జీడీపీ లెక్క నిజమా.. మాయా?
అంతర్జాతీయ బ్రోకరేజీ సంస్థ నోమురా సందేహం
⇒ వాస్తవ పరిస్థితులను ప్రతిబింబించడం లేదు...
⇒ అవ్యవస్థీకృత రంగంపై ప్రభావం సంగతేంటి?
⇒ అసలైన గణాంకాలు 2018 జనవరిలోనే: కోటక్
న్యూఢిల్లీ: దేశ జీడీపీ గణాంకాలు ఆర్థికవేత్తలు, విశ్లేషకులను ఆశ్చర్యానికి గురి చేశాయి. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం అక్టోబర్ – డిసెంబర్ త్రైమాసికంలో జీడీపీ వృద్ధి 7 శాతంగా ఉన్నట్టు కేంద్ర ప్రభుత్వం వెల్లడించిన విషయం తెలిసిందే. అంతేకాదు, నాలుగో త్రైమాసికం (జనవరి–మార్చి)లో 7.1 శాతంగా ఉంటుందని కేంద్ర గణాంక విభాగం ప్రకటించింది. గతేడాది నవంబర్ 8న రూ.500, రూ.1,000 నోట్లను రద్దు చేస్తూ తీసుకున్న నిర్ణయంతో జీడీపీ రేటు మూడో త్రైమాసికంలో 6.4 శాతానికి పడిపోతుందంటూ ఎన్నో ప్రముఖ సంస్థలు అంచనాలు వేశాయి. కానీ, కేంద్ర సర్కారు గణాంకాలు వాటికి భిన్నంగా ఉండడంతో విశ్లేషకులు వాటిని తోసిపుచ్చారు. వీటిపై తమకు ఎన్నో సందేహాలు ఉన్నట్టు పేర్కొనడం గమనార్హం.
లోగడ రాయిటర్స్ నిర్వహించిన సర్వేలోనూ జీడీపీ 6.4 శాతంగానే నమోదవుతుందన్న అభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. ఈ గణాంకాలు పెద్ద నోట్ల రద్దు ప్రభావాన్ని పరిగణనలోకి తీసుకోలేదని ఐడీబీఐ ఫెడరల్ లైఫ్ ఇన్సూరెన్స్ కంపెనీ సీఎఫ్‌వో అనీష్ శ్రీవాస్తవ అభిప్రాయం వ్యక్తం చేశారు. తాను పూర్తిగా ఆశ్చర్యానికి లోనయ్యానని ఆయన చెప్పడం విశేషం. ఇక మెరుగైన గణాంకాల నేపథ్యంలో ఆర్‌బీఐ రేట్ల కోతపై పెట్టుకున్న ఆశలకూ విఘాతం కలిగినట్టేనన్నది విశ్లేషకుల అభిప్రాయం. ‘‘ద్రవ్యోల్బణ ఒత్తిళ్ల నేపథ్యంలో ఆర్‌బీఐ వచ్చే 12–18 నెలల్లో రేట్లను పెంచడం మొదలు పెట్టవచ్చని భావిస్తున్నాం’’ అన్న అభిప్రాయం వారి నుంచి వ్యక్తమైంది.
గణాంకాలు కచ్చితమేనా!
ప్రభుత్వ గణాంకాల పట్ల సందేహాలను ప్రభుత్వ రంగంలోని ఎస్‌బీఐతోపాటు, నోమురా, బ్యాంక్ ఆఫ్ అమెరికా మెరిల్ లించ్ సంస్థల ఆర్థికవేత్తలు సైతం ప్రశ్నించడం గమనార్హం. భారత వృద్ధి గణాంకాలు ‘నిజమా లేక మాయా?’ అని నోమురా ప్రశ్నించింది. అధికారిక గణాంకాలు వాస్తవిక ప్రభావాన్ని తక్కువగా అంచనా వేసినట్టు పేర్కొంది. ‘‘2015–16 మూడో త్రైమాసికంలో జీడీపీ గణాంకాలను గణనీయంగా సవరించడం 2016–17 ఆర్థిక సంవత్సరం మూడో త్రైమాసికంలో జీడీపీ అధి కంగా ఉండేందుకు దారితీసింది. గణాంకాలతో డీమోనిటైజేషన్ ప్రభావాన్ని కప్పిపుచ్చారు’’ అని ఎస్‌బీఐ ము ఖ్య ఆర్థిక సలహాదారు సౌమ్యకాంతి ఘోష్ పేర్కొన్నారు.
మూడు కారణాలు
‘‘ఈ వ్యత్యాసాలకు 3 కారణాలున్నాయి. అవ్యవస్థీకృత రంగంపై పడిన ప్రభావాన్ని అంచనా వేయకపోవడం, 2015 మూడో త్రైమాసికం జీడీపీ వృద్ధి అంచనాలను సవరించడం, కంపెనీలు తమ దగ్గరున్న నగదు నిల్వలను సైతం విక్రయాలుగా చూపించడం. మా ఉద్దేశం ప్రకారం జీడీపీ గణాంకాలు... డీమోనిటైజేషన్ వృద్ధిపై చూపించిన ప్రభావాన్ని చాలా వరకు తక్కు వగా అంచనా వేయడమే’’ అని నోమురా పేర్కొంది.
సవరించిన గణాంకాలతో నిజం తెలుస్తుంది
డీమోనిటైజేషన్ ప్రభావం అస్పష్టంగా ఉందని, గణాంకాలు మిశ్రమ ధోరణిని ప్రతిబింబిస్తున్నాయని కోటక్ ఇన్‌స్టిట్యూషనల్ ఈక్విటీస్ పేర్కొంది. నగదు ఆధారిత లావాదేవీలపై ఆధారపడిన అవ్యవస్థీకృత రంగం, చిన్న మధ్య స్థాయి కంపెనీల విభాగాన్ని జీడీపీ గణాంకాల్లోకి పరిగణనలోకి తీసుకోలేదని అభిప్రాయపడింది. ఆర్థిక వ్యవస్థకు సంబంధించి మరింత పూర్తిస్థాయి వాస్తవిక చిత్రం 2018 జనవరిలో వెలువడే 2016–2017 ఏడాది సవరించిన గణాంకాల్లో తెలుస్తుందని పేర్కొంది.
వాస్తవాలకు విరుద్ధం!
మోదీ సర్కారు డీమోనిటైజేషన్ నిర్ణయాన్ని ప్రతిపక్షాలతోపాటు ప్రముఖ ఆర్థికవేత్తలైన ఆమర్త్యసేన్, పాల్ క్రుగ్‌మన్ వంటి వారు కూడా తప్పుబట్టారు. అయితే, ప్రభుత్వం, ఆర్‌బీఐ ఈ విమర్శలను తోసిపుచ్చుతూ ఇబ్బందులు తాత్కాలికమేనని చెప్పాయి. ఇప్పుడు ప్రభుత్వం నుంచి బలమైన జీడీపీ గణాంకాలు వెల్లడి కావడంతో అసలు వాటి నాణ్యత, విశ్వసనీయతపైనే ఇప్పుడు సందేహాలు వ్యక్తమవుతున్నాయి. నిజానికి రెండేళ్ల క్రితం మోదీ సర్కారు ఆర్థిక కార్యకలాపాలను కొలిచే విధానాన్ని (బేస్ ఇయర్ మార్పు) మార్చింది. దాంతో రాత్రికి రాత్రే ప్రపంచంలోనే వేగవంతమైన ఆర్థిక వ్యవస్థగా భారత్ గుర్తింపు తెచ్చుకుంది. కానీ, ఇది వాస్తవికంగా లేదన్నది విశ్లేషకుల అభిప్రాయం.
తాజా గణాంకాలు ఈ విషయంలో మరింత సందేహాలకు తావిచ్చాయి. తమ ఆదాయం, ఉపాధిపై గృహస్థుల్లో అనిశ్చితి వల్ల వినియోగదారుల విశ్వాసం గణనీయంగా పడిపోయినట్టు ఆర్‌బీఐ తాజా సర్వే కూడా స్పష్టం చేసింది. కానీ, వాస్తవాలు ఇలా ఉంటే, క్యూ3 జీడీపీ వృద్ధి గణాంకాలు మెరుగ్గా నమోదయ్యాయనేది ఆర్థికరంగ విశ్లేషకుల వాదన. మరోవైపు పెద్ద నోట్ల రద్దుతో తమ అమ్మకాలు దెబ్బతిన్నట్లు పలు కార్పొరేట్ కంపెనీలు ప్రకటించగా, మరి జీడీపీ ఎలా పెరుగుతుందన్న సందేహాల్ని విశ్లేషకులు వ్యక్తం చేస్తున్నారు. డీమోనిటైజేషన్ ప్రభావంతో వృద్ధి రేటు 100 బేసిస్ పాయింట్లు క్షీణిస్తుందన్నది బ్యాంక్ ఆఫ్ అమెరికా మెరిల్ లించ్ అంచనా. ‘‘డిసెంబర్ త్రైమాసికంలో జీవీఏ 6.6%గా నమోదైనప్పటికీ... 2016–17 రెండో అర్ధభాగంలో వృద్ధి రేటు 7.5–8% ఉంటుంది. అయితే ఇది డీమోనిటైజేషన్ కంటే ముందు తాము వేసిన అంచనాల కంటే తక్కువే. వెనుకటి జీడీపీ సిరీస్‌లో వృద్ధి రేటు 4.5–5 స్థాయిల వద్దే నిలకడగా ఉండేది’’ అని బ్యాంక్ ఆఫ్ అమెరికా మెరిల్ లించ్ పేర్కొంది.