
రతన్ టాటాకు అరుదైన గౌరవం
భారత పారిశ్రామిక దిగ్గజం రతన్ టాటాకు అరుదైన గౌరవం దక్కింది.
బీజింగ్: భారత పారిశ్రామిక దిగ్గజం రతన్ టాటాకు అరుదైన గౌరవం దక్కింది. చైనా ప్రభుత్వ మద్దతు కలిగిన, అత్యంత ప్రభావవంతమైన బోవో ఫోరమ్ ఫర్ ఆసియా (బీఎఫ్‌ఏ) బోర్డులో ఆయనకు సభ్యత్వం లభించింది. భారతీయ పారిశ్రామిక ప్రముఖునికి బీఎఫ్‌ఏ బోర్డులో చోటు దక్కడం ఇదే ప్రప్రథమం. బోవో (చైనా)లో జరుగుతున్న బీఎఫ్‌ఏ సదస్సుకు హాజరైన భారతీయ కాన్సుల్ జనరల్ కె.నాగరాజ్ నాయుడు గురువారం ఈ విషయం తెలిపారు.
బీఎఫ్‌ఏ సభ్యత్వంతో టాటా గ్రూప్‌నకు ప్రపంచస్థాయి వాణిజ్య, పారిశ్రామిక గ్రూప్‌గా గుర్తింపు లభించిందని పేర్కొన్నారు. పదిహేను మంది సభ్యులు గల బీఎఫ్‌ఏ బోర్డులో జపాన్, మలేసియా, సింగపూర్, ఫ్రాన్స్‌ల మాజీ ప్రధానులతో పాటు అమెరికా ట్రెజరీ సెక్రటరీ హెన్రీ పాల్సన్‌లకు సభ్యత్వం ఉంది. దావోస్ సదస్సుకు అనుగుణంగా 2001లో బీఎఫ్‌ఏను ఏర్పాటు చేశారు.