
జీడీపీలో 15 శాతానికి పెరిగిన భారత బిలియనీర్ల సంపద
సాక్షి, న్యూఢిల్లీ : భారత్‌లో ధనికులు, పేదల మధ్య అంతరాలు విపరీతంగా పెరుగుతున్న క్రమంలో దేశ జీడీపీలో భారత బిలియనీర్ల సంపద ఏకంగా 15 శాతంగా ఉందని ఓ నివేదిక వెల్లడించింది. పాలకుల అసంబద్ధ విధానాలతో అసమానతలు పెరుగుతున్నాయని ఆక్స్‌ఫామ్ నివేదిక పేర్కొంది. దేశంలో సృష్టించబడుతున్న సంపదలో అధిక శాతం వారసత్వంగా, క్రోనీ క్యాపిటలిజం ద్వారా అత్యంత సంపన్నుల వద్దే పోగుపడుతోందని పేర్కొంది.
మరోవైపు సమాజంలో అట్టడుగు ప్రజలకు దక్కాల్సిన వాటా మాత్రం కుచించుకుపోతోందని ఆందోళన వ్యక్తం చేసింది. 1991 ఆర్థిక సంస్కరణల అనంతరం ఈ అసమానతలు విపరీతంగా పెచ్చుమీరాయని ఆక్స్‌ఫామ్ ఇండియా సీఈఓ నిషా అగర్వాల్ పేర్కొన్నారు. తాజా అంచనాల ప్రకారం దేశ జీడీపీలో భారత బిలియనీర్ల మొత్తం సంపద 15 శాతంగా ఉందని నివేదిక తెలిపింది. ఐదేళ్ల కిందట దేశ జీడీపీలో 10 శాతంగా ఉన్న బిలియనీర్ల సంపద ఇప్పుడు ఏకంగా 15 శాతానికి ఎగబాకింది. 2017 నాటికి భారత్‌లో 101 మందికి పైగా బిలియనీర్లున్నారు.