ఇన్ఫీలో చల్లారని ‘ప్యాకేజీ’ రగడ!
అభ్యంతరాలను వెనక్కితీసుకోలేదని తేల్చిచెప్పిన మూర్తి
♦ సిక్కా, మాజీ ఎగ్జిక్యూటివ్‌లకు ప్యాకేజీలు సరైనవే: చైర్మన్ శేషసాయి
♦ ప్రమోటర్లతో యుద్ధవాతావరం అంతా మీడియా సృష్టేనని వ్యాఖ్య
♦ మీడియా ‘డ్రామా’ కలవరపెడుతోందన్న సీఈఓ సిక్కా...
♦ వ్యవస్థాపకులతో సంబంధాలు అద్భుతంగా ఉన్నాయని వెల్లడి
ముంబై/న్యూఢిల్లీ/బెంగళూరు: దేశీ ఐటీ దిగ్గజం ఇన్ఫోసిస్‌లో కార్పొరేట్ గవర్నెన్స్ చిచ్చు... సెగలు పుట్టిస్తోంది. కార్పొరేట్ నైతిక ప్రమాణాలు దిగజారాయంటూ స్వయంగా వ్యవస్థాపకులు బట్టబయలు చేసినప్పటికీ.. కంపెనీ సీఈఓ విశాల్ సిక్కా, బోర్డు సభ్యులు మాత్రం సమస్యే లేదన్న రీతిలో వ్యవహరిస్తుండటం వివాదాన్ని మరింత ముదిరేలా చేస్తోంది. అత్యవసరంగా సోమవారం మీడియా ముందుకు వచ్చిన కంపెనీ డైరెక్టర్ల బోర్డు మరోసారి తమ నిర్ణయాలను సమర్థించుకుంది. వ్యవస్థాపకులకు ప్రస్తుత యాజమాన్యానికి మధ్య ఎలాంటి యుద్ధ వాతావరణం లేదన్న ఇన్ఫీ చైర్మన్ ఆర్. శేషసాయి.. సిక్కాతో పాటు ఇద్దరు మాజీ సీనియర్లకు ఇచ్చిన ప్యాకేజీలు సమంజసమేనని తేల్చిచెప్పారు.
అంతక్రితం ఇన్ఫీకి సంబంధించి మీడియా కథనాలను ‘డ్రామా’గా అభివర్ణించిన సీఈఓ సిక్కా.. ఇది తమను గందరగోళానికి, కలవరపాటుకు గురిచేస్తోందన్నారు. సోమవారం ముంబైలో జరిగిన కోటక్ ఇన్వెస్టర్ల సదస్సులో పాల్గొన్న సందర్భంగా ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. మరోపక్క, కార్పొరేట్ గవర్నెన్స్ లోపాలను పరిష్కరించాల్సిందేనని.. తన అభ్యంతరాలను వెనక్కితీసుకోలేదని కంపెనీ కీలక వ్యవస్థాపకుల్లో ఒకరైన నారాయణ మూర్తి స్పష్టం చేయడం గమనార్హం.
అప్పగించిన బాధ్యతలు నిర్వర్తిస్తున్నా..
సీఈవో విశాల్ సిక్కా వేతన పెంపు, మాజీ ఎగ్జిక్యూటివ్‌లకు భారీ ప్యాకేజీలనుఇన్ఫీ చైర్మన్ ఆర్ శేషసాయి సమర్థించుకున్నారు. బోర్డు తనకి అప్పగించిన బాధ్యతలే నిర్వర్తిస్తున్నట్లు వ్యాఖ్యానించారు. ‘షేర్‌హోల్డర్లు, బోర్డు నాకో పని అప్పగించారు. వారికి అభ్యంతరం లేనంత వరకూ నాకు అప్పగించిన బాధ్యతలను నిర్వర్తిస్తూనే ఉంటాను’ అని పేర్కొన్నారు. ప్రొఫెషనల్స్ సారథ్యంలోనే ఇన్ఫోసిస్ నడుస్తోందన్నారు. సిక్కా వేతనాన్ని 7.08 మిలియన్ డాలర్ల నుంచి 11 మిలియన్ డాలర్లకు పెంచినప్పటికీ.. అత్యధిక స్థాయి లక్ష్యాలను సాధిస్తేనే ఆయనకు ఈ మొత్తం దక్కుతుందని శేషసాయి చెప్పారు. పైగా ఈ ప్యాకేజీలో స్థిరంగా చెల్లించే భాగాన్ని 5.08 మిలియన్ డాలర్ల నుంచి 4 మిలియన్ డాలర్లకు తగ్గించినట్లు వివరించారు. ఇక కీలకమైన రహస్యాలను బైట పెట్టకుండా ఉండేందుకే మాజీ సీఎఫ్‌వో రాజీవ్ బన్సల్, జనరల్ కౌన్సిల్ డేవిడ్ కెనెడీలకు భారీ ప్యాకేజీ ఇచ్చారన్న మూర్తి ఆరోపణలపై స్పందిస్తూ.. ఇలాంటి ’అనుమానం తలెత్తడం.. తీవ్రంగా కలిచివేసే’ అంశమని శేషసాయి చెప్పారు. బన్సల్ చాలా చురుకైన సహోద్యోగి అని పేర్కొన్నారు. అయితే, టీమ్‌తో సఖ్యత విషయంలో సమస్యలు తలెత్తిన నేపథ్యంలో ఆయన నిష్క్రమణ ఇరు పక్షాలకు ఆమోదయోగ్యమైన విధంగానే జరిగిందని చెప్పారు. బన్సల్ తన బాధ్యతలను చిత్తశుద్ధితో నిర్వర్తించారని శేషసాయి కితాబిచ్చారు. వాస్తవానికి బన్సల్‌కి రూ. 17 కోట్లు చెల్లించేందుకు ఒప్పందం కుదిరినా కూడా అంతిమంగా రూ. 5 కోట్లే చెల్లించడం జరిగిందన్నారు.
అందరి లక్ష్యం కంపెనీ శ్రేయస్సే ..
సహవ్యవస్థాపకులు లేవనెత్తిన అంశాలపై స్పందిస్తూ.. ’వాటాదారులు, వ్యవస్థాపకుల మనసుల్లో కంపెనీ శ్రేయస్సు కోసం తపనే తప్ప మరో అంశం లేదు. వారి అభిప్రాయాలు తెలుసుకోవడం, అర్ధం చేసుకోవడం, తదనుగుణంగా తగు చర్యలు తీసుకోవడం మా విధి’ అని శేషసాయి పేర్కొన్నారు. ఈ విషయంలో ఎవరికీ స్వార్ధప్రయోజనాలు లేవని .. సంస్థ శ్రేయస్సే అందరి లక్ష్యమని చెప్పారు. యుద్ధవాతావరణం అంతా కూడా మీడియా సృష్టే తప్ప.. అలాంటి పరిస్థితేమీ లేదన్నారు. స్వతంత్ర డైరెక్టర్లు డీఎన్ ప్రహ్లాద్, పునీత కుమార్ సిన్హా నియామకాలు వారి అర్హతల ఆధారంగానే జరిగాయని చెప్పారు. ఇక న్యాయవాద సంస్థ సిరిల్ అమర్‌చంద్ మంగళదాస్ నియామకం.. గవర్నెన్స్‌పై మార్గదర్శకత్వం కోసమే తప్ప మధ్యవర్తిత్వం కోసం కాదని స్పష్టం చేశారు.
సిక్కాకు బాసట..
పోస్టల్ బ్యాలట్ ద్వారా అత్యధిక సంఖ్యలో వాటాదారుల ఆమోదం మేరకే విశాల్ సిక్కా వేతనాన్ని సవరించినట్లు శేషసాయి చెప్పారు. కుటుంబంతో కలిసి ప్రయాణాలకు సిక్కా కార్పొరేట్ జెట్ ఉపయోగించేవారని, ఆ బిల్లులను కంపెనీ ఖాతాలో వేసేవారని వచ్చిన ఆరోపణలను ఆయన ఖండించారు. ఇన్ఫోసిస్‌కు కార్పొరేట్ జెట్ లేనే లేదన్నారు. ‘గడచిన కొద్ది నెలల్లో విశాల్ సిక్కా ప్రయాణాల్లో ఎనిమిది శాతం మాత్రమే చార్టర్డ్ జెట్స్ ద్వారా జరిగాయి’ అని శేషసాయి చెప్పారు. ఇకనైనా వివాదాలను పక్కన పెట్టి తాము కంపెనీని నడపడంపైనే దృష్టి సారించేందుకు వాటాదారులు సహకరించాలని కోరారు.
ఇన్ఫీ వివరణ నిరాశపర్చింది: బాలకృష్ణన్
తాజా పరిణామాలపై ఇన్ఫోసిస్ వివరణ తనను నిరాశపర్చిందని కంపెనీ మాజీ సీఎఫ్‌వో వి.బాలకృష్ణన్ వ్యాఖ్యానించారు. సీఈవో జీతభత్యాల పెంపు, మాజీ ఎగ్జిక్యూటివ్‌లకు భారీ ప్యాకేజీల విషయంపై ‘నిర్దిష్ట సమాధానాలు’ ఇవ్వలేదని పేర్కొన్నారు.
నేను వెనక్కితగ్గను: మూర్తి
బోర్డుతో రాజీకి వచ్చినట్లు వచ్చిన వార్తలను మూర్తి ఖండించారు. తన అభ్యంతరాలపై వెనక్కితగ్గలేదని స్పష్టం చేశారు. ‘కార్పొరేట్ నైతిక ప్రమాణాల్లో లోపాలపై నేను లేవనెత్తిన ఆందోళనళలను బోర్డు తగినవిధంగా పరిష్కరించాల్సిందే. నిర్ణయాల్లో పూర్తి పారదర్శకత ఉందన్న భరోసా కల్పించాలి. తాజా ఉదంతానికి(ఇష్టానుసారంగా ప్యాకేజీలివ్వడం) కారకులైన వారిపై చర్యలు తీసుకోవాలి’ అని మూర్తి తేల్చిచెప్పారు. కాగా, ఇన్ఫీ బోర్డు నిజాయితీపై అడిగిన ప్రశ్నకు.. నేరుగా సమాధానం ఇవ్వలేదు. ‘వాళ్లంతా(బోర్డు సభ్యులు) మంచి పరిణితి, భావాలు ఉన్న వ్యక్తులే. అయితే, మంచివాళ్లు కూడా కొన్నిసార్లు తప్పులు చేస్తారు. వాటాదారుల ఆందోళనలను పూర్తిగా వినడం, అవసరమైతే నిర్ణయాలను పునఃపరిశీలిం చడం, తగిన దిద్దుబాటు చర్యలు చేపట్టడం.. ఇవన్నీ మంచి నాయకత్వ లక్షణాలు. కంపెనీ ఉజ్వల భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని వాళ్లు(బోర్డు) కార్పొరేట్ గవర్నెన్స్‌ను మెరుగుపరిచేవిధంగా తగిన దిద్దుబాటు చర్యలు చేపడతారని ఆశిస్తున్నా’ అని మూర్తి స్పష్టం చేశారు.
ఇంత గొప్ప కంపెనీకి సారథ్యం నా అదృష్టం: సిక్కా
ఇన్ఫీలో తాజా పరిరిణామాలపై సిక్కా తొలిసారిగా సోమవారం మీడియాతో మాట్లాడారు. ‘మీడియాలో ఇప్పుడు నడుస్తున్న ఈ డ్రామా చాలా గందరగోళానికి గురిచేస్తోంది. అయితే, ఎంతగా మమ్మల్ని కలవరపెట్టినా కంపెనీ అత్యంత పటిష్టమైన మూలాలపై నిలబడిందన్నది మాత్రం మర్చిపోవద్దు. అంతేకాదు ఇంతగొప్ప సంస్థకు సారథిగా ఉండటం నిజంగా నా అదృష్టం’ అని సిక్కా పేర్కొన్నారు.
వ్యవస్థాపకులతో సత్సంబంధాలే...
ఇన్ఫీ వ్యవస్థాపకులతో తన సంబంధాలు అద్భుతంగా ఉన్నాయని సిక్కా స్పష్టం చేశారు. ‘మూర్తిని క్రమం తప్పకుండా కలుస్తూనే ఉంటా. ఏడాదిలో సుమారు ఐదారుసార్లు కలిశా. ఆయనతో నాకు అత్యంత సుహృద్భావమైన సంబంధాలు ఉన్నాయి. అయితే, ఇతర వ్యవస్థాపకులను మాత్రం ఇంత తరచూ కలవడడం లేదు’ అని ఆయన పేర్కొన్నారు. కాగా, సిక్కా బోర్డుతో కార్పొరేట్ గవర్నెన్స్‌కు సంబంధించిన పోరును మూర్తి ఇంతటితో ముగిస్తున్నట్లు మీడియాలో సోమవారం తొలుత వార్తలు వచ్చాయి. ఈ నేపథ్యంలో సిక్కా అంతా సజావుగానే ఉందన్న రీతిలో వ్యాఖ్యలు చేశారు. నారాయణ మూర్తిని ఒక ‘అత్యత్భుతమైన వ్యక్తి’ అంటూ సిక్కా పేర్కొనడం విశేషం. కాగా, భారీ నగదు నిల్వల సద్వినియోగంపై కొందరు మాజీ సీనియర్ ఎగ్జిక్యూటివ్‌లు లేవనెత్తిన ప్రశ్నల గురించి స్పందిస్తూ... నిధుల కేటాయింపులపై కంపెనీ బోర్డు ఎప్పుటికప్పుడు మదింపు చేస్తుందని.. తగిన సమయంలో దీనిపై నిర్ణయం తీసుకుంటామని సిక్కా చెప్పారు.
ఏం జరిగిందంటే..
♦ సీఈఓ విశాల్ సిక్కా వార్షిక వేతన ప్యాకేజీని(స్టాక్ ఆప్షన్స్, పనితీరు ఆధారిత వేతనం ఇతరత్రా అన్నీ కలిపి) ఈ ఏడాది నుంచి 11 మిలియన్ డాలర్లకు పెంచేందుకు ఇన్ఫోసిస్ బోర్డు గతంలో ఆమోదం తెలిపింది.
♦ దీంతో పాటు ఇన్ఫీ నుంచి వైదొలగిన మాజీ సీఎఫ్‌ఓ రాజీవ్ బన్సల్‌కు భారీ మొత్తంలో వీడ్కోలు ప్యాకేజీ(దాదాపు అన్నీ కలిపి రూ.23 కోట్లు), అదేవిధంగా మరో సీనియర్ ఎగ్జిక్యూటివ్(జనరల్ కౌన్సిల్) డేవిడ్ కెన్నడీకి రూ.5.85 కోట్ల రాజీనామా ప్యాకేజీని ఇవ్వడానికి బోర్డు ఓకే చెప్పింది.
♦ ఇక్కడే గొడవంతా మొదలైంది. ఇంత భారీగా ప్యాకేజీలను ఇవ్వడంపై కీలక వ్యవస్థాకులైన నారాయణ మూర్తి, నందన్ నీలేకని, క్రిస్ గోపాలకృష్ణన్‌లు తీవ్ర అభ్యంతరం లేవనెత్తారు. దీన్ని వ్యతిరేకిస్తూ బోర్డుకు లేఖ కూడా రాశారు.
♦ అలాంటి లోపాలేవీ లేవని, అవన్నీ వదంతులేనంటూ సీఈఓ సిక్కా, ఇతర బోర్డు సభ్యులు గతవారంలో వివరణ ఇచ్చారు.
♦ అయితే, కార్పొరేట్ ప్రమాణాలు గత రెండేళ్లుగా పడిపోతూవస్తున్నాయని నారాయణ మూర్తి స్వయంగా పేర్కొనడంతో విభేదాలు నిజమేనని బట్టబయలైంది. బోర్డును ప్రక్షాళన చేయాలని కూడా చెప్పడంతో ప్రస్తుత నాయకత్వంపై వ్యవస్థాపకులు తీవ్ర అసంతృప్తితో ఉన్నట్లు స్పష్టమైంది.
♦ కంపెనీలో వ్యవస్థాపకులకు ప్రస్తుతం దాదాపు 13% వాటా ఉంది. ఇప్పుడున్న కంపెనీ మార్కెట్ విలువ(రూ.2,25,905 కోట్లు) ప్రకారం చూస్తే.. వ్యవస్థాపకుల వాటా విలువ దాదాపు రూ.30 వేల కోట్లు కావడం గమనార్హం.