గంగవరం పెట్రోనెట్ ఎల్‌ఎన్‌జీ టెర్మినల్‌లో...
న్యూఢిల్లీ: ఆంధ్రప్రదేశ్‌లోని గంగవరం వద్ద నిర్మించతలపెట్టిన ద్రవీకృత సహజవాయువు(ఎల్‌ఎన్‌జీ) టెర్మినల్‌లో ప్రభుత్వ రంగ ఆయిల్ మార్కెటింగ్ దిగ్గజం హెచ్‌పీసీఎల్ వాటా తీసుకోనుంది. పెట్రోనెట్ ఎల్‌ఎన్‌జీ రూ. 5,000 కోట్ల వ్యయంతో ఏర్పాటు చేయప్రతిపాదించిన ఈ టెర్మినల్‌లో హెచ్‌పీసీఎల్ 8% వాటాను కొనుగోలు చేసే అవకాశముంది.
విశాఖపట్టణంలో గల రిఫైనరీకి భారీ స్థాయిలో గ్యాస్ అవసరముండటంతో గంగవరం టెర్మినల్ లో వాటాపట్ల హెచ్‌పీసీఎల్ ఆసక్తి చూపుతున్నట్లు పెట్రోనెట్ అధికారి ఒకరు పేర్కొన్నారు. ప్రస్తుతమున్న 8.33 మిలియన్ టన్నుల వార్షిక సామర్థ్యాన్ని 15 మిలియన్ టన్నులకు హెచ్‌పీసీఎల్ విస్తరిస్తోంది. ఫలితంగా రోజుకి 3 మిలియన్ల ప్రామాణిక ఘనపు మీటర్లవరకూ గ్యాస్ అవసరపడనుంది.
69% వాటా పెట్రోనెట్‌కు
ప్రాజెక్ట్‌లో వ్యూహాత్మక ఇన్వెస్టర్లకు 24% వాటాను ఆఫర్ చేయనునట్లు పెట్రోనెట్ అధికారి తెలిపారు. దీనిలో భాగంగా గంగవరం పోర్ట్ ఇప్పటికే 8% వాటాను తీసుకోగా, ఎల్‌ఎన్‌జీ సరఫరాదారులకు మరో 8% వాటాను పక్కనపెట్టినట్లు వెల్లడించారు. ఇక హెచ్‌పీసీఎల్‌కు 8% వాటా కొనుగోలుకి మాత్రమే అవకాశముందని వివరించారు. మరోవైపు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సైతం 5% వాటా తీసుకునేందుకు ఆసక్తి ప్రదర్శించిందని, దీంతో పెట్రోనెట్‌కు 69% వాటా మిగులుతుందని తెలిపారు.
ప్రభుత్వ రంగ సంస్థలు ఐవోసీ, ఓఎన్‌జీసీ, గెయిల్, బీపీసీఎల్ గతంలో కన్సార్షియంగా ఏర్పడి పెట్రోనెట్ ఎల్‌ఎన్‌జీలో విడిగా 12.5% చొప్పున వాటా పొందిన సంగతి తెలిసిందే. ఈ టెర్మినల్‌లో హెచ్‌పీసీఎల్‌కు వాటా లభించలేదు. కాగా, గంగవరంలో ఏర్పాటు చేయనున్న టెర్మినల్ నుంచి గెయిల్ 2.5 మిలియన్ టన్నుల ఎల్‌ఎన్‌జీ కొనుగోలుకి ఆసక్తిని వ్యక్తం చేసింది. ఇది ప్రతిపాదిత ఎల్‌ఎన్‌జీ టెర్మినల్ సామర్థ్యంలో సగభాగం కావడం గమనార్హం.
ఈ అంశంలో గెయిల్‌తో చర్చలు జరుగుతున్నాయని ఇప్పటికింకా ఏ విషయమూ ఖరారు కాలేదని పెట్రోనెట్ అధికారి చెప్పారు. గంగవరం ప్రాజెక్ట్‌కు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నుంచి గత నెలలో అన్ని అనుమతులూ లభించాయి. దీంతో 2018కల్లా టెర్మినల్‌ను పూర్తిచేయాలని పెట్రోనెట్ భావిస్తోంది.