
రోజంతా ఒడిదుడుకులమయంగా సాగిన సోమవారం నాటి ట్రేడింగ్‌లో స్టాక్ మార్కెట్ స్వల్ప లాభాలతో గట్టెక్కింది. అంతర్జాతీయ సంకేతాలు బలహీనంగా ఉన్నప్పటికీ, బ్యాంక్ షేర్ల దన్నుతో సెన్సెక్స్, నిఫ్టీలు లాభాల్లో ముగిశాయి. చివరి అరగంట కొనుగోళ్ల పుణ్యమాని ఈ రెండు సూచీలు లాభపడ్డాయి. రోజంతా 266 పాయింట్ల రేంజ్‌లో కదలాడిన సెన్సెక్స్ చివరకు 21 పాయింట్ల లాభంతో 40,345 పాయింట్ల వద్ద ముగిసింది. ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ 5 పాయింట్లు పెరిగి 11,913 పాయింట్ల వద్దకు చేరింది.
బలహీనంగా అంతర్జాతీయ సంకేతాలు....
హాంగ్‌కాంగ్‌లో రాజకీయంగా ఉద్రిక్తతలు మరింత ప్రజ్వరిల్లడం, అమెరికా–చైనా మధ్య వాణిజ్య ఒప్పందంపై అనిశ్చితి నెలకొనడంతో ఆసియా మార్కెట్లు నష్టపోయాయి. ఆ ప్రభావం మన మార్కెట్‌పై కూడా పడింది. మూడీస్ సంస్థ మన క్రెడిట్ అవుట్ లుక్ రేటింగ్‌ను తగ్గించడం ప్రతికూల ప్రభావం చూపించింది. మార్కెట్ ముగిసిన తర్వాత పారిశ్రామిక ఉత్పత్తి గణాంకాలు వెలువడనుండటంతో ఇన్వెస్టర్లు అప్రమత్తంగా వ్యవహరించారు. రూపాయి మారకం 18 పైసలు పతనమై 71.47కు చేరింది. ముడి చమురు ధరలు 1 శాతం మేర తగ్గినప్పటికీ, ఎలాంటి ప్రభావం కనిపించలేదు.
సెన్సెక్స్ నష్టాల్లోనే ఆరంభమైంది. తర్వాత తేరుకొని లాభాల్లోకి మళ్లింది. తర్వాత అరగంటలోనే మళ్లీ నష్టాల్లోకి జారింది. చివరి అరగంట వరకూ నష్టాల్లోనే ట్రేడైంది. బ్యాంక్, కొన్ని ఇండెక్స్ హెవీ వెయిట్ షేర్లలో కొనుగోళ్ల కారణంగా లాభాల్లో ముగిసింది. ఒక దశలో 173 పాయింట్లు పతనమైన సెన్సెక్స్ మరో దశలో 93 పాయింట్లు లాభపడింది. రోజంతా 266 పాయింట్ల రేంజ్‌లో తిరిగింది. యూరప్ మార్కెట్లు మిశ్రమంగా మొదలై, నష్టాల్లో ముగిశాయి.
- యెస్ బ్యాంక్ షేర్ 5.8 శాతం లాభంతో రూ.73 వద్ద ముగిసింది. సెన్సెక్స్‌లో బాగా పెరిగిన షేర్ ఇదే. గత 26 ట్రేడింగ్ సెషన్లలో ఈ షేర్ 150 శాతం ఎగియడం విశేషం.
Comments
Please login to add a commentAdd a comment