మన విదేశీ రుణ భారం 476 బిలియన్ డాలర్లు...
ముంబై: భారత విదేశీ రుణ భారం 2015 మార్చితో ముగిసిన ఆర్థిక సంవత్సరం 476 బిలియన్ డాలర్లకు చేరింది. 2014 మార్చితో పోల్చితే ఈ మొత్తం 29.5 బిలియన్ డాలర్లు (6.6 శాతం) ఎగశాయి. విదేశీ వాణిజ్య రుణాలు (ఈసీబీ), ఎన్‌ఆర్‌ఐ డిపాజిట్లు భారీగా పెరగడం రుణ భారం పెరగడానికి ఒక కారణమని ఆర్‌బీఐ నివేదిక విడుదల చేసిన గణాంకాలు వెల్లడించాయి. 2015 మార్చి నాటికి స్థూల దేశీయోత్పత్తి (జీడీపీ) విలువతో పోల్చిచూస్తే విదేశీ రుణ భారం 23.8 శాతంగా ఉంది. 2014 మార్చి నాటికి ఈ శాతం 23.6%. మొత్తం రుణంలో దీర్ఘకాలిక రుణ భారం వార్షికంగా 10 శాతం పెరిగి 391 బిలియన్ డాలర్లకు చేరింది.
స్వల్పకాలిక రుణ భారం మాత్రం 7.6 శాతం క్షీణించి 85 బిలియన్ డాలర్లయ్యింది. ఇక మొత్తం రుణంలో ప్రభుత్వ (సావరిన్), ప్రభుత్వేతర రుణ భారాల వాటా 18.9%, 81.1%గా ఉన్నాయి. కాగా, గ్రీస్ సంక్షోభం భారత్ కంపెనీల విదేశీ రుణ సమీకరణ కార్యకలాపాలపై స్వల్ప కాలికంగా ప్రభావం చూపే అవకాశం ఉందని ఇండియా రేటింగ్స్ తన అధ్యయన నివేదికలో తెలిపింది.