మళ్లీ మార్కెట్లు డీలా
మళ్లీ మార్కెట్లు డీలా
Published Fri, Sep 13 2013 2:13 AM | Last Updated on Fri, Sep 1 2017 10:39 PM
రిజర్వ్ బ్యాంక్ కొత్త గవర్నర్‌గా రాజన్ పదవీ బాధ్యతలు చేపట్టాక తొలిసారి ఇటు రూపాయి, అటు స్టాక్ మార్కెట్లు నష్టపోయాయి. డాలరుతో మారకంలో రూపాయి 12 పైసలు క్షీ ణించి 63.50 వద్ద నిలవగా, సెన్సెక్స్ 216 పాయింట్లు తగ్గి 19,782 వద్ద ముగిసింది. వెరసి ఐదు రోజుల వరుస లాభాలకు బ్రేక్ పడింది. మరోవైపు ఇదే బాటలో పురోగమిస్తూ వచ్చిన బ్యాంకింగ్ షేర్లు సైతం డీలా పడ్డాయి. గత ఐదు రోజుల్లో సెన్సెక్స్ దాదాపు 10%(1,763 పాయింట్లు) దూసుకె ళ్లగా, రూపాయి 425 పైసలు బలపడింది. ఇక బీఎస్‌ఈ బ్యాంకింగ్ ఇండెక్స్ సైతం 1,900 పాయింట్లకు పైగా ఎగసిన విషయం విదితమే.
గురువారం ట్రేడింగ్‌లో వరుసగా మూడో రోజు సెన్సెక్స్ ఇంట్రాడేలో 20,000పాయింట్లను తాకడం గమనార్హం. ప్రధానంగా మెటల్స్, బ్యాంకింగ్, ఆటో, ఆయిల్ రంగాలు 2.5-1.7% మధ్య నీరసించాయి. ఇక నిఫ్టీ కూడా 62 పాయింట్లు క్షీణించి 5,851 వద్ద స్థిరపడింది. మార్కెట్లు ముగిశాక వెలువడే రిటైల్ ద్రవ్యోల్బణం, ఐఐపీ గణాంకాలపై ఆందోళనతో ఇన్వెస్టర్లు వెనకడుగు వేశారని నిపుణుల విశ్లేషణ. 23 షేర్లు నష్టాల్లోనేసెన్సెక్స్-30లో 23 షేర్లు నష్టపోగా, టాటా స్టీల్, భెల్, హీరో మోటో 4% స్థాయిలో పతనమయ్యాయి. ఈ బాటలో ఓఎన్‌జీసీ, మారుతీ, సెసా గోవా, కోల్ ఇండియా, హిందాల్కో, హెచ్‌యూఎల్, టాటా మోటార్స్, భారతీ, ఎస్‌బీఐ, ఐసీఐసీఐ, ఇన్ఫోసిస్, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్, ఆర్‌ఐఎల్, టీసీఎస్ వంటి దిగ్గజాలు 3.3-1.3% మధ్య నష్టపోయాయి. మరోవైపు టాటా పవర్, ఐటీసీ, గెయిల్ 2.7-1.6% మధ్య లాభపడ్డాయి.
ఎఫ్‌ఐఐల పెట్టుబడులు
గత రెండు రోజుల్లో రూ. 3,150 కోట్లను ఇన్వెస్ట్ చేసిన ఎఫ్‌ఐఐలు తాజాగా రూ. 931 కోట్ల విలువైన షేర్లను కొనుగోలుచేయగా, దేశీయ ఫండ్స్ రూ. 396 కోట్ల విలువైన పెట్టుబడులను వెనక్కి తీసుకున్నాయి. కంపెనీ పునరుద్ధరణపై మంత్రివర్గ మండలి(జీవోఎం) సమావేశం నేపథ్యంలో ఎంటీఎన్‌ఎల్ 20% దూసుకెళ్లింది.
Advertisement