క్రమంగా పసిడి ఆంక్షల తొలగింపు
ముంబై: పసిడి దిగుమతులపై ఆంక్షలను క్రమంగా సడలించనున్నట్లు రిజర్వ్ బ్యాంక్ గవర్నర్ రఘురామ్ రాజన్ సంకేతాలు ఇచ్చారు. గడచిన ఆర్థిక సంవత్సరంలో (2013-14, ఏప్రిల్-మార్చి) క్యాడ్‌ను గణనీయంగా తగ్గించగలిగిన నేపథ్యంలో రాజన్ ప్రకటన వెలువడింది. ఆర్‌బీఐ పాలసీ అనంతర సమీక్షా సమావేశంలో రాజన్ బుధవారం మాట్లాడుతూ ఆంక్షలు తొలగించడానికి తాను సానుకూలమేనని అన్నారు. అయితే ఇది నెమ్మదిగా, క్రమరీతిన స్థిరంగా జరగాల్సి ఉంటుందని వివరించారు. ఆంక్షల సడలింపు సమయంపై ప్రభుత్వంతో చర్చలు జరుపుతామని, అనిశ్చితి పరిస్థితులు ఇంకా కొనసాగుతున్న నేపథ్యంలో ఆయా అంశాలనన్నింటినీ పరిగణనలోకి తీసుకుని ఒక నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుందన్నారు. బంగారం దిగుమతులకు మరిన్ని బ్యాంకులకు కొద్ది రోజుల క్రితం అనుమతించిన విషయాన్నీ ఈ సందర్భంగా రాజన్ ప్రస్తావించారు.
నేపథ్యం ఇదీ...: క్యాపిటల్ ఇన్‌ఫ్లోస్(ఎఫ్‌ఐఐ, ఎఫ్‌డీఐ, ఈసీబీ) మినహా దేశంలోకి వచ్చీ-పోయే మొత్తం విదేశీ మారకద్రవ్య నిల్వల మధ్య ఉన్న వ్యత్యాసాన్ని క్యాడ్‌గా పరిగణిస్తాం. 2013-14లో క్యాడ్ భారీగా తగ్గడానికి కేంద్రం బంగారం-వెండి దిగుమతులపై 2 శాతం నుంచి 10 శాతానికి సుంకాల పెంపుసహా పలు ఆంక్షలు విధించింది. ఈ చర్యలు తగిన ఫలితాలను అందించాయి. అధికారిక గణాంకాల ప్రకారం- ఫిబ్రవరితో ముగిసిన యేడాది కాలంలో బంగారం, వెండి దిగుమతుల విలువ భారీగా 71.42 శాతం పడిపోయింది.
రూపాయిపై ఇలా...: డాలర్ మారకంలో రూపాయి విలువ 45-50 శ్రేణిలో బలపడితే అది భారత్ ఎగుమతులపై ప్రతికూల ప్రభావం చూపుతుందని రాజన్ అభిప్రాయపడ్డారు. ప్రస్తుత ఎగుమతుల పేలవ పనితీరుపై మాత్రం రూపాయి బలోపేతం ప్రభావం ఎంతమాత్రం లేదని స్పష్టం చేశారు. రూపాయి కొంత స్థాయిలో బలోపేతమయితే సమస్య ఉండదని, అయితే మరీ ఎక్కువగా బలపడితే మాత్రం ఎగుమతులకు ఇది ఆందోళనకరమైన అంశమేనని ఒక చానల్‌కిచ్చిన ఇంటర్వ్యూలో అన్నారు. దీనివల్ల కరెన్సీలు బలహీనపడిన కొన్ని అభివృద్ధి చెందిన దేశాల నుంచి మనకు అంతర్జాతీయ మార్కెట్‌లో గట్టిపోటీ ఉంటుందని వివరించారు.
ఆర్‌బీఐ,ఎస్‌బీఐ బోర్డ్‌ల్లో గురుదయాల్ సింగ్ సంధు
ఆర్‌బీఐ, ఎస్‌బీఐ సెంట్రల్ బోర్డ్‌ల్లో డెరైక్టర్‌గా ఆర్థిక సేవల కార్యదర్శి గురుదయాల్ సింగ్ సంధు నామినేట్ అయ్యారు. కేంద్ర ప్రభుత్వం ఈ మేరకు ఒక నిర్ణయం తీసుకున్నట్లు ఆర్‌బీఐ నోటిఫికేషన్ తెలిపింది. ఏప్రిల్ 1 నుంచీ ఈ నియామకం అమల్లోకి వచ్చింది. ఎస్‌బీఐ కూడా మరొక ప్రకటన చేస్తూ, సంధూను బ్యాంక్ బోర్డ్‌లో నామినేట్ చేస్తున్నట్లు పేర్కొంది.
ద్రవ్యోల్బణం దిగివస్తే వడ్డీ రేట్లూ తగ్గిస్తాం
ద్రవ్యోల్బణ కట్టడి ప్రక్రియ ఊహించిన దానికంటే వేగంగా కొనసాగితే వడ్డీ రేట్లను తగ్గించే అవకాశం ఉందని రాజన్ తెలిపారు. కొత్త ప్రభుత్వం ప్రవేశపెట్టే బడ్జెట్ ద్రవ్య పటిష్టీకరణకు, పెట్టుబడుల వృద్ధికి దోహదపడుతుందని ఆశిస్తున్నట్లు చెప్పారు. ద్రవ్య విధానం స్థిరంగా ఉండాలి గానీ, ప్రతి సమాచారానికీ స్పందించేదిగా ఉండరాదని అభిప్రాయపడ్డారు.