అమ్మో! అప్పుడేనా!! | India Inc welcomes GST Bill with a few concerns | Sakshi
Sakshi News home page

అమ్మో! అప్పుడేనా!!

Published Thu, Aug 4 2016 6:43 AM | Last Updated on Mon, Sep 4 2017 7:40 AM

అమ్మో! అప్పుడేనా!!

అమ్మో! అప్పుడేనా!!

జీఎస్‌టీ అమలుకు సిద్ధంగా లేని కంపెనీలు
దాదాపు 20 శాతమే రెడీ అంటున్న నిపుణులు 
పన్నుల అమలుకు భారీ ఐటీ వ్యవస్థ కావాలి
చిన్న కంపెనీల్లో ఆందోళనలు కూడా తొలగాలి 
వచ్చే ఏప్రిల్ నుంచి అమలు కష్టమనే వ్యాఖ్యలు
2017 జూలై లేదా అక్టోబర్ నుంచి అమలు!! 
పూర్తి అమలుకు మరో రెండేళ్లు పట్టే అవకాశం

రెండు లక్షల కోట్ల డాలర్ల ఆర్థిక వ్యవస్థ దాదాపు 130 కోట్ల మంది జనాభా 29 రాష్ట్రాలు... 7 కేంద్రపాలిత ప్రాంతాలు  అధికారికంగా గుర్తించిన 22 భాషలు...

తొలిసారిగా దీన్నంతటినీ కలిపే ఏకైక మార్కెట్ వ్యవస్థ అందుబాటులోకి రానుంది. ఏ ప్రాంతమైనా, ఏ రాష్ట్రమైనా అన్నిచోట్లా ఒక వస్తువుకు ఒకే పన్నును ప్రతిపాదిస్తున్న ‘గూడ్స్ అండ్ సర్వీసెస్ ట్యాక్స్’ బిల్లును సుదీర్ఘ రాజకీయ వ్యూహాల అనంతరం బుధవారం రాత్రి రాజ్యసభ కొన్ని సవరణలతో ఆమోదించింది. ఇంకా సమయం పడుతుందిలే... అని కాస్త పట్టనట్లుగా ఉన్న కంపెనీలు దీన్ని అమలు చేయడానికి సిద్ధంగా ఉన్నాయా? ‘‘అసలు పని ఇప్పుడే మొదలైంది’’ అన్న రెవెన్యూ కార్యదర్శి శక్తికాంతదాస్ మాటల్ని చూస్తే కంపెనీలు సిద్ధంగా లేవనే అనిపిస్తుంది. ఎందుకంటే కేంద్రం, రాష్ట్రం వేరువేరుగా విధించే సెంట్రల్ జీఎస్‌టీ, స్టేట్ జీఎస్‌టీలను ఒకేసారి ఉత్పత్తులపై విధించడానికి, ప్రభుత్వం చెబుతున్నట్లు అన్నిటినీ ఆన్‌లైన్లోకి తేవటానికి భారీ ఐటీ వ్యవస్థ కావాలి.

పన్ను వసూలుదార్లకు శిక్షణా ఇవ్వాలి. మొదట చిన్న కంపెనీలకు దీనిపై ఉన్న ఆందోళనలు పోవాలి. వస్తువును బట్టి పన్ను రేట్లు ఉంటాయి కనక తాము పెద్ద కంపెనీలతో పోటీ పడలేమన్న వాటి భయాలకు తగిన భరోసా కావాలి. నిజానికి జీఎస్‌టీని అమలు చేసిన పలు దేశాలు... దాని ఫలితాలు అందుకునే ముందు ఆర్థిక మందగమనాన్ని అనుభవించినవే. ‘‘భారత వృద్ధి రేటు మార్చి త్రైమాసికంలో 7.9 శాతంగా ఉంది. జీఎస్‌టీ అమలుతో వచ్చే మూడు నుంచి ఐదేళ్లలో 0.8 శాతం పెరిగే అవకాశం ఉంది’’ అని హెచ్‌ఎస్‌బీసీ ఆర్థికవేత్త ఒకరు అభిప్రాయపడ్డారు.

 20 శాతం కంపెనీలే సిద్ధం?
పన్ను నిపుణుల అంచనాల ప్రకారం ప్రస్తుతం 20 శాతం కంపెనీలే జీఎస్‌టీ అమలుకు సిద్ధంగా ఉన్నాయి. తరచూ మారే పన్నులకు అలవాటు పడిన మిగతా కంపెనీలు ఇంకా దీనిగురించి ఆలోచించటంలేదు. మెజారిటీ రాష్ట్రాలు దీన్ని ఆమోదించిన తరవాత జీఎస్‌టీ మండలి అమల్లోకి వస్తుంది కనక... ఎప్పటి నుంచి దీన్ని అమలు చేయాలన్నది అదే నిర్ణయిస్తుంది కనక తమకింకా కొంత సమయం ఉందన్నది వాటి ఉద్దేశం. అయితే ఇదంతా జరగటానికి నవంబర్ వరకూ సమయం పట్టొచ్చు. పార్లమెంటు శీతాకాల సమావేశాల్లో... వాస్తవంగా అమలుకాబోయే జీఎస్‌టీ బిల్లు రావచ్చు.

‘‘వచ్చే ఏడాది ఏప్రిల్ నుంచి దీన్ని అమల్లోకి తేవాలని ప్రభుత్వం యోచిస్తోంది. అది కాస్త కష్టమే కావచ్చు. బహుశా!! వచ్చే ఏడాది జూలై లేదా అక్టోబర్ నుంచి అమలయ్యే అవకాశాలైతే ఉన్నాయి’’ అనేది నిపుణుల మాట. అయితే దీన్ని ఎప్పటి నుంచి అమలు చేసినా... పూర్తి స్థాయిలో దేశం మొత్తం దీన్ని అర్థం చేసుకుని అమల్లోకి తేవటానికి, దాని ఫలితాలు అందటానికి రెండేళ్లు పడు తుందని మరికొందరు అభిప్రాయపడుతున్నారు.

ఆందోళనలో ఐటీ పరిశ్రమ..: నాస్కాం
జీఎస్‌టీ బిల్లును ఆహ్వానిస్తున్నట్టు నాస్కాం తెలిపింది. అయితే సర్వీసు, ఐటీ రంగం ఆందోళన చెందుతోదని, ఈ విషయాన్ని ప్రభుత్వానికి తెలిపామని నాస్కాం ప్రెసిడెంట్ ఆర్. చంద్రశేఖర్ అన్నారు. ‘ప్రస్తుతం ఐటీ రంగానికి ఉన్న పన్నుల విధానం సులభంగా ఉంది. సెంట్రల్ సర్వీస్ ట్యాక్స్, సింగిల్ పాయింట్ రిజిస్ట్రేషన్, ఒకే ఇన్వాయిస్. అలాగే రిఫండ్‌కు ఒకేచోటకు వెళితే చాలు. అదే జీఎస్‌టీ విధానంలో సెంట్రల్ జీఎస్‌టీ, ఇంటర్‌స్టేట్ జీఎస్‌టీ, స్టేట్ జీఎస్‌టీ వంటివి ఉంటాయి.  ఈ పరిణామం పరిశ్రమకు సవాల్‌గా నిలుస్తుంది. ఐటీ సేవల రంగానికి జీఎస్‌టీ కాలరాత్రిగా ఉండరాదు’ అని అన్నారు. సెంట్రల్ జీఎస్‌టీ, ఇంటర్‌స్టేట్ జీఎస్‌టీని ఒకే పన్ను కిందకు తీసుకు రావాలని ప్రభుత్వాన్ని కోరినట్టు చెప్పారు.

కీలకమైన చట్టానికి ప్రతిపక్షం అందించిన సహకారంతో దేశంలో సంస్కరణల ప్రగతిపై పరిశ్రమ రంగానికి ఎన్నో ఆశలు చిగురించాయి.
- హర్షవర్దన్ నియోతియా, ఫిక్కి ప్రెసిడెంట్

 వేగంగా అమలుపైనే విజయం..
ఆటోమొబైల్ పరిశ్రమ హృదయపూర్వకంగా స్వాగతిస్తోంది. పన్నుల వ్యవస్థను విస్తృతం చేస్తుంది. వ్యవస్థ అంతటా సమర్థతను పెంచుతుంది. మార్కెట్‌ను ఏకం చేస్తుంది. విజయం సాధించడంలో వేగంగా అమలు అన్నది కీలకం అవుతుంది.
- కెనిచి అయుకువ, ఎండీ, మారుతి సుజుకి ఇండియా

పెట్టుబడులు వస్తాయి..: సెల్‌కాన్
‘‘టెలికం ఉత్పత్తులకు దేశవ్యాప్తంగా 5 శాతం మాత్రమే పన్ను ఉంచాలని ఇండియన్ సెల్యులార్ అసోసియేషన్ తరఫున కేంద్ర ప్రభుత్వాన్ని కోరాం. ప్రధానంగా మేక్ ఇన్ ఇండియా ఉత్పత్తులకు దీనిని వర్తింపజేయాలి. మేక్ ఇన్ ఇండియా కాని పక్షంలో ఎక్కువ పన్ను వసూలు చేయాలి. ఇక జీఎస్‌టీ అమలైతే రవాణాతో ముడి పడిన వ్యయాలు తగ్గుతాయి. పన్ను సమస్యలుండవు. ఈ రంగంలోకి విదేశీ పెట్టుబడులు పెరిగేందుకు అవకాశం ఏర్పడుతుంది’’  - సెల్‌కాన్ మొబైల్స్ సీఎండీ వై.గురు

వినియోగదారులకే లాభం
ఉత్పత్తులు, సేవల ధరలు తగ్గుతాయి
‘సాక్షి’తో ఫ్యాప్సీ ప్రెసిడెంట్ రవీంద్ర మోడీ

జీఎస్‌టీ అమలు కోసం కంపెనీలు, వర్తకులు ఎన్నాళ్ల నుంచో ఎదురు చూస్తున్నారని ఫ్యాప్సీ తెలిపింది. పన్నుల విషయంలో స్వాతంత్రం అనంతరం జరిగిన అతిపెద్ద సంస్కరణగా జీఎస్‌టీని అభివర్ణించింది. ప్రస్తుతం పన్నులు సగటున 25-30 శాతం ఉన్నాయని, జీఎస్‌టీతో ఇది 17-18 శాతానికి దిగొస్తుందని ఫ్యాప్సీ ప్రెసిడెంట్ రవీంద్ర మోడీ చెప్పారు. ఆయనింకా ఏమన్నారంటే..

 ‘‘పన్ను సంస్కరణలు చేపట్టింది కస్టమర్ల కోసమే. జీఎస్‌టీ అమలైతే అంతిమంగా లాభపడేదీ వారే. దేశవ్యాప్తంగా ఒకే ధర ఉంటుంది కనక వ్యాపారులు తమ విస్తృతి పెంచుతారు. ఎక్కువ వెరైటీలు అందుబాటులోకి వస్తాయి. ఎంచుకోవడానికి కస్టమర్లకు ఆస్కారం ఉంటుంది. ఉత్పత్తులు, సేవల ధరలు తగ్గుతాయి. అయితే సెంట్రల్ జీఎస్‌టీ, ఇంటర్‌స్టేట్ జీఎస్‌టీ, స్టేట్ జీఎస్‌టీ కోసం వర్తకులు వేర్వేరు రిటర్నులు దాఖలు చేయాలి. చిన్న, మధ్యతరహా కంపెనీలు, చిన్న వర్తకులు ఈ విషయంలో ఆందోళనగా ఉన్నమాట వాస్తవమే. వేర్వేరు రిటర్నులు దాఖలు చేయాలంటే చాలా ఇబ్బందే.

ఏమాత్రం తప్పు దొర్లినా కఠిన శిక్షలున్నాయి. రిటర్నులు ఎలక్ట్రానిక్ రూపంలో దాఖలు చేయాలి. అత్యధికులకు దీనిపై అవగాహన లేదు. కాబట్టి సీఏల సేవలు వినియోగించుకోవాలి. ఇదంతా వ్యయప్రయాసలతో కూడినదని వర్తకులు అంటున్నారు. నిజానికి జీఎస్‌టీతో ప్రభుత్వానికి పన్ను ఆదాయం గణనీయంగా పెరుగుతుంది. ఇందులో ఎలాంటి  సందేహం లేదు. జీడీపీ 1.5-2 శాతం అధికమవుతుందన్న అంచనాలున్నాయి. ఈ నేపథ్యంలో ప్రభుత్వం చొరవ తీసుకోవాలి. ఎలక్ట్రానిక్ రూపంలో పన్నులు చెల్లించాలి కాబట్టి అవగాహన, శిక్షణ కార్యక్రమాలను నిర్వహించాలి. సర్వీస్ కేంద్రాల వంటివి ప్రభుత్వమే ఏర్పాటు చేయాలి. పొరపాటున ఏవైనా తప్పులు దొర్లినా కఠిన శిక్షలు వేయకూడదు’’.

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement