ఇక్రా అంచనా...
న్యూఢిల్లీ: వృద్ధిని పెంచే సంస్కరణలు కావాలని ఫిక్కి ప్రెసిడెంట్ పంకజ్ పటేల్ కోరారు. వినియోగం జోరు పెంచే వృద్ధి ఆధారిత సంస్కరణలు, ఉద్యోగ కల్పన పెంచే పెట్టుబడులు అవసరమని పేర్కొన్నారు. మరోవైపు డిసెంబర్‌లో టోకు ధరల ద్రవ్యోల్బణం(డబ్ల్యూపీఐ) 3.39 శాతానికి పెరగడంతో జనవరి, ఫిబ్రవరిల్లో కూడా టోకు ధరల ద్రవ్యోల్బణం పెరిగే అవకాశాలే ఉన్నాయని ప్రముఖ రేటింగ్ సంస్థ, ఇక్రా అంచనా వేస్తోంది. 2015, డిసెంబర్‌లో మైనస్ 1.06 శాతంగా ఉన్న టోకు ధరల ద్రవ్యోల్బణం గత ఏడాది నవంబర్‌లో 3.15 శాతంగా నమోదైంది. పారిశ్రామికోత్పత్తి మెరుగుపడిందని తాజా గణాంకాలు వెల్లడించాయని, బేస్ ఎఫెక్ట్ దీనికి కారణమని ఫిక్కి ప్రెసిడెంట్ పంకజ్ పటేల్ చెప్పారు.
నిలకడైన వృద్ధి సాధించాలంటే సంస్కరణలపై దృష్టి పెట్టాలని సూచించారు. ముడి చమురు ధరలు పెరుగుతుండడం, డాలర్ బలపడుతుండడం వల్ల్ల గత నెలలో ఉత్పత్తి వ్యయాలు పెరిగాయని ఆసోచామ్ సెక్రటరీ జనరల్ డి.ఎస్. రావత్ చెప్పారు. ఇప్పటికే డిమాండ్ తగ్గి కుదేలై ఉన్న కంపెనీల లాభదాయకతపై ఉత్పత్తి వ్యయాలు పెరగడం ప్రతికూల ప్రభావం చూపుతోందని వివరించారు. ఆహార ద్రవ్యోల్బణం ఈ క్వార్టర్లో, టోకు ధరల ద్రవ్యోల్బణం జనవరి, ఫిబ్రవరిల్లో పెరిగే అవకాశాలున్నాయని ఇక్రా ప్రధాన ఆర్థిక వేత్త అదితి నాయర్ చెప్పారు.