సిమెంట్ మార్కెట్ స్థిరపడుతోంది: హోల్సిమ్
న్యూఢిల్లీ: దేశీయ సిమెంట్ మార్కెట్ ఈ ఏడాది ప్రారంభం నుంచి స్థిరపడడం మొదలైందని స్విట్జర్లాండ్‌కు చెందిన దిగ్గజ సంస్థ హోల్సిమ్ తెలిపింది. జనవరి - మార్చి త్రైమాసికంలో సిమెంటు విక్రయాలు నిలకడగా ఉన్నాయని పేర్కొంది. అంబుజా సిమెంట్స్, ఏసీసీ లిమిటెడ్‌ల్లో మెజారిటీ వాటా కలిగిన హోల్సిమ్, తొలి త్రైమాసిక ఫలితాల ప్రకటన సందర్భంగా ఈ విషయం తెలిపింది. ఏసీసీ, అంబుజా సిమెంట్స్ వార్షిక ఉత్పత్తి సామర్థ్యం 5.80 కోట్ల టన్నులు.
ఆదిత్య బిర్లా గ్రూప్‌నకు చెందిన అల్ట్రాటెక్ తర్వాత దేశంలో అత్యధికంగా సిమెంటు ఉత్పత్తి చేసే సంస్థ హోల్సిమ్. ప్రపంచవ్యాప్తంగా 70కి పైగా దేశాల్లో హోల్సిమ్ సిమెంట్ ఉత్పత్తి కేంద్రాలున్నాయి. సంస్థ మొత్తం ఉత్పత్తి సామర్థ్యం 20.6 కోట్ల టన్నులు. జనవరి - మార్చిలో ఏసీసీ 64.80 లక్షల టన్నుల సిమెంటును విక్రయించగా, అంతకుముందు ఏడాది ఇదేకాలంలో 64.20 లక్షట టన్నులను అమ్మింది. ఇదేకాలంలో అంబుజా అమ్మకాలు 59.60 లక్షల టన్నుల నుంచి 60.60 లక్షల టన్నులకు పెరిగాయి.