దావోస్: పెట్టుబడులకు అత్యంత ఆకర్షణీయమైన మార్కెట్ల జాబితాలో భారత్ 5వ ర్యాంకు దక్కించుకుంది. గత ఏడాదితో పోలిస్తే ఒక స్థానం ఎగబాకింది. అంతర్జాతీయ సంస్థల సీఈవోలతో కన్సల్టెన్సీ దిగ్గజం ‘పీడబ్ల్యూసీ’ నిర్వహించిన ఒక సర్వేలో ఈ విషయం వెల్లడయింది. వరల్డ్ ఎకనమిక్ ఫోరం సదస్సు సందర్భంగా విడుదల చేసిన ఈ నివేదిక ప్రకారం... 2018లో అత్యంత ఆకర్షణీయ మార్కెట్‌గా జపాన్‌ను అధిగమించి భారత్ అయిదో స్థానానికి చేరింది. 2017లో భారత్ ఆరో స్థానంలో ఉంది.
మరోవైపు, ఈ లిస్టులో అమెరికా అగ్రస్థానంలో నిలిచింది. 46 శాతం మంది సీఈవోలు అమెరికాకు ఓటేశారు. చైనా (33 శాతం), జర్మనీ (20 శాతం) వరుసగా రెండు, మూడు స్థానాల్లో ఉన్నాయి. 15 శాతం ఓట్లతో బ్రిటన్ నాలుగో స్థానంలో, తొమ్మిది శాతం ఓట్లతో భారత్ అయిదో స్థానంలో నిలిచాయి. పటిష్ఠమైన వ్యవస్థాగతమైన సంస్కరణల ఊతంతో భారత మార్కెట్ గత ఏడాది కాలంగా ఆకర్షణీయంగా మారిందని పీడబ్ల్యూసీ ఇండియా చైర్మన్ శ్యామల్ ముఖర్జీ పేర్కొన్నారు.
‘మా క్లయింట్లలో చాలా మంది.. భారతదేశ వృద్ధిపై ఆశావహంగా ఉన్నారు. సైబర్ సెక్యూరిటీ, వాతావరణ మార్పులు మొదలైన కొంగొత్త సవాళ్లు క్లయింట్లను కలవరపరుస్తున్నప్పటికీ... ఇన్‌ఫ్రా, తయారీ, నైపుణ్యాల్లో శిక్షణ తదితర అంశాల్లో వారి ఆందోళనలను తొలగించేందుకు ప్రభుత్వం గణనీయంగా కృషి చేసింది‘ అని ఆయన తెలిపారు.
అనిశ్చితిపై సీఈవోల ఆందోళన..
పీడబ్ల్యూసీ నివేదిక ప్రకారం.. సీఈవోలు వృద్ధిపై ఆశావహంగానే ఉన్నప్పటికీ వ్యాపారం, సామాజిక, ఆర్థికపరమైన పలు సమస్యలపై కాస్తంత ఆందోళనతోనే ఉన్నారు. భౌగోళిక, రాజకీయపరమైన అనిశ్చితి, సైబర్ దాడులు మొదలైన సమస్యల గురించి 40 శాతం మంది, ఉగ్రవాదంపై 41 శాతం మంది సీఈవోలు అత్యంత ఆందోళన వ్యక్తపరిచారు.
Comments
Please login to add a commentAdd a comment