పెట్టుబడులకు అత్యుత్తమం.. భారత్ | India is the best to investment | Sakshi
Sakshi News home page

పెట్టుబడులకు అత్యుత్తమం.. భారత్

Published Mon, Jun 22 2015 1:24 AM | Last Updated on Sun, Sep 3 2017 4:08 AM

పెట్టుబడులకు అత్యుత్తమం.. భారత్

పెట్టుబడులకు అత్యుత్తమం.. భారత్

వాషింగ్టన్‌లో ఆర్థికమంత్రి అరుణ్‌జైట్లీ
 
వాషింగ్టన్ : పెట్టుబడులను ఆకర్షించడమే ప్రధాన లక్ష్యంగా బుధవారం నుంచీ 10 రోజుల అమెరికా పర్యటన ప్రారంభించిన  ఆర్థికమంత్రి అరుణ్‌జైట్లీ తన న్యూయార్క్ పర్యటనను ముగించుకుని రాజధాని వాషింగ్టన్‌కు చేరుకున్నారు. రెండు నగరాల్లో అత్యున్నత స్థాయి అమెరికా వ్యాపారవేత్తలు, కార్పొరేట్ దిగ్గజాలతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా జరిగిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ, ఆర్థికంగా తీవ్ర మందగమనంలో నడుస్తున్న ప్రపంచంలో.. భారత్ పెట్టుబడులకు అత్యుత్తమ మార్గమని అన్నారు.

దేశంలో ద్రవ్యోల్బణం, ద్రవ్యలోటు పూర్తి కట్టడిలో ఉన్నాయని, వృద్ధి రేటు ప్రపంచదేశాల్లోనే వేగంగా పురోగమిస్తోందని వివరించారు.  కేంద్రంలో ఏర్పడిన నూతన ప్రభుత్వం సుస్థిర, విశ్వసనీయ, పారదర్శక విధానాల వ్యవస్థను అందిస్తోందని పేర్కొన్నారు. తద్వారా పెట్టుబడులకు ఆకర్షణీయ దేశంగా భారత్‌ను తీర్చిదిద్దుతున్నట్లు తెలిపారు. ప్రతి పెట్టుబడిదారూ.. తమకు సుస్థిర విధాన వ్యవస్థ కావాలని కోరారని, ఇలాంటి వ్యవస్థ రూపకల్పనకు, ఈ ప్రక్రియను కొనసాగించడానికి భారత్ కట్టుబడి ఉందని, తద్వారా ఆర్థికాభివృద్ధి తమ లక్ష్యమని వివరించారు. ఇంకా ఆయన ఏమన్నారంటే...

► భారత్ పట్ల పెట్టుబడిదారుల వైఖరి ఎలా ఉందన్న విషయాన్ని తెలుసుకోడానికి ఈ పర్యటన ఎంతో దోహదపడింది. మరో మూడు రోజుల శాన్‌ఫ్రాన్సిస్కో పర్యటన ద్వారా పెట్టుబడిదారుల అభిప్రాయాలను తెలుసుకోడానికి మరింత ప్రాముఖ్యతను ఇస్తాను.
► {పత్యక్ష పన్ను రేట్లు 25 శాతానికి తగ్గించడం, వస్తువులు, సేవల పన్ను (జీఎస్‌టీ) దిశగా దేశం మార్పునకు ముందడుగు, పాతలావాదేవీలపై కొత్త పన్ను (రెట్రాస్పెక్టివ్) భయాలు తొలగేలా చూడడం.. పన్నుల వ్యవస్థలో ప్రధాన సంస్కరణలకు సంబంధించి అంశాలు,  రెట్రాస్పెక్టివ్ సమస్య ఇప్పటిదికాదు. మా ప్రభుత్వ ముందు నుంచీ వస్తున్న ఈ వివాద పరిష్కారానికి కేంద్రం ప్రయత్నిస్తోంది. దీనిపై అంతర్జాతీయ పెట్టుబడిదారులు భయపడాల్సింది ఏదీ లేదు. అసాధారణ అంశం అయితే తప్పించి,  పాత లావాదేవీలపై కొత్త పన్ను భారాలు సరికాదన్నది మా అభిప్రాయం.

► సబ్సిడీల హేతుబద్దీకరణ, బ్యాంకింగ్ వ్యవస్థ విస్తృతి, తద్వారా ప్రత్యక్ష ప్రయోజనాల బదలాయింపు (డీబీటీ) యంత్రాంగం వినియోగం, సహజవనరుల వినియోగం వంటి ముఖ్య అంశాల్లో హేతుబద్దీకరణ ప్రభుత్వ చొరవల్లో కీలకమైనవి.
► నైపుణ్య భారతంపై ప్రస్తుతం దృష్టి సారించాం. అలాగే దేశంలో మౌలిక రంగం పురోగతికి భారీ పెట్టుబడుల ప్రణాళికను కేంద్రం చేపట్టింది. ఇందుకు వీలుగా ఈ ఏడాదిపాటు ద్రవ్య స్థిరత్వం విషయంలో కొంత వెసులుబాటు తీసుకుంటున్నాం. తయారీ రంగం వృద్ధికి తగిన పన్ను విధాన రూపకల్పన జరుగుతోంది. త్వరలో ఈ రంగం మెరుగుపడుతుందన్న విశ్వాసముంది.
► నల్లధనం సమస్య పరిష్కారానికి అంతర్జాతీయంగా దేశాల మధ్య పరస్పర సహకారం పెరుగుతోంది. అంతర్జాతీయంగా పన్ను ఎగవేతల సమస్యలను  అరికట్టడానికి   ఫారిన్ అకౌంట్ ట్యాక్స్ కాంప్లియెన్స్ యాక్ట్ (ఎఫ్‌ఏటీసీఏ)లో భాగం పంచుకోడానికి భారత్ సూత్రప్రాయంగా అంగీకరించింది. అయితే ఈ ఒప్పందంపై సంతకాలు ఎప్పుడు జరిగేదీ ఇంకా నిర్ణయం కాలేదు. పన్నులకు సంబంధించి ఎప్పటికప్పుడు అంతర్జాతీయంగా సమాచార మార్పిడికి ఈ ఒప్పందం ఎంతగానో దోహదపడుతుంది. అంతర్జాతీయంగా లెక్కచూపని ఆస్తులను బయటకు తేవాలన్న ప్రభుత్వ సంకల్పం దీనితో నెరవేరుతుంది.
► ఒకవేళ వర్షాభావ పరిస్థితులు తలెత్తితే... ఎదుర్కొనడానికి తగిన అన్ని చర్యలనూ కేంద్రం తీసుకుంటోంది. ప్రధానంగా జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం విస్తరించాలన్న యోచన ఉంది. ఈ పథకానికి తాజా బడ్జెట్‌లో దాదాపు రూ.54,000 కోట్లు కేటాయించాం.
► బ్యాంకులకు తగిన తాజా మూలధన కల్పన ప్రభుత్వ విధానం. ఇందుకు ఒక మార్గం బడ్జెటరీ మద్దతు. మరొకటి ప్రభుత్వ వాటాను 52 శాతానికి కుదించడం. ఇక ఆర్థిక వృద్ధి మెరుగుపడితే... క్రమంగా బ్యాంకులకు మొండిబకాయిల (ఎన్‌పీఏ) బెడదా తగ్గిపోతుందన్నది మా విశ్వాసం. కాగా ఆల్‌టైమ్ గరిష్టం
► 6 శాతానికి చేరిన ఎన్‌పీఏలు ఇప్పుడు 5.64 శాతానికి చేరడం చెప్పుకోదగిన మరో ముఖ్యాంశం.
 
 ద్వైపాక్షిక అంశాలపై చర్చ..

 ఆర్థికమంత్రి వాషింగ్టన్ పర్యటన సందర్భంగా అమెరికా ఉన్నతస్థాయి అధికారులతో పలు ద్వైపాక్షిక అంశాలపై చర్చలు జరిపారు. ప్రతిపాదిత ద్వైపాక్షిక పెట్టుబడుల ఒప్పందం ఇందులో ఒకటి. ఆర్థికమంత్రి సమావేశమయిన వారిలో అమెరికా ఆర్థికమంత్రి జాన్ లీ, వాణిజ్యమంత్రి పెన్నీ పిడ్జ్‌కర్ ఉన్నారు. ట్రేడ్ రిప్రజెంటేటివ్ మైక్ ఫ్రోమెన్‌తో కూడా జైట్లీ సమావేశం జరిపారు.  పలు అంశాల్లో రెండు దేశాల మధ్య ఏకాభిప్రాయం ఉందని ఈ సందర్భంగా ఆర్థికమంత్రి తెలిపారు.
 
 ఎందుకు పెరిగాయంటే...
 వడ్డీరేట్లపై యథాతథ స్థితిని కొనసాగించాలని అమెరికా ఫెడరల్ రిజర్వ్ నిర్ణయించడంతో విదేశీ నిధులు వెళ్లిపోతాయనే ఆందోళనలు తగ్గుముఖం పట్టడం, వర్షాలు విస్తారంగా కురుస్తుండటంతో కరువు భయాలు తొలగడం వంటి కారణాలతో గత వారమంతా స్టాక్ మార్కెట్ లాభాల్లోనే నడిచింది. మారిషస్‌కు చెందిన ఎంవీ ఎస్‌సీఐఎఫ్ సంస్థ 0.5 శాతం వాటా కొనుగోలు చేయడంతో జేపీ అసోసియేట్స్, 4జీ సర్వీసులను డిసెంబర్‌కల్లా తెస్తామని ప్రకటించిన నేపథ్యంలో  రిలయన్స్ ఇండస్ట్రీస్ షేర్లు ఎగిశాయి.
 
 ఎందుకు తగ్గాయంటే...
 కెయిర్న్, వేదాంత విలీనం ఆకర్షణీయంగా లేదని కెయిర్న్ ఇండియా మైనార్టీ వాటాదారుల్లో ఒకటైన ఎల్‌ఐసీ ఆందోళన వ్యక్తం చేయడంతో వేదాంత, అదానీ ఎంటర్‌ప్రైజెస్ పునర్వ్యవస్థీకరణ నేపథ్యంలో అదానీ పవర్, అదానీ పోర్ట్స్ అండ్ స్పెషల్ ఎకనామిక్ జోన్ షేర్లు తగ్గాయి.

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement