్గవచ్చు.
సెన్సెక్స్ నిరోధ శ్రేణి 27,345-27,570 పాయింట్లు
Published Mon, May 4 2015 12:29 AM | Last Updated on Sun, Sep 3 2017 1:21 AM
Advertisement
Advertisement