టెక్నాలజీ స్టార్టప్లలో భారత్ జోరు..
⇔ దేశీయంగా బెంగళూరు టాప్
⇔ హైదరాబాద్ వాటా 8%
న్యూఢిల్లీ: ప్రపంచ వ్యాప్తంగా పురుడు పోసుకుంటున్న టెక్నాలజీ ఆధారిత స్టార్టప్‌లలో భారత్ మూడో స్థానంలో ఉన్నట్టు అసోచామ్ వెల్లడించింది. అమెరికా ప్రథమ స్థానంలో, యూకే రెండో స్థానంలో ఉన్నాయి. ఈ మేరకు అసోచామ్, థాట్ ఆర్బిట్రేజ్ రీసెర్చ్ ఇనిస్టిట్యూట్ సహకారంతో ఓ అధ్యయనం నిర్వహించి నివేదిక విడుదల చేసింది. దేశీయంగా చూస్తే బెంగళూరు అత్యధిక స్టార్టప్‌లను ఆకర్షిస్తూ నంబర్ 1 స్థానంలో ఉంది. ఢిల్లీ ఎన్‌సీఆర్, ముంబై తర్వాతి స్థానాల్లో నిలిచాయి. హైదరాబాద్, చెన్నై నగరాలు సైతం టెక్నాలజీ స్టార్టప్‌ల విషయంలో ముందున్నట్టు నివేదిక వెల్లడించింది.
⇔ 2015 వరకు అమెరికాలో 47వేల టెక్నాలజీ స్టార్టప్‌లు మొగ్గతొడిగాయి. యూకేలో 4,500, భారత్‌లో 4,200 స్టార్టప్‌లు ప్రయాణాన్ని ప్రారంభించాయి.
⇔ ఐటీ కేంద్రంగా ఉన్న బెంగళూరు 26 శాతం టెక్ స్టార్టప్‌లకు కేంద్రంగా నిలిచింది. ఢిల్లీ ఎన్‌సీఆర్ 23 శాతం, ముంబై 17 శాతం, హైదరాబాద్ 8 శాతం, చెన్నై 6 శాతం స్టార్టప్‌లను ఆకర్షించాయి.
కొత్త ఆవిష్కరణలకు ప్రోత్సాహం అందించాలి: అసోచామ్
టెక్నాలజీ, ప్రాసెస్‌లో విధ్వంసక ఆవిష్కరణల కారణంగా కొత్త స్టార్టప్‌లు ఏర్పడ్డాయని, వీటి పట్ల విదేశీ ఇన్వెస్టర్లు బాగా ఆసక్తి చూపిస్తున్నారని అసోచామ్ ప్రెసిడెంట్ సునీల్ కనోరియా చెప్పారు. ‘‘స్టార్టప్‌ల ద్వారా టెక్నాలజీలో అద్భుత ఆవిష్కరణలు జరగాలి. దీంతో స్టార్టప్ అనేది వేగంగా పురోగమించేందుకు కావాల్సిన సాధనమనేది విసృ్తతంగా వ్యాపిస్తుంది’’ అని చెప్పారాయన.