టూవీలర్ అమ్మకాలపై పెద్దనోట్ల రద్దు ప్రభావం బాగానే ఉందని తాజా నివేదికలు వెల్లడించాయి. అక్టోబర్ నెల వరకూ రెండంకెల స్థాయిలో పరుగుపెట్టిన టూవీలర్స్ రంగం పెద్ద నోట్ల రద్దుతో కాస్త నెమ్మదించిందని రేటింగ్ సంస్థ ఇక్రా వెల్లడించింది. అయితే ఈ ఏడాది ద్విచక్ర వాహన అమ్మకాలు 7-8 శాతం వృద్ధి కనబరచనున్నట్లు నివేదించింది. వెరసి వాహన అమ్మకాలు ఏడాది మొత్తంగా 7-8 శాతం ప్రగతిని సాధించగలవని నివేదిక అభిప్రాయపడింది.
డీమానిటైజేషన్ కారణంగా ద్రవ్య సంక్షోభం కారణంగా అమ్మకాలు నవంబర్ ,జనవరి మధ్య 11.3 శాతం పడిపోయాయని తెలిపింది. ముఖ్యంగా ఏప్రిల్ నుంచి అమల్లోకి రానున్న బీఎస్-4 ప్రమాణాల మార్పిడి వంటి అంశాల కారణంగా నవంబర్ నుంచీ జనవరి వరకూ వాహన విక్రయాలు 11 శాతం చొప్పున మందగించినట్లు నివేదిక తెలియజేసింది. నోట్ బ్యాన్ సమయంలో మోపెడ్ల అమ్మకాలు డబుల్ డిజిట్ నమోదు చేశాయని, స్కూటర్ల అమ్మకాల వృద్ది 12.5 శాతంగా ఉన్నట్టు, సెప్టెంబర్ మాసం నాటి 24.7 శాతంతో పోలిస్తే చాలా తక్కువ అని అభిప్రాయపడింది.
మొత్తంమీద, పరిశ్రమ వృద్ధి రేటు గత నాలుగు ఆర్థిక సంవత్సరాలలతో మెరుగ్గానే ఉండనున్నట్టు అంచనా వేసింది. ఈ ఆర్థిక సంవత్సరం తొలి 10 నెలల(ఏప్రిల్-జనవరి)లో ద్విచక్ర వాహన అమ్మకాలు 8 శాతంపైగా వృద్ధి సాధించాయి. గత నాలుగేళ్ల అమ్మకాలతో పోలిస్తే ఇవి మెరుగైన ఫలితాలేనని పరిశ్రమ వర్గాలు పేర్కొంటున్నాయి. ఫిబ్రవరి, మార్చిలలోనూ 7 శాతం స్థాయిలో అమ్మకాలు నమోదుకాగలవని, 2018 లో మంచి అమ్మకాలు నమోదు కానున్నాయని ఇక్రా అంచనా వేస్తోంది.
ప్రధానంగా ఆఫ్రికా, దక్షిణ ఆసియా, లాటిన్ అమెరికాలో విదేశీ మార్కెట్లలో మంచి డిమాండ్ ఉందని తెలిపింది. తదుపరి రెండవ ఆర్థభాగంలో ప్రధానమైన మార్కెట్లు కోలుకుంటున్న సంకేతాల నేపథ్యంలో ఎగుమతులు క్రమంగా వచ్చే మూడేళ్లలో 8-10 శాతం వృద్ధి ఉండనుందని నివేదించింది. 2018లో తిరిగి 8-10 శాతం స్థాయిలో వృద్ధి నమోదుకావచ్చని ఐసిఆర్ఎ తన నివేదికలో పేర్కొంది. 2018లో స్కూటర్ల అమ్మకాలు మోటార్ సైకిళ్లను మించిపోగలవని ఇక్రా అభిప్రాయపడింది.