2017లో భారత వృద్ధి 7.1 శాతం
నొమురా అంచనా...
న్యూఢిల్లీ: భారత వృద్ధి రేటు విషయంలో జపాన్‌కు చెందిన ప్రముఖ ఆర్థిక సేవల సంస్థ నొమురా సానుకూల అభిప్రాయాలు వ్యక్తం చేసింది. 2017లో వృద్ధి రేటు విషయంలో తమ అంచనాల్లో ఎలాంటి మార్పు ఉండకపోవచ్చని... ఇది 7.1 శాతంగా ఉంటుందని తెలిపింది. ప్రభుత్వం చేపట్టిన సంస్కరణలు స్వల్ప కాలంలో వృద్ధికి విఘాతం కలిగిస్తాయని స్పష్టం చేసింది. అయితే, ఈ చర్యల ఫలితంగా 2018లో వేగవంతమైన వృద్ధి రేటు సాధ్యమవుతుందని, 7.7 శాతానికి ఎగుస్తుందని తన నివేదికలో నొమురా పేర్కొంది. ‘‘నోట్లపై ఆంక్షల వల్ల స్వల్ప కాలంలో వృద్ధికి విఘాతం కలుగుతుంది.
వ్యవసాయం, రియల్ ఎస్టేట్, వాణిజ్యం, హోటళ్లు, రెస్టారెంట్లు, నిర్మాణం, రవాణా వంటి రంగాలు ఎక్కువగా నగదుపై ఆధారపడేవి. జీడీపీలో వీటి వాటా 55 శాతం. డీమోనిటైజేషన్ వల్ల మూడు నుంచి నాలుగు నెలల పాటు ఈ రంగాలపై ప్రభావం పడుతుంది. దీంతో 2016 నాల్గవ, 2017 తొలి త్రైమాసికాల్లో జీడీపీ రేటు 1 నుంచి 1.25 శాతం వరకు పడిపోతుంది’’ అని నొమురా వివరించింది.‘‘ప్రభుత్వ సంస్కరణల వల్ల స్వల్పకాలంలో ఇబ్బందులు ఎదురైనా మధ్య నుంచి దీర్ఘకాలంలో మాత్రం ఆర్థిక రంగానికి మంచి జరుగుతుందని నొమురా తన నివేదికలో తెలిపింది.